బెంగళూరు: కర్ణాటకలో అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ‘‘మెజార్టీ కంటే 15 నుంచి 20 సీట్లు ఎక్కువే గెలుస్తాం. కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయిలో మద్దతు ఏమాత్రం తగ్గలేదు. చరిత్ర చూసినా బీజేపీ రెబెల్స్ గెలిచిన సందర్భాలు లేవు. ఈసారీ అదే నిరూపితమవనుంది’’ అని శనివారం ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటుపడటంపై బీజేపీని కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ దేశంలో ఏ కుటుంబం కూడా చట్టం కంటే గొప్పదికాదు. అన్నింటికంటే చట్టమే అత్యున్నతమైంది’ అని వ్యాఖ్యానించారు.
ఎంపీ బంగ్లా ఖాళీచేస్తూ ఈ ఉదంతంలో బాధితుడినయ్యానని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందించారు. ‘ ఓబీసీలను కించపరిచేలా మాట్లాడాలని రాహుల్‌ను మేం అడగలేదు. ఇప్పుడు క్షమాపణ చెప్పకూడదని నిర్ణయించుకుంది కూడా ఆయనే. ఏ చట్టం కింద అయితే ఆయన దోషిగా తేలారో ఆ చట్టం కాంగ్రెస్ హయాంలో రూపొందిందే. ఆ చట్టాన్ని ఉపసంహరించేందుకు నాటి ప్రధాని మన్మోహన్ ప్రయత్నిస్తే ఆర్డినెన్స్ పత్రాలు చించి రాహులే అడ్డుకున్నారు. ఇప్పుడు ‘బాధితుడిని’ అంటూ నాటకాలు ఆడొద్దు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ మోదీని విమర్శించారనే జమ్మూకశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీచేసిందనేది అబద్ధం. గతంలోనూ ప్రశ్నించేందుకు ఆయనను సీబీఐ పిలిచింది’ అని గుర్తుచేశారు.
ఏటీఎంలా వాడుకున్న కాంగ్రెస్
‘‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇంతవరకూ ఏ కోర్టులోనూ నిరూపణకాలేదు. ఇవన్నీ కాంగ్రెస్ కట్టుకథలు’’ అని అమిత్ షా అన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెసే రాష్ట్రాన్ని ‘ఏటీఎం’లా వాడుకుందని ఆరోపించారు. ‘‘యూపీఏ హయాంలో 2009–19లో కర్ణాటకకు కేవలం రూ.94 వేల కోట్ల నిధులొచ్చాయి. మా హయాంలో 2014–19లో ఏకంగా రూ.2.26 లక్షల కోట్ల నిధులు ఇచ్చి ఆదుకున్నాం. వాళ్లు పన్నులు, గ్రాంట్–ఎయిడ్ కింద రూ.22 వేల కోట్లు ఇస్తే మేం రూ.75 వేల కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment