Prahlada Joshi
-
కేంద్రం ఇచ్చిన 2.5 లక్షల కోట్లు ఏమయ్యాయి..?
సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రైల్వే, హైవే, మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టుల కింద వచ్చిన రూ.2.5 లక్షల కోట్లు ఏమయ్యాయో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలను రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లకు పెంచినా దీన్నుంచి పొలాలకు ఒక్క చుక్కనీరు కూడా రాలేదని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్‌పై వెచ్చించిన వ్యయం, సవివర నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాక అక్రమాలపై విచారణ జరుపుతామని చెప్పారు. పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో భాగంగా శుక్రవారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా జోషి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన పనులను పక్కన పెట్టి కేవలం రాజకీయాలు చేసేందుకే పరిమితమైందన్నారు. తెలంగాణకు ఇచ్చే చౌక బియ్యానికి కేంద్రం 85 శాతం ఖర్చు చేస్తోంటే, టీఆర్ఎస్ నేతలు బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా నిధుల దుర్వినియోగం, వ్యయంపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికపై మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. తెలంగాణలో సంపాదించిన డబ్బును జాతీయ రాజకీయాల్లో ఖర్చు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో రూపాయి మారకం విలువ దిగజారిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా.. రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం ఇతర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని బదులిచ్చారు. నిధులు దారిమళ్లిస్తోంది... కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోగా, వివిధ పథకాల కింద వస్తున్న నిధులను టీఆర్ఎస్ సర్కార్ దారి మళ్లించి పథకాల పేర్లు మారుస్తోందని జోషి మండిపడ్డారు. వర్షాకాలంలో వరదలు, నీళ్లు నిలిచిపోవడం వంటి కారణాలతోనే పదిశాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం చెప్పిందన్నారు. ఇందులో టీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరించడం లేదా ఏదో ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చడం కోసమో కాదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా టీఆర్ఎస్తో సహా బలహీనపడుతున్న పార్టీలు మోదీ ప్రభుత్వంపై ఏదో ఒక నెపం మోపి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. -
పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఎంపీల వినతి మేరకే షెడ్యూల్‌కు రెండు రోజులు ముందుగానే నిరవధికంగా వాయిదా వేసినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 12 కంటే ముందుగానే ముగించడం తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని, సభను నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. సభలో చర్చ జరగాలంటూ బయటకు చెప్పుకుంటూ అంతరాయం కలిగించడం, వాకౌట్ చేయడం ప్రతిపక్షాల ఎజెండాగా మారిందని విమర్శించారు. ‘ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా వర్షాకాల సమావేశాలను షెడ్యూల్ కంటే 4 రోజులు కాదు, 2 రోజులు ముందుగా వాయిదా వేశాం. ప్రతిపక్ష సభ్యులు సహా పలువురు ఎంపీలు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని పేర్కొన్నారు. చదవండి: నితీశ్‌కు వెన్నుపోటు అలవాటే: బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ సభలో కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై ఆయన స్పందిస్తూ..‘అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక కుటుంబం వ్యక్తిగత సమస్యలపై పార్లమెంట్ సమయాన్ని వృథా చేశారు. ప్రజాప్రయోజనాల కంటే ఒక కుటుంబాన్ని రక్షించడానికే ఎక్కువ ఆసక్తి చూపారు’అని ఎత్తిపొడిచారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్‌ని ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. చదవండి: నలుగురికి కోవిడ్ పాజిటివ్.. భారత పర్యాటకులపై నేపాల్ నిషేధం TMC leader @derekobrienmp should stop preaching about democratic values and the sanctity of institutions. The people of Bengal have elected BJP as the main opposition but TMC, in its arrogance, has denied BJP the post of PAC Chairman. https://t.co/YeKpYJdXWE — Pralhad Joshi (@JoshiPralhad) August 8, 2022 -
కర్ణాటక ఎన్నికలు; బీజేపీకి మరో షాక్
హుబ్లీ: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారు..’ అని అమిత్ షా ప్రసంగాన్ని తప్పుగా అనువదించిన ఎంపీ ప్రహ్లాద్ జోషి గుర్తున్నారు కదా, నోరుజారి అభాసుపాలైన ఆ కీలక నేత.. ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొత్త తలనొప్పులు కొనితెచ్చుకున్నారు. విద్వేషం: హుబ్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్వాడ ఎంపీ అయిన ప్రహ్లాద్ జోషి శుక్రవారం సదార్సోఫా గ్రామంలో పర్యటించారు. ‘‘ఇది ఊరు కాదు, మినీ పాకిస్తాన్లా ఉంది. ఇక్కడి మసీదుల్లో అక్రమంగా ఆయుధాలను దాచి ఉంచారు’’ అని ఎంపీ అనడంతో అక్కడున్నవారు షాకయ్యారు. ఇటీవలే మరణించిన ఓ బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సదార్సోఫా ముస్లిం మత పెద్దలు కసభాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఎంపీ ప్రహ్లాద్ జోషిపై ఐపీసీ153, 298 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. వరుస షాక్‌లు: ‘యడ్యూరప్ప అవినీతిలో నంబర్ వన్’ అని అమిత్ షా నోరుజారడం మొదలు.. ‘మోదీ దేశాన్ని నాశనం చేశాడ’నే తప్పుడు అనువాదం, షా ప్రసంగిస్తున్నవేళ యడ్డీ కునుకు తీయడం, ఇప్పుడు ఏకంగా బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషిపై కేసు నమోదు కావడం.. ఇలా బీజేపీ కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
అక్రమ మైనింగ్‌పై వైఖరి మారిందా?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చిందులు వేసిందని, బెంగళూరు నుంచి బళ్లారి దాకా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లిందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ అక్రమ మైనింగ్‌లో భాగస్వామి అయిన ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్‌ను వెనకేసుకొస్తోందని విమర్శించారు. స్థానిక మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు బళ్లారికి పాదయాత్రగా వెళుతూ డ్యాన్సులు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన సంతోష్ లాడ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారని దెప్పి పొడిచారు. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆయన చిత్తశుద్ధితో చర్యలు తీసుకునేట్లయితే వెంటనే లాడ్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కాగా అధికారుల బదిలీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకే చెందిన 20 మంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. విద్యా శాఖలో బదిలీల్లో కూడా భారీగా ముడుపులు అందాయని ఆరోపించారు. ఇది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని తేలిపోయిందన్నారు. అన్నభాగ్య పథకం కింద నాసిరకం బియ్యం ఇస్తున్నారని, పౌర సరఫరా వ్యవ స్థలో కిరోసిన్, చక్కెర పంపిణీని ఆపి వేశారని విమర్శించారు. దీని వల్ల మధ్య తరగతి కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని ఆయన తెలిపారు. ఏకవచన సంభోదన సమంజసమే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం శివమొగ్గలో ఏక వచన ప్రయోగంతో తిట్టడంలో తప్పేమీ లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యడ్యూరప్ప అలా మాట్లాడడానికి సిద్ధరామయ్యే ప్రేరణ అని చెప్పారు. అభివ ృద్ధి గురించి ప్రశ్నించినప్పుడు సిద్ధరామయ్య తగు రీతిలో సమాధానం చెప్పాల్సింది పోయి ‘జైలుకు వెళ్లిన వారు’ అని పేర్కొనడంతో యడ్యూరప్ప అలా మాట్లాడాల్సి వచ్చిందని సమర్థించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధరామయ్య నోటికొచ్చినట్లు మాట్లాడారని చెబుతూ, ఇప్పుడు యడ్యూరప్ప అదే ధోరణిలో మాట్లాడడంలో తప్పేముందని ప్రశ్నించారు.