స్థానిక నేతల నోరు నొక్కారు | Criticism from their own side on the way CM | Sakshi
Sakshi News home page

స్థానిక నేతల నోరు నొక్కారు

Published Thu, Jun 23 2016 7:39 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

స్థానిక నేతల నోరు నొక్కారు - Sakshi

స్థానిక నేతల నోరు నొక్కారు

- టీడీపీ జిల్లా అధ్యక్షుడితో సహా సీనియర్ నేతలకూ నో చాన్స్
- ఒంగోలు సభలో మంత్రులను తప్ప మరెవరినీ మాట్లాడనివ్వని సీఎం
- పాత, కొత్త నేతల మధ్య విభేదాలే కారణం
- సీఎం తీరుపై స్వపక్షం నుంచే విమర్శలు
- పీడీసీసీబీ చైర్మన్‌ను సభలోకి అనుమతించని పోలీసులు

 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రుణవిముక్తి పత్రాల పంపిణీ పేరుతో బుధవారం ఒంగోలులో జరిగిన