Prattipati pullaravu
-
పదేళ్లలో అమరావతిలో అద్భుత కట్టడాల నిర్మాణం
యాక్సిస్ రోడ్డు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు తుళ్లూరు రూరల్: యాక్సిస్ రోడ్డు నిర్మాణాన్ని నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. శనివారం మండలంలోని వెంకటపాలెం నుంచి బోరుపాలెం వరకు 18కి.మీ మేర ఆరు లైన్ల యా క్సిస్ రోడ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పదేళ్లలో అమరావతిలో అద్భుతమైన కట్టడాలు నిర్మితమవుతాయని, ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోతాయని తెలిపారు. రోడ్ల నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం రాజధానిలో రోడ్ల నిర్మాణ చిత్రపటాల నమూనాలను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి ఇతర మంత్రులు ఉన్నారు. అన్న క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనం తుళ్లూరు: తాత్కాలిక సచివాలయ సమీపంలో శనివారం సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ అన్న క్యాం టీన్ను ప్రారంభించారు. ఈ క్యాంటీన్లతో పేదలకు ప్రయోజనమన్నారు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, పరిటాల సునీత, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ శ్రీధర్ అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు. అనంతరం తాత్కాలిక సచివాలయంలో ఐదో బ్లాకు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల జాప్యానికి గల కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు, మందడం సర్పంచ్ ముప్పవరపు పద్మావతి తదితరులు ఉన్నారు. ప్రాంతాలవారీగా అన్నా క్యాంటీన్లు : మంత్రి సునీత రాష్ట్రంలో ప్రాంతాలవారీగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత తెలిపారు. అన్న క్యాంటీన్ ప్రారంభం తర్వాత ఆమె విలేకర్లతో మాట్లాడారు. నెలాఖరుకు తుళ్లూరు, యర్రబాలెంలోనూ అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. తమిళనాడులో క్యాంటీన్ల నిర్వహణను పరిశీలించి ఇక్కడా మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 11.30 నుంచి 2గంటల వరకు భోజనం ఉంటుందని మంత్రి వెల్లడించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలు బాగున్నాయని కితాబిచ్చారు. -
స్థానిక నేతల నోరు నొక్కారు
- టీడీపీ జిల్లా అధ్యక్షుడితో సహా సీనియర్ నేతలకూ నో చాన్స్ - ఒంగోలు సభలో మంత్రులను తప్ప మరెవరినీ మాట్లాడనివ్వని సీఎం - పాత, కొత్త నేతల మధ్య విభేదాలే కారణం - సీఎం తీరుపై స్వపక్షం నుంచే విమర్శలు - పీడీసీసీబీ చైర్మన్‌ను సభలోకి అనుమతించని పోలీసులు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రుణవిముక్తి పత్రాల పంపిణీ పేరుతో బుధవారం ఒంగోలులో జరిగిన ముఖ్యమంత్రి సభలో జిల్లా మంత్రి శిద్దారాఘవరావుకు మినహా మరెవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడంపై జిల్లా పార్టీ శ్రేణులు మరింత ఆవేదన చెందుతున్నాయి. జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా.. మొదటికే మోసం వస్తుందని భావించిన ముఖ్యమంత్రి సభలో జిల్లా నేతలను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన సభ హడాహుడిగా జరిగిన సభకాదు. ప్రభుత్వం రెండవ విడత రుణమాఫీ పత్రాలను పంపిణీ చేసేందుకు రూ.2 కోట్లు పైనే వెచ్చించి రెండుగంటలకు పైగా ఆర్భాటంగా సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా నేతలందరికీ మాట్లాడే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనుకున్నారు. కానీ చివరకు ముఖ్యమంత్రి వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ సభలో ఇన్చార్ట్ మంత్రి రావెల కిషోర్‌బాబుతో పాటు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుకు మాత్రమే అవకాశం కల్పించారు. మాట్లాడే అవకాశం రాలేదని నేతల ఆవేదన.. జిల్లా పార్టీ అధ్యక్షుడుతో పాటు ఈ సభకు బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సీనియర్ నేత కరణం బలరాంలతో పాటు శాసనసభ్యులు హాజరయ్యారు. కానీ సీఎం ఏఒక్కరికీ మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన రైతులకు రెండవ విడత రుణమాఫీ పంపిణీ నేపథ్యంలో కనీసం తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని సభావేదికపై నుంచి గొప్పలు చెప్పుకొనేందుకు కూడా సీఎం అవకాశం కల్పించక పోవడంపై ఓ అధికార పార్టీ నేత ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరిని మాట్లాడిస్తే అందరినీ మాట్లాడించాల్సి వస్తుందని, అదే జరిగితే చివరకు