రాజధానికి అరకొర | State budget dispointed in capital | Sakshi
Sakshi News home page

రాజధానికి అరకొర

Published Fri, Mar 11 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

రాజధానికి అరకొర

రాజధానికి అరకొర

బడ్జెట్‌లో జిల్లాకు మొక్కుబడి కేటాయింపులు
వ్యవసాయం, జలవనరుల శాఖలకు అన్యాయం
కృష్ణా పుష్కరాలకు రూ. 250 కోట్లు సరిపోయేనా!
బడ్జెట్‌పై కనిపించని మంత్రులు ప్రత్తిపాటి, రావెల ముద్ర

 
 
సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాష్ట్ర బడ్జెట్‌లోనూ రాజధానికి అన్యాయమే జరిగింది. అరకొరగా నిధులు కేటాయించి అన్ని రంగాలనూ ఉసూరుమనిపించారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ రంగం, దానికి అనుబంధంగా ఉండే సాగునీటి శాఖకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశం ఉందని అంతా భావించారు. ప్రాధాన్యత కలిగిన ఈ రెండు శాఖల్లో చేపట్టాల్సిన పనుల కేటాయింపులకు పొంతన కుదరడం లేదు. పులిచింతల, డెల్టా ఆధునికీకరణ, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ పరిరక్షణ, కాల్వల అభివృద్ధి, మరమ్మతులు వంటి పనులకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఉంది. కానీ  అందుకు భిన్నంగా నిధుల కేటాయింపు జరిగింది. నిజాంపట్నం హార్బర్‌ను పూర్తిగా విస్మరించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 పుష్కరాలనూ పట్టించుకోలేదు..
రాజధాని నిర్మాణం, పర్యాటక రంగం, కృష్ణా పుష్కరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వం అరకొరగానే నిధుల కేటాయింపు చేసింది. పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు పెంచుతానని పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రంగానికి రూ.227.74 కోట్లు కేటాయించారు.గోదావరి పుష్కరాలకు రూ.1680 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపుష్కరాలకు రూ.250 కోట్లను మాత్రమే కేటాయించింది. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పుష్కరాల్లో చేపట్టాల్సిన పనులకు రూ.2 వేల కోట్లకుపైగానే ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ప్రభావం పుష్కరాల నిర్వహణపై కచ్చితంగా పడుతుంది.

డ్వాక్రా రుణమాఫీ ఊసే లేదు..
రాజధాని నిర్మాణం నేపధ్యంలో తాడికొండ నియోజకవర్గం లాంలో వ్యవసాయ యూనివర్సిటీ నిర్మాణం, ఇతర పథకాల అమలుపై ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. హైదరబాద్ నుంచి యూనివర్సిటీ తరలింపునకు నిధుల కేటాయింపు మినహా రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు పెద్దగా లేవు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికేతర విభాగంలో రూ.81.04 కోట్లు విధించనున్నదని, వాటితో నిర్మాణ పనులు చేపట్టనున్నామని ఈ బడ్జెట్‌లో ప్రస్తావించారు. రుణమాఫీకి గత ఏడాది రూ.4వేల కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.3500 కేటాయించారు. డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ ప్రస్తావన లేకపోవడంతో మహిళా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

పాత నిధులకే కొత్త మెరుగు...
ప్రపంచం మెచ్చే రాజధాని నిర్మాణానికి రూ.18000 కోట్లు ఖర్చు కాగలదని చెబుతున్న ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఎప్పటికి నిర్మాణం పూర్తిచేస్తారో సీఎం సమాధానం చెప్పాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లో డ్రైనేజి వ్యవస్థ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించారు.  కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఈ నిధులను గతంలో కేటాయించింది. వాటినే రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం చూపించడంపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది..

సాగునీటి రంగానికి కేటాయింపులు
పులిచింతల ప్రాజెక్టులో ఇంకా రూ.50 కోట్లకుపైగానే పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పనులు చేస్తున్న నిర్మాణ సంస్థకు రూ. 8 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మొత్తం రూ.58 కోట్ల వరకు ఈ ప్రాజెక్టుకు నిధులు అవసరం కావాల్సి ఉండగా, బడ్జెట్‌లో రూ.43 కోట్లు కేటాయించారు.

డెల్టా ఆధునీకరణకు రూ.112 కోట్లను కేటాయించారు. గత ఏడాది రూ.304 కోట్లు కేటాయించినప్పటికీ నిర్మాణసంస్థలు ముందుకు రాకపోవడంతో ఆ నిధులు పూర్తిగా వ్యయం కాలేదు. ఈ ఏడాది కొన్ని నిర్మాణ సంస్థలు డెల్టా ఆధునీకరణ పనులు చేస్తున్నాయి.   పనులు పూర్తిచేస్తే నగదు చెల్లింపులు జరిగే అవకాశాలు లేకపోవడంతో పనులు ప్రారంభించని కొన్ని సంస్ధలు ఈ కేటాయింపుల్ని చూసి ముందుకు వచ్చే ఆలోచన విరమించుకుంటున్నాయి.

ప్రకాశం బ్యారేజి  పనులకు రూ.70 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం జరిగే దిగువ ఆప్రాన్ పనులకు ఈ నిధులు సరిపోతాయని, మిగిలిన పనులకు నిధుల కొరత తప్పదని ఉందని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు రూ.260 కోట్లు కేటాయించారు. గత ఏడాది కంటే ఈ కేటాయింపులు తక్కువుగా ఉండటంతో ఆధునీకరణ పనులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
 
నిధులు సాధించలేని ప్రత్తిపాటి, రావెల
సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపులోనే మొండిచేయి చూపింది. కాపు కార్పొరేషన్ సంస్ధ ద్వారా రూ.1000 కోట్లు  కేటాయించింది. మిగిలిన కార్పొరేషన్లకు నామమాత్రంగా కేటాయింపులు జరిగాయి. బ్రాహ్మణ కార్పొరేషన్, మైనార్టీ, ఎస్టీ, ఎస్టీ కార్పొరేషన్‌లకు రెండంకెలకు మించకుండా నిధులు కేటాయించారు. రాజధాని నిర్మాణం నేపథ్యంలో రోడ్లు-భవనాల శాఖకు అత్యధికంగా నిధులు కేటాయించాలి.  కానీ రూ.2 వేల కోట్లకు పరిమితం చేశారు. జిల్లా నుంచి  వ్యవసాయశాఖ, సాంఘిక సంక్షేమశాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌లు ఆ శాఖలపై తమ ముద్రపడే రీతిలో నిధుల కేటాయింపుగానీ, కొత్త పథకాలను కానీ తీసుకురాలేకపోయారు. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేయనున్న నిధులపైనే గృహ నిర్మాణాలు ఆధారపడి ఉన్నాయి. వీటికోసం విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల్లోని పేద వర్గాలు వేలల్లో దరఖాస్తు చేసుకున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement