Pranjal Patil
-
తనను తాను గెలిపించుకుంది
తనకు తీపిని పంచిన వాళ్లెవ్వరినీ నేరుగా చూడలేదు ప్రాంజల్. మనోనేత్రంతో మాత్రమే ఆ అభిమానాన్ని ఆస్వాదించింది. అదే నేత్రంతో ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకుని చక్కటి పాలనను అందించగలుగుతుందనే నమ్మకాన్ని కూడా కలిగిస్తోంది. చూపు లేకపోవడం లక్ష్యాన్ని సాధించడానికి అడ్డంకి కాదని నిరూపించిన ముప్పై ఏళ్ల ప్రాంజల్ పాటిల్.. తొలి ‘విజువల్లీ చాలెంజ్డ్’ ఉమన్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కొత్త రికార్డును సృష్టించింది! ప్రాంజల్ పాటిల్.. 2016లో యూపీఎస్సీ రాసింది. 773వ ర్యాంకు తెచ్చుకుంది. ర్యాంకు ఆధారంగా ఆమెకు ఇండియన్ రైల్వేస్‌లో అకౌంట్స్ సర్వీస్‌లో ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగంలో చేరడానికి ఏ అడ్డంకీ వచ్చి ఉండకపోయి ఉంటే ఎలా ఉండేదో తెలియదు. ఆమె కూడా జీవితంతో రాజీ పడిపోయి ఉండేదేమో! కానీ ఆ ఉద్యోగానికి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ర్యాంకు ఒక్కటే సరిపోలేదు. చూపు కూడా కావలసి వచ్చింది. అప్పుడు ప్రాంజల్... ‘‘నా అసలు టార్గెట్ ఇది కాదు, కాబట్టి మీరు ఈ ఉద్యోగం ఇవ్వనక్కర్లేదు’’ అని మళ్లీ ఎగ్జామ్‌కి ప్రిపేరైంది. తర్వాతి ఏడాది 124వ ర్యాంకు తెచ్చుకుంది. అప్పుడు జాతీయ స్థాయిలో మీడియా సంస్థలన్నీ ఆమెను సంభ్రమంగా చూశాయి. ఐఏఎస్ ఆఫీసర్ కాబోతున్న యువతిగా దేశానికి పరిచయం చేశాయి. ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలోనూ అమ్మాయిలు విజయకేతనం ఎగుర వేస్తూనే ఉన్నారు. వాళ్లను జాతి సగర్వంగా గుర్తు చేసుకుంటూనే ఉంది. అమ్మాయిని ఇంకా ప్రత్యేకంగా, మరికొంత ప్రేమగా గుర్తు చేసుకున్నది. మొదట ప్రాంజల్‌కి కేరళ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎర్నాకుళంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు తాజాగా త్రివేండ్రంలో సబ్‌కలెక్టర్‌గా సోమవారం నాడు రాట్నం వడుకుతున్న గాంధీజీ చిత్రపటం సాక్షిగా పూర్తి స్థాయిలో విధుల్లో చేరారామె. తిరువనంతపురం కలెక్టరేట్లోని ఉద్యోగులు ప్రాంజల్‌ను భావోద్వేగాలతో స్వాగతించారు, అభినందనల్లో ముంచెత్తారు. తమ ఇంటి పాపాయికి పుట్టిన రోజు పండుగ చేసి కేక్ తినిపించినంత ప్రేమగా స్వీట్లు తినిపించారు. ఓటమి దరి చేరదు ‘‘ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. అప్పుడు జీవితంలో ఓడిపోవడం అనేది ఉండదు. మన లక్ష్యం మీద మనం పెట్టిన శ్రద్ధ, శ్రమతోనే మనం అనుకున్నది సాధించి తీరుతాం. ఓడిపోయాం... ఓడిపోతామేమో... అనే భావనలే మనల్ని ఓటమిలోకి నెట్టేస్తాయి. అలాంటి భావనలను మనసులోకి రానివ్వకూడదు’’ అని బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చిరునవ్వుతో చెప్పారు ప్రాంజల్. గత ఏడాది సబ్‌కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన క్షణాలను, తనను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న సహోద్యోగులను మర్చిపోలేనని చెబుతూ... ఈ కొత్త ఉద్యోగంలో ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తానని అన్నారు. జీవితంలో ప్రతి సందర్భాన్ని సానుకూలంగా స్వీకరించే ప్రాంజల్ రెండు సందర్భాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఎప్పుడూ చెబుతుంటారు. ఒకటి చిన్నప్పుడు ఆపరేషన్లతో కలిగిన బాధ, రెండవది రైల్వే ఉద్యోగానికి అంధత్వం కారణంగా తనను దూరం పెట్టడం. ‘‘ఒకటి శారీరకంగా బాధకలిగించిన సంఘటన అయితే మరొకటి మనసును మెలిపెట్టిన సంఘటన’’ అని చెప్తుంటారామె. మధ్యప్రదేశ్‌కు చెందిన కృష్ణ గోపాల్ తివారీ తొలి విజువల్లీ చాలెంజ్డ్ ఐఏఎస్ ఆఫీసర్. సర్వేంద్రియాల్లో కళ్లు అత్యంత ప్రధానమైనవే. అయినప్పటికీ కంటిచూపు లేకపోవడం మాత్రం దేనికీ అవరోధం కాదని నిరూపించారాయన. ఆయన బాట ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు అదే బాటను మరింతగా విస్తరించిన మరో స్ఫూర్తిప్రదాయిని ప్రాంజల్. – మంజీర దృఢమైన వ్యక్తిత్వం ప్రాంజల్ పాటిల్‌ది మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్. ఆరేళ్ల వయసులో కంటిచూపును కోల్పోయింది. కూతురికి తిరిగి చూపు తెప్పించడానికి ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేయించారు ఆమె తల్లిదండ్రులు. ఒక్కటీ విజయవంతం కాలేదు. అన్ని ఫెయిల్యూర్స్ నుంచి తనకు తానుగా ఎదిగింది ప్రాంజల్. కమలామెహతా దాదర్ బ్లైండ్ స్కూల్లో చదువుకుంది. తర్వాత ముంబయిలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ‘‘ప్రాంజల్ చాలా నిబద్ధత కలిగిన విద్యార్థి. కాలేజ్‌లో జరిగే స్పెషల్ లెక్చర్స్‌కు కూడా అందరికంటే ముందే వచ్చేది.డిబేట్లలో అనర్గళంగా మాట్లాడేది. ఒక విషయం మీద తన అభిప్రాయాన్ని సున్నితంగా, చాలా స్పష్టంగా, ఎదుటి వాళ్లు కన్విన్స్ అయ్యేలా చెప్పడం ప్రాంజల్ ప్రత్యేకత. సమస్య వచ్చినప్పుడు జారిపోకుండా నిలబడగలిగిన దృఢమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి’’ అని ప్రాంజల్ గురించి ఆమె స్నేహితురాలు సరస్వతి చెప్పింది. ప్రాంజల్, సరస్వతి ఇద్దరూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నారు. -
దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్
తిరువనంతపురం: ‘ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి.. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషే మనకు కావాల్సింది సాధించి పెడుతుంది’ అంటూ దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా నియమితురాలైన ప్రంజల్ పాటిల్ (30) పిలుపునిచ్చారు. సోమవారం ఆమె తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆమె ఆరేళ్ల లేత ప్రాయంలోనే చూపును కోల్పోయారు. అయితే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశను మాత్రం కోల్పోలేదు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు. అనంతరం 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఓ సందర్భంలో తెలిపారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స విఫలమైనందు వల్ల కూడా నొప్పిని అనుభవించానని తెలిపారు. తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో సామాజిక న్యాయ విభాగం సెక్రటరీ బిజు ప్రభాకర్ పాల్గొన్నారు. -
సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రాంజల్
తిరువనంతపురం : ప్రాంజల్ పాటిల్ తిరువనంతపురం జిల్లా సబ్ కలెక్టర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలకగా, అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్ కే గోపాలకృష్ణన్, కలెక్టరేట్ సిబ్బంది సమక్షంలో ప్రాంజల్ సబ్ కలెక్టర్ట్గా బాధ్యతలు చేపట్టారు. కాగా చూపు లేకున్నా ప్రాంజల్ పాటిల్ తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా 773 ర్యాంక్ సాధించారు. ప్రాంజల్ కంటిచూపు లేని తొలి భారతీయ మహిళా ఐఎఎస్ అధికారి కావడం గమనార్హం. ప్రాంజల్ పాటిల్‌కు ఆరేళ్ల వయసులో తరగతి గదిలో సహ విద్యార్థి పొరపాటున పెన్సిల్‌తో కంట్లో గుచ్చాడు. దాంతో ఆ కన్ను చూపు కోల్పోగా, ఆ గాయం తాలూకు ఇన్ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపు కూడా కోల్పోయింది. అయితే ప్రాంజల్ అమ్మానాన్న మాత్రం ఆమెను ఎన్నడూ అంధురాలిగా చూడలేదు. జీవితం పట్ల ఓ దృక్ఫదంతో పాటు కలలు కనేలాగానే పెంచారు. దాదర్‌లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్‌లో పాఠశాల విద్య, చండీబాయి కాలేజ్‌లో ఇంటర్ చేసింది. 2015లో ఎమ్‌ఫిల్ చేస్తూ ఐఏఎస్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టిన ప్రాంజల్ తల్లిదండ్రులు, స్నేహితుల సాయంతో తాను ఐఏఎస్ కావాలనే కలను సాకారం చేసుకున్నారు. -
ఐఏఎస్‌కు కొత్త కళ్లు
హృదయం పెట్టి వినాలి. బుద్ధితో ఆలోచించాలి. మేధతో పరిష్కారం సూచించాలి. దార్శనికతతో భవిష్యత్తును నిర్మించాలి. ఈ దేశం ప్రతి ఐ.ఏ.ఎస్ నుంచి ఆశించేది అదే. ప్రాంజల్ పాటిల్ అలాంటి ఐ.ఏ.ఎస్. ఆమెకు చూపు లేకపోవచ్చు. కాని హృదయం, బుద్ధి, మేధ, దార్శనికత ఉన్నాయి. ప్రజలకు ఏం కావాలో తెలిసిన దృష్టి ఉంది. మొదటి అటెంప్ట్‌లోనే ఆల్ ఇండియా 773 ర్యాంక్‌ను సాధించిన 26 ఏళ్ల అంధురాలు ప్రాంజల్ పాటిల్ స్ఫూర్తిమంతమైన కథ ఇది. ముంబై. ఉల్లాస్‌నగర్‌లోని ఓ మధ్యతరగతి ఫ్లాట్. ఫ్లవర్ బొకేలతో హాల్ అంతా నిండిపోయింది. క్షణం తీరికలేకుండా ఆ ఇంటి అమ్మాయి ప్రాంజల్ పాటిల్ మొబైల్‌ఫోన్ రింగవుతూనే ఉంది. వచ్చేవాళ్లు వస్తున్నారు. స్వీట్‌బాక్స్‌లు, పళ్లు ఇచ్చి మనసారా ఆమెకు అభినందనలు చెప్తున్నారు. ఇంతలో లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఇటు ప్రింట్, అటు ఎలక్ట్రానిక్ మీడియా తలుపు తోసుకుంటూ మరీ వచ్చి ప్రాంజల్ పాటిల్ ముందు మైక్ పెట్టాయి. రికార్డర్ ఆన్ చేశాయి ఆమె విజయపథం గురించి చెప్పమని. ఎందుకంటే ఆమె సాధించిన విజయం అసామాన్యమైనది. ఆ ప్రయాణం... ‘నా ప్రయాణం ఉల్లాస్‌నగర్ నుంచి సీఎస్టీ (ముంబైలో ఒక ప్రాంతం)కి రోజూ లోకల్‌ట్రైన్‌లో వెళ్లినంత తేలికగా ఏం జరగలేదు. నిజానికి ఉల్లాస్‌నగర్, సీఎస్టీ ప్రయాణం కూడా ఈజీయేం కాదు. రోడ్డు దాటాలన్నా ఎవరో ఒకరు చేయిపట్టుకొని సాయం చేయాల్సిందే. ట్రైన్ ఎక్కడానికీ ఎవరో ఒకరి తోడు కావాల్సిందే. ప్రతిరోజూ ఈ సహాయానికి విసిగిపోయో లేక నా మీద జాలితోనో చాలామంది ఉల్లాస్‌నగర్ నుంచి ఇక్కడిదాకా ఇంత అవస్థపడుతూ రాకపోతే అక్కడే ఏదో ఒక కాలేజ్‌లో చేరొచ్చుకదా అనేవారు. నువ్వు చదివి ఉద్ధరించేదేముంటుంది గనక? అని సలహా కూడా ఇచ్చేవారు. రోజూ వాళ్లను ఇబ్బంది పెడుతున్నందుకు వస్తున్న విసుగో, నాలాంటి వాళ్ల మీద చిన్నచూపో తెలీదు! ఏైమైనా అలాంటి మాటలు నాలో పట్టుదలను పెంచేవి. ఆ మాటలు నా మనసుకి గుచ్చుకున్నా వాళ్లకు మాత్రం నవ్వుతూ సమాధానం చెప్పేదాన్ని. ‘గుడ్డివాళ్లకూ కలలుంటాయి. సెయింట్ జేవియర్స్ కాలేజ్‌లో చదవడం నా కల’ అని గట్టిగా చెప్పేదాన్ని. ఆ కాలేజే నాకు సివిల్స్ గురించి, ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్ గురించి పరిచయం చేసింది. నా కొత్తకలకు ప్రాణం పోసింది. బ్లాక్ అండ్ వైట్ లైఫ్‌కి కలర్స్ యాడ్ చేసింది. ఇవన్నీ వాళ్లతో చెప్పాలనిపించేది. చెప్పి నా శక్తిని వృథా చేసుకోవాలనిపించక ఆ శక్తినీ సివిల్స్ ప్రిపరేషన్‌కి దాచుకునేదాన్ని. చూపు ఎందుకు లేదు జీవితం పట్ల దృష్టి, దార్శనికత పెంచడానికే నా నుంచి చూపును లాక్కున్నాడేమో ఆ భగవంతుడు (నవ్వుతూ)! నాకు ఆరేళ్లప్పుడు మా క్లాస్‌లో మా క్లాస్‌మెట్ పొరపాటున పెన్సిల్‌తో నా కంట్లో గుచ్చాడు. దాంతో ఆ కన్ను చూపు పోయింది. అప్పుడే డాక్టర్లు ‘ఆ గాయం తాలూకు ఇన్ఫెక్షన్ రెండో కన్నుకీ సోకింది. నెమ్మదిగా ఆ కన్ను చూపూ పోవచ్చు’ అని మా అమ్మానాన్నలతో చెప్పారు. డాక్టర్లు చెప్పినట్టుగానే యేడాదికి రెండో కన్ను చూపూ పోయి అంధురాలినయ్యాను. అయితే అమ్మానాన్న నన్నెప్పుడూ అంధురాలిగా చూడలేదు. జీవితం పట్ల నేను కలలు కనేలా అదీ రంగురంగుల కలలు కనేలాగానే పెంచారు. ఆ ప్రోత్సాహాన్నిచ్చారు. దాదర్‌లోని కమలా మెహతా స్కూల్ ఫర్ బ్లైండ్‌లో పాఠశాల విద్యను కంప్లీట్ చేశా. చండీబాయి కాలేజ్‌లో ఇంటర్ చేశా. 82 పర్సెంటేజ్ వచ్చింది. ఇంటర్లో ఉన్నప్పటి నుంచే సెయింట్ జేవియర్స్‌లో చదవాలని కల ఆశ. మంచి మార్క్స్ రావడంతో ఈజీగానే సీట్ దొరికింది. అలా ఉల్లాస్‌నగర్ నుంచి సీఎస్టీ జర్నీ సాగింది. నా ఐఏఎస్ కలకు రెక్కలు తొడిగింది. ఎమ్ఫిల్తో పాటు.. 2015లో ఎమ్‌ఫిల్ చేస్తూ ఐఏఎస్‌కి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఈ రోజు సివిల్స్‌లో ఆల్ఇండియా 773 ర్యాంక్ సాధించానంటే ఘనత టెక్నాలజీదే. ఎందుకంటే నా ప్రిపరేషన్లో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. ఒఅగి (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్) అనే సాఫ్ట్‌వేర్‌ను నా కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకున్నా. నాలాంటి అంధుల కోసం తయారైన సాఫ్ట్వేర్ ఇది. తక్కువ సమయంలో ఎక్కువ మెటీరియల్‌ను చదివే అవకాశం కల్పిస్తుంది. బ్రెయిలీ లిపిలో కంప్యూటర్ స్క్రీన్‌మీద డిస్ప్లే అయ్యే ఈ మెటీరియల్‌ను వింటూ మననం చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా చదువుకోవచ్చు. నేను వింటూ మననం చేసుకునేదాన్ని. పుస్తకాలను తెచ్చుకొని స్కాన్ చేసుకొని అందుకు వీలు కల్పించే జేఏడబ్ల్యు అనే మరో సాఫ్ట్వేర్ ద్వారా వినేదాన్ని. సెకండ్ చాలెంజ్ చదవడమైతే చదివాను కాని నాలుగు గంటల్లో పరీక్ష రాయడం సవాలే. నేను చెప్పింది చెప్పినట్టు పరీక్ష రాసి పెట్టగల వాళ్లను పట్టుకోవడం కష్టమే అయింది. చివరకు విదుషీ అనే నా స్నేహితురాలిని అడిగాను. అసలు పరీక్ష కంటే ముందు ఇద్దరం కూర్చోని మాక్ ఎగ్జామ్స్ రాశాం. నా మాటకు ఆమె రాసే స్పీడ్‌కి సరిపోతుందో లేదో చెక్ చేసుకోవడానికి. విదుషీ వేగానికి నేను తత్తరపడేదాన్ని. సరిగా చెప్పలేకపోయేదాన్ని. అప్పుడు తను నన్ను హెచ్చరించేది. అలా ఓ పదిసార్లు మాకు మేమే మాక్ టెస్ట్ పెట్టుకుని తర్ఫీదు అయ్యాం. మొత్తానికి మా కాంబినేషన్‌కి ఒక గొప్ప రిజల్ట్‌గా నా ర్యాంక్ నిలిచింది. ఇప్పుడు నా కన్నా విదుషీ హ్యాపీగా ఉంది. తనకే ఐఏఎస్ వచ్చినంత సంబరపడిపోతోంది. థ్యాంక్స్ టు హర్! కుటుంబం... అమ్మా నాన్న నా వేలు పట్టుకొని నడక నేర్పించారు. భుజం తట్టి రంగుల ప్రపంచంలోకి పంపించారు. ఏ రంగైనా నలుపే కదా అని నా మొహం మీద నవ్వేసే వాళ్లకు ఒకటే సమాధానం. నలుపులో మేం ఏ రంగునైనా చూడగలం. ఇది అమ్మా నాన్న నాకు ఇచ్చిన స్థయిర్యం. నేర్పిన పాఠం. దానికి ప్రాక్టికల్ రిజల్టే ఈ రోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం. నా రెండో ఆసరా నా భర్త కోమల్‌సింగ్ పాటిల్. ఒజర్ ఖేడాలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. నా లక్ష్యాన్ని ఎప్పుడూ అపహాస్యం చేయలేదు. నా ప్రయాణానికి అడ్డురాలేదు. నా ఈ విజయానికి వీళ్లిద్దరితోపాటు నా స్నేహితులు, ఉల్లాస్‌నగర్ నుంచి సీఎస్టీ వరకు ఎక్కడో ఒక చోట నా చేయి పట్టుకొని తోడుగా నిలిచిని ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఎందుకంటే నా ఐఏఎస్ కల పురుడు పోసుకుంది ఆ ప్రయాణంలోనే కాబట్టి’ అంటూ అందరికి ధన్యవాదాలు చెప్తూ ఇంటర్వ్యూ ముగించింది ప్రాంజల్ పాటిల్! చదవడమైతే చదివాను కాని నాలుగు గంటల్లో పరీక్ష రాయడం సవాలే. నేను చెప్పింది చెప్పినట్టు పరీక్ష రాసి పెట్టగల వాళ్లను పట్టుకోవడం కష్టమే అయింది.