సభ ఏ పరిస్థితికి దారితీస్తుందోనని సీఎం భావించినట్లు సమాచారం. ఈ కారణంతోనే జిల్లా నేతలెవ్వరికీ మాట్లాడే అవకాశమివ్వలేదని తెలుస్తోంది. కనీసం ముఖ్యనేతలతోనైనా మాట్లాడించి ఉంటే బాగుండేదని రుణమాఫీతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే అవకాశం ఉండేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్పించుకొని వర్గ విభేదాలకు ఆజ్యం పోసిందే ముఖ్యమంత్రి అని మరో నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి జిల్లా నేతలెవ్వరినీ మాట్లాడనివ్వకపోవడంతో అధికార పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈదరకు నో ఎంట్రీ.. బుధవారం జరిగిన సభకు పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబును పోలీసులు అనుమతించలేదు. ఎమ్మెల్యేలతో పాటు సభావేదిక మీదకు వచ్చేందుకు ప్రయత్నించిన ఈదర ను అడ్డుకున్నారు. మీరెవరంటూ ప్రశ్నించారు. అవాక్కయైన ఈదర మోహన్ పీడీసీసీబీ చైర్మన్‌ను అంటూ పోలీసులకు సమాధానమిచ్చారు. అయితే కలెక్టర్ ఇచ్చిన జాబితాలో మీ పేరు లేదంటూ పోలీసులు నిర్మొహమాటంగా వేదిక మీదకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఈదర మోహన్ అక్కడ నుంచి వెనుతిరిగి వె ళ్లిపోయారు. అధికార పార్టీకి చెందిన ఈదర మోహన్‌ను ముఖ్యమంత్రి పాల్గొనే సభకు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సహకార బ్యాంకు వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎట్టకేలకు మంత్రులు జోక్యం చేసుకొని సహకార శాఖ మంత్రి ద్వారా అవిశ్వాస తీర్మానంపై స్టే తెచ్చారు. మోహన్ హైకోర్టుకు వెళ్లి స్టేను రద్దు చేయించారు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు ఈదర మోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి సభకు ఈదర మోహన్‌ను పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది. కొత్త ఎమ్మెల్యేలకు భుజం తట్టిన సీఎం.. కొత్తగా అధికార పార్టీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, యర్రగొండపాలెం పాలపర్తి డేవిడ్‌రాజులను ముఖ్యమంత్రి భుజం తట్టి మరీ పలకరించారు. సీఎం సభా వేదికపైకి రాగానే పాత నేతలను పలకరించకుండా వేదిక చివరన ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యే వద్దకు వచ్చి భుజం తట్టి మరీ నవ్వుతో పలకరించడం సభలో చర్చనీయాంశంగా మారింది. ఈ సన్నివేశాన్ని చూసిన పాత నేతలు లోలోపల రగిలిపోయారు. ఇదే సందర్భంలో అభివృద్ధిని ఆకాంక్షించి ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారని వారికి స్వాగతం పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో ప్రజలు కూడా ఎమ్మెల్యేలకు స్వాగతం పలకాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇదే వేదికపైన మార్కాపురం టీడీపీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి పచ్చ కండువాలు తెచ్చి మంత్రులతో పాటు పాత నేతలందరికీ మెడల్లో వేశారు. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు వేయకపోవడంతో వేదికతో పాటు వేదిక ముందున్న వారు గుసగుసలాడుకున్నారు. -
రాజధానికి అరకొర
► బడ్జెట్లో జిల్లాకు మొక్కుబడి కేటాయింపులు ► వ్యవసాయం, జలవనరుల శాఖలకు అన్యాయం ► కృష్ణా పుష్కరాలకు రూ. 250 కోట్లు సరిపోయేనా! ► బడ్జెట్‌పై కనిపించని మంత్రులు ప్రత్తిపాటి, రావెల ముద్ర సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర బడ్జెట్లోనూ రాజధానికి అన్యాయమే జరిగింది. అరకొరగా నిధులు కేటాయించి అన్ని రంగాలనూ ఉసూరుమనిపించారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ రంగం, దానికి అనుబంధంగా ఉండే సాగునీటి శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉందని అంతా భావించారు. ప్రాధాన్యత కలిగిన ఈ రెండు శాఖల్లో చేపట్టాల్సిన పనుల కేటాయింపులకు పొంతన కుదరడం లేదు. పులిచింతల, డెల్టా ఆధునికీకరణ, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ పరిరక్షణ, కాల్వల అభివృద్ధి, మరమ్మతులు వంటి పనులకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఉంది. కానీ అందుకు భిన్నంగా నిధుల కేటాయింపు జరిగింది. నిజాంపట్నం హార్బర్‌ను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పుష్కరాలనూ పట్టించుకోలేదు.. రాజధాని నిర్మాణం, పర్యాటక రంగం, కృష్ణా పుష్కరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం అరకొరగానే నిధుల కేటాయింపు చేసింది. పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు పెంచుతానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రంగానికి రూ.227.74 కోట్లు కేటాయించారు.గోదావరి పుష్కరాలకు రూ.1680 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపుష్కరాలకు రూ.250 కోట్లను మాత్రమే కేటాయించింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పుష్కరాల్లో చేపట్టాల్సిన పనులకు రూ.2 వేల కోట్లకుపైగానే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ప్రభావం పుష్కరాల నిర్వహణపై కచ్చితంగా పడుతుంది. డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు.. రాజధాని నిర్మాణం నేపధ్యంలో తాడికొండ నియోజకవర్గం లాంలో వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణం, ఇతర పథకాల అమలుపై ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. హైదరబాద్ నుంచి యూనివర్సిటీ తరలింపునకు నిధుల కేటాయింపు మినహా రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు పెద్దగా లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికేతర విభాగంలో రూ.81.04 కోట్లు విధించనున్నదని, వాటితో నిర్మాణ పనులు చేపట్టనున్నామని ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. రుణమాఫీకి గత ఏడాది రూ.4వేల కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.3500 కేటాయించారు. డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ ప్రస్తావన లేకపోవడంతో మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పాత నిధులకే కొత్త మెరుగు... ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణానికి రూ.18000 కోట్లు ఖర్చు కాగలదని చెబుతున్న ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఎప్పటికి నిర్మాణం పూర్తిచేస్తారో సీఎం సమాధానం చెప్పాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఈ నిధులను గతంలో కేటాయించింది. వాటినే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం చూపించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.. సాగునీటి రంగానికి కేటాయింపులు పులిచింతల ప్రాజెక్టులో ఇంకా రూ.50 కోట్లకుపైగానే పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పనులు చేస్తున్న నిర్మాణ సంస్థకు రూ. 8 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మొత్తం రూ.58 కోట్ల వరకు ఈ ప్రాజెక్టుకు నిధులు అవసరం కావాల్సి ఉండగా, బడ్జెట్లో రూ.43 కోట్లు కేటాయించారు. డెల్టా ఆధునీకరణకు రూ.112 కోట్లను కేటాయించారు. గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణసంస్థలు ముందుకు రాకపోవడంతో ఆ నిధులు పూర్తిగా వ్యయం కాలేదు. ఈ ఏడాది కొన్ని నిర్మాణ సంస్థలు డెల్టా ఆధునీకరణ పనులు చేస్తున్నాయి. పనులు పూర్తిచేస్తే నగదు చెల్లింపులు జరిగే అవకాశాలు లేకపోవడంతో పనులు ప్రారంభించని కొన్ని సంస్ధలు ఈ కేటాయింపుల్ని చూసి ముందుకు వచ్చే ఆలోచన విరమించుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజి పనులకు రూ.70 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం జరిగే దిగువ ఆప్రాన్ పనులకు ఈ నిధులు సరిపోతాయని, మిగిలిన పనులకు నిధుల కొరత తప్పదని ఉందని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.260 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఈ కేటాయింపులు తక్కువుగా ఉండటంతో ఆధునీకరణ పనులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు సాధించలేని ప్రత్తిపాటి, రావెల సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులోనే మొండిచేయి చూపింది. కాపు కార్పొరేషన్ సంస్ధ ద్వారా రూ.1000 కోట్లు కేటాయించింది. మిగిలిన కార్పొరేషన్లకు నామమాత్రంగా కేటాయింపులు జరిగాయి. బ్రాహ్మణ కార్పొరేషన్, మైనార్టీ, ఎస్టీ, ఎస్టీ కార్పొరేషన్లకు రెండంకెలకు మించకుండా నిధులు కేటాయించారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో రోడ్లు-భవనాల శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించాలి. కానీ రూ.2 వేల కోట్లకు పరిమితం చేశారు. జిల్లా నుంచి వ్యవసాయశాఖ, సాంఘిక సంక్షేమశాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌లు ఆ శాఖలపై తమ ముద్రపడే రీతిలో నిధుల కేటాయింపుగానీ, కొత్త పథకాలను కానీ తీసుకురాలేకపోయారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేయనున్న నిధులపైనే గృహ నిర్మాణాలు ఆధారపడి ఉన్నాయి. వీటికోసం విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లోని పేద వర్గాలు వేలల్లో దరఖాస్తు చేసుకున్నాయి.