Prakash Nanjappa
-
రియో నుంచి భారత స్టార్ షూటర్ ఔట్
భారత స్టార్ షూటర్ జీతూ రాయ్ మరోసారి నిరాశపరిచాడు. బుధవారం జరిగిన 50 మీటర్ల పిస్టర్ విభాగంలో ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. చివరి రౌండ్ లో 8, 8 తో స్టార్ట్ చేసిన జీతూ.. కేవలం 554 పాయింట్లు స్కోర్ చేసి 12వ స్థానంలో నిలిచి ఫైనల్ కు అర్హత సాధించలేకపోయాడు. మరో షూటర్ ప్రకాశ్ నంజప్పా 547 పాయింట్లు స్కోరు చేసి 25వ స్థానంలో నిలిచి దారుణ ప్రదర్శన చేశాడు. ఫైనల్ చేరాలంటే కచ్చితంగా టాప్ 8 లో నిలవాల్సిన ఈవెంట్లో భారత షూటర్లు గురి తప్పారు. రియోలో పోటీపడ్డ తొలి ఈవెంట్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో నిరాశపరిచిన జీతూ.. అతి కష్టం మీద ఫైనల్‌కు అర్హత సాధించినా పతకం నెగ్గలేకపోయిన విషయం తెలిసిందే. మరోవైపు మహిళా ఆర్చర్ బొంబేలా దేవి బాణం గురితప్పలేదు. రౌండ్-64, రౌండ్-32లలో ఏకాగ్రతతో బాణాలు సంధించి విజయాన్ని నమోదుచేసి రౌండ్-16(ప్రీ క్వార్టర్స్) కు చేరుకుని భారత శిబిరంలో ఆశలు నింపింది. -
ఆసియా క్రీడల్లో భారత్ కు మరో పతకం
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ మరో పతకం దక్కించుకుంది. రెండో రోజు షూటింగ్ టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్, సమరేశ్ జంగ్, ప్రకాశ్ నంజప్పా కూడిన బృందం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. ఈ టోర్నిలో జీతూ రాయ్ రెండో పతకం సాధించడం విశేషం. తొలిరోజు అతడు స్వర్ణ పతకం గెల్చుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అతడు పసిడి పతకం సాధించాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో శ్వేతా చౌదురి కాంస్యం కైవసం చేసుకుంది. -
పక్షవాతం నుంచి పతకం దాకా....
సరిగ్గా ఏడాది క్రితం ఆయనకు పక్షవాతం వచ్చింది. ముఖం, ముఖ్యంగా నోరు వంకర పోయింది. ఒక కన్ను కూడా వంకరపోయింది. దాన్ని బెల్స్ పాల్సీ అంటారు. దాంతో ఆయన ప్రపంచం ఉన్నట్టుండి కుప్పకూలిపోయినట్టయింది. ఆయన జీవితమే మారిపోయింది. కానీ ఆయనలోకి క్రీడా స్ఫూర్తి, పట్టుదల ఓటమిని అంగీకరించవద్దని చెప్పింది. తండ్రి పాపన్న కూడా అనారోగ్యాన్ని ధైర్యంగా ఎదుర్కొని గెలవమని ప్రోత్సహించాడు. దాంతో ఆయన పోరాటాన్ని కొనసాగించాడు. సరిగ్గా ఏడాది తిరిగేసరికి కామన్వెల్త్ ఆటల పోటీల్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ లో పాల్గొన్నాడు. పాల్గొనడమే కాదు రజత పతకాన్నీ గెలుచుకున్నాడు. అతనే భారత్ కి చెందిన షూటర్ ప్రకాశ్ నంజప్ప. బెంగుళూరుకు చెందిన ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 198.2 పాయింట్లు సాధించి, రెండో స్థానంలో నిలుచున్నారు. పతకం పొందటమే కాదు మన జాతీయ పతాకం గ్లాస్గోలో రెపరెపలాడేలా చేశాడు ప్రకాశ్ నంజప్ప. ప్రకాశ్ నంజప్ప తండ్రి కూడా జాతీయ స్థాయి షూటర్. ప్రకాశ్ 2003 లో ఆట నుంచి బ్రేక్ తీసుకుని ఆరేళ్ల పాటు కెనడాలో ఉద్యోగం చేశాడు. 2009 లో మళ్లీ తిరిగి వచ్చి షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పుడు పక్షవాతం నుంచి పతకం దాకా ఎదిగి పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించాడు. -
కామన్వెల్త్ గేమ్స్: భారత్ రజత 'ప్రకాశం'
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ షూటర్ల హవా కొనసాగుతోంది. షూటింగ్లో భారత్‌కు మరో పతకం దక్కింది. శనివారం జరిగిన పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ షూటర్ ప్రకాశ్ నంజప్ప రజత పతకం సాధించాడు. ప్రకాశ్ 198.2 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచి పతకం సొంతం చేసుకున్నాడు. ఈ ఈవెంట్లో డానియల్ రెపచొలి 199.5 పాయింట్లతో ప్రథమ స్థానం సాధించి పసిడి దక్కించుకున్నాడు. కాగా ఇదే విభాగంలో మరో భారత షూటర్ ఓం ప్రకాశ్ పాల్గొన్న ఫైనల్స్‌కు ముందే వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత షూటర్లు అభినవ్ బింద్రా స్వర్ణం, మలైకా గోయెల్ రజతం సాధించిన సంగతి తెలిసిందే.