సాక్షి, హైదరాబాద్/హఫీజ్‌పేట్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రైల్వే, హైవే, మౌలిక వసతులు, ఇతర ప్రాజెక్టుల కింద వచ్చిన రూ.2.5 లక్షల కోట్లు ఏమయ్యాయో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలను రూ.40 వేల కోట్ల నుంచి రూ.1.20 లక్షల కోట్లకు పెంచినా దీన్నుంచి పొలాలకు ఒక్క చుక్కనీరు కూడా రాలేదని ఆరోపించారు.
ఈ ప్రాజెక్ట్‌పై వెచ్చించిన వ్యయం, సవివర నివేదిక రాష్ట్ర ప్రభుత్వం సమర్పించాక అక్రమాలపై విచారణ జరుపుతామని చెప్పారు. పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో భాగంగా శుక్రవారం చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా జోషి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సర్కార్ అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన పనులను పక్కన పెట్టి కేవలం రాజకీయాలు చేసేందుకే పరిమితమైందన్నారు.
తెలంగాణకు ఇచ్చే చౌక బియ్యానికి కేంద్రం 85 శాతం ఖర్చు చేస్తోంటే, టీఆర్‌ఎస్ నేతలు బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా నిధుల దుర్వినియోగం, వ్యయంపై కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇచ్చిన నివేదికపై మాట్లాడకుండా కేసీఆర్, కేటీఆర్ ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు.
తెలంగాణలో సంపాదించిన డబ్బును జాతీయ రాజకీయాల్లో ఖర్చు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని దుయ్యబట్టారు. మోదీ పాలనలో రూపాయి మారకం విలువ దిగజారిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించగా.. రష్యా యుద్ధం, ద్రవ్యోల్బణం ఇతర కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా భారత్ మెరుగైన స్థితిలోనే ఉందని బదులిచ్చారు.
నిధులు దారిమళ్లిస్తోంది...
కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేయకపోగా, వివిధ పథకాల కింద వస్తున్న నిధులను టీఆర్‌ఎస్ సర్కార్ దారి మళ్లించి పథకాల పేర్లు మారుస్తోందని జోషి మండిపడ్డారు. వర్షాకాలంలో వరదలు, నీళ్లు నిలిచిపోవడం వంటి కారణాలతోనే పదిశాతం బొగ్గును దిగుమతి చేసుకోవాలని కేంద్రం చెప్పిందన్నారు. ఇందులో టీఆర్‌ఎస్ ఆరోపిస్తున్నట్టుగా బొగ్గు పరిశ్రమను ప్రైవేటీకరించడం లేదా ఏదో ప్రైవేట్ సంస్థకు ప్రయోజనం చేకూర్చడం కోసమో కాదని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌తో సహా బలహీనపడుతున్న పార్టీలు మోదీ ప్రభుత్వంపై ఏదో ఒక నెపం మోపి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment