మంత్రి ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం
ఖాట్మాండు: నేపాల్ విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రకాష్ శరణ్ మహట్ సహా 150 మంది ప్రయాణిస్తున్న విమానానికి చిన్న ప్రమాదం జరిగింది. మంగళవారం ఢిల్లీ నుంచి ఖాట్మాండుకు వెళ్లిన నేపాల్ ఎయిర్ లైన్స్ విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో టైరు పేలిపోయింది. విమానం పాక్షికంగా దెబ్బతిని, రన్ వేపై ఆగిపోయింది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి సహా ప్రయాణికులు భయపడిపోయారు. కాగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రితో సహా ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, వారిని ఎయిర్పోర్టు టర్మినల్ వద్దకు చేర్చామని అధికారులు తెలిపారు.
కాగా విమానంతో పాటు రన్ వే పాక్షికంగా దెబ్బతినడంతో గంటసేపు విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరమ్మత్తుల తర్వాత పునరుద్ధరించారు. భారత్ పర్యటనకు వచ్చిన ప్రకాష్ శరణ్ ఈ రోజు స్వదేశానికి తిరిగి వెళ్లారు.