తుమ్మిడిహెట్టితో 2 లక్షల ఎకరాలకు నీరు
ఆదిలాబాద్ జిల్లాకు ప్రయోజనం చేకూరేలా వ్యాప్కోస్ నివేదిక
హైదరాబాద్: ప్రాణహిత సాగునీటి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మించనున్న బ్యారేజీతో ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా తుది ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తంగా 14.4 టీఎంసీల ప్రాణ హిత నీటిని తుమ్మిడిహెట్టి నుంచి నిర్ణీత ఆయకట్టుకు అందించేలా సర్వే సంస్థ వ్యాప్కోస్ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. వాస్తవానికి ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడిహెట్టి గ్రామంలో నిర్మించదలిచిన బ్యారేజీలో ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
గోదావరి నుంచి 90 రోజుల్లో 160 టీఎంసీలు తీసుకోవాలంటే ప్రతిరోజూ 1.8 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. అయితే ఈ స్థాయిలో నీటి లభ్యత తుమ్మిడిహెట్టి వద్ద లేదని వ్యాప్కోస్ తేల్చడం, అదీగాక బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు మహారాష్ట్ర అంగీకారం తెలపని నేపథ్యంలో ఈ ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా ‘కాళేశ్వరం’ ఎత్తిపోతలను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఇదే సమయంలో ప్రాణహిత నీటిని ఆదిలాబాద్ జిల్లా వరకే పరిమితం చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా వ్యాప్కోస్తో సర్వే చేయించింది.