
ప్రంజల్ పాటిల్
తిరువనంతపురం: ‘ఓడిపోవడానికి అవకాశం ఇవ్వకండి.. ప్రయత్నాన్ని విరమించకండి. మనం చేసే కృషే మనకు కావాల్సింది సాధించి పెడుతుంది’ అంటూ దేశంలోనే మొట్టమొదటి అంధ మహిళా ఐఏఎస్‌గా నియమితురాలైన ప్రంజల్ పాటిల్ (30) పిలుపునిచ్చారు. సోమవారం ఆమె తిరువనంతపురం సబ్‌కలెక్టర్‌గా, రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌కు చెందిన ఆమె ఆరేళ్ల లేత ప్రాయంలోనే చూపును కోల్పోయారు. అయితే జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఆశను మాత్రం కోల్పోలేదు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి డిగ్రీపట్టా పొందారు. అనంతరం 2016లో జరిగిన యూపీఎస్సీ పరీక్షలు రాసి, 773వ ర్యాంక్ సాధించారు.
దీంతో ఆమెకు భారత రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్)లో ఉద్యోగం వచ్చింది. అయితే ఆమె అంధురాలని తెలియడంతో ఉద్యోగం ఇవ్వడానికి తిరస్కరించారు. పట్టు వదలని ప్రంజల్ తర్వాతి యేడు జరిగిన యూపీఎస్సీ పరీక్షలు మళ్లీ రాసి 124వ ర్యాంక్ సాధించారు. దీంతో ఆమె ఐఏఎస్‌గా ఎంపికై, యేడాది శిక్షణలో భాగంగా ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. రైల్వే ఉద్యోగం తిరస్కరణకు గురికావడంపై తానెంతో వేదనకు గురయ్యానని ఓ సందర్భంలో తెలిపారు. కళ్లకు చేసిన శస్త్రచికిత్స విఫలమైనందు వల్ల కూడా నొప్పిని అనుభవించానని తెలిపారు. తిరువనంతపురంలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమంలో సామాజిక న్యాయ విభాగం సెక్రటరీ బిజు ప్రభాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment