బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో ధర్వాడ ఎంపీ ప్రహ్లాద్ జోషి.
హుబ్లీ: ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ‘ప్రధాని మోదీ దేశాన్ని సర్వనాశనం చేశారు..’ అని అమిత్ షా ప్రసంగాన్ని తప్పుగా అనువదించిన ఎంపీ ప్రహ్లాద్ జోషి గుర్తున్నారు కదా, నోరుజారి అభాసుపాలైన ఆ కీలక నేత.. ఇప్పుడు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి కొత్త తలనొప్పులు కొనితెచ్చుకున్నారు.
విద్వేషం: హుబ్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్వాడ ఎంపీ అయిన ప్రహ్లాద్ జోషి శుక్రవారం సదార్సోఫా గ్రామంలో పర్యటించారు. ‘‘ఇది ఊరు కాదు, మినీ పాకిస్తాన్‌లా ఉంది. ఇక్కడి మసీదుల్లో అక్రమంగా ఆయుధాలను దాచి ఉంచారు’’ అని ఎంపీ అనడంతో అక్కడున్నవారు షాకయ్యారు. ఇటీవలే మరణించిన ఓ బీజేపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ సదార్సోఫా ముస్లిం మత పెద్దలు కసభాపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఎంపీ ప్రహ్లాద్ జోషిపై ఐపీసీ153, 298 సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.
వరుస షాక్‌లు: ‘యడ్యూరప్ప అవినీతిలో నంబర్ వన్’ అని అమిత్ షా నోరుజారడం మొదలు.. ‘మోదీ దేశాన్ని నాశనం చేశాడ’నే తప్పుడు అనువాదం, షా ప్రసంగిస్తున్నవేళ యడ్డీ కునుకు తీయడం, ఇప్పుడు ఏకంగా బీజేపీ కీలక నేత ప్రహ్లాద్ జోషిపై కేసు నమోదు కావడం.. ఇలా బీజేపీ కర్ణాటక ఎన్నికల ప్రచార పర్వంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment