రాజ్‌వీర్, రాంజీలాల్, దివాకర్
హాత్రస్.. యూపీలోని ఒక కీలక నియోజకవర్గం. ఈ పేరు వినగానే అందరికీ రంగుల హోలీ పండుగ గుర్తొస్తుంది. యూపీలో హాత్రస్ రంగులకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఎన్నికల వేళ ఏ పార్టీకి రంగు పడుతుందా అన్న ఆసక్తి నెలకొంది. హాత్రస్‌లో అభివృద్ధి కంటే పేరు మార్పు శరవేగంగా జరిగిందంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. రాష్ట్రంలో పార్టీ అధికారం మారిన ప్రతీసారి పేరుని మార్చి పారేస్తుంటారు. ఈ నేమ్ ఛేంజ్ పార్టీల మధ్య ఒక గేమ్‌గా మారింది.
ఎన్నిసార్లు పేరు మార్చారంటే..
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఉండే హాత్రస్ పేరు మార్పు మొదటిసారిగా 1997లో జరిగింది. అప్పుట్లో యూపీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాత్రస్‌ను మహామాయానగర్ అని మార్చి జిల్లా హోదా కల్పించారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం అధికారంలోకి రాగానే ములాయం సింగ్ యాదవ్ తిరిగి హాత్రస్ పేరుని పునరుద్ధరించారు. 2007లో మాయావతి అధికారంలోకి రాగానే మళ్లీ మహామాయానగర్ అని పిలవాలని హుకుం జారీ చేశారు. 2012లో అఖిలేష్ యాదవ్ సీఎం కుర్చీ ఎక్కగానే మళ్లీ పాత పేరునే పెట్టేశారు. ప్రస్తుతానికైతే హాత్రస్ పేరుతోనే ఈ జిల్లా కొనసాగుతోంది. ఇలా పార్టీ మారిన ప్రతీసారి పేరు మారుస్తుండటంతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. పేరు మార్చడానికి చూపించే శ్రద్ధ జిల్లా అభివృద్ధిలో ఎందుకు లేదని స్థానికులు నిలదీస్తున్నారు.
హాత్రస్ దేనికి ప్రసిద్ధి అంటే..
ఈ నియోజకవర్గంలో హోలీ రంగుల తయారీయే అతి పెద్ద పరిశ్రమ. ఇక్కడ దొరికే ఇంగువ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందితే, ఆభరణాల్లో వాడే రంగురాళ్లకి గిరాకీ ఎక్కువే. ఇక బంగాళదుంప పంటకి పెట్టింది పేరు. కానీ ప్రాసెసింగ్ యూనిట్లు లేక చాలామంది రైతులు దుంపల్ని ఇప్పుడు సాగు చేయడం లేదు.
రాజకీయ చరిత్ర
ఎస్సీలకు రిజర్వు చేసిన హాత్రస్ లోక్‌సభ నియోజకవర్గంలో కమలనాథులదే ఎప్పుడూ హవా. ఇప్పటికే ఆరుసార్లు ఇక్కడ గెలిచిన బీజేపీ ఏడోసారి కూడా గెలుపు కోసం తహతహలాడుతోంది. 1996–2009 మధ్య కాలంలో బీజేపీకి చెందిన కిషన్ లాల్ దిలేర్ నాలుగుసార్లు గెలిచారు. ఆ తర్వాత రాష్ట్రీయ లోక్‌దళ్‌కి చెందిన సారిక బఘేల్ ఆ స్థానంలో గెలుపొందారు. తిరిగి గత ఎన్నికల్లో బీజేపీకి చెందిన రంజన్ కుమార్ దివాకర్ గెలుపొందారు.
పోటీ ఎలా ఉందంటే..
ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ, జాటవ్ సామాజిక వర్గానికి చెందిన రంజన్‌కుమార్‌ను పక్కన పెట్టి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కిషన్‌లాల్ దిలేర్ కుమారుడు రాజ్‌వీర్ సింగ్‌కు దిలేర్‌కు సీటు ఇచ్చింది. ఇక్కడ వల్మీకి వర్గం మద్దతు బీజేపీకి లభించకపోవచ్చని అంచనా. ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమి రాంజీలాల్ సుమన్‌ను బరి లోకి దింపింది. ఫిరోజాబాద్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన సుమన్‌కు ఎస్‌సీ, జాటవులు, ముస్లింల మద్దతు లభించే అవకాశాలున్నాయి. దీనికి సాయం కూటమి ఓటు బ్యాంకుతో ఆయన పవర్‌ఫుల్ అభ్యర్థిగా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున త్రిలోక్‌రామ్ దివాకర్ బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment