స్కూలు ఆటో బోల్తా
ఆరుగురు విద్యార్థులకు గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం
చిత్తూరు: పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మిట్టపల్లి గ్రామ సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మండల పరిధిలోని అట్టికుప్పం, సాకలి కుప్పం గ్రామాలకు చెందిన విద్యార్థులు కర్ణాటక సరిహద్దులోని రాజీపేట రోడ్లోని ప్రగతి పాఠశాలకు వెళ్తున్నారు.
కాగా.. ప్రతి రోజు పాఠశాలకు చెందిన వ్యానులో వెళ్లే విద్యార్థులు ఈ రోజు వ్యాను చెడిపోవడంతో ఆటో ఎక్కారు. ఆటో మిట్టపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఆటోలో ఉన్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భరత్(13), హేమ(12), చంటి(6) పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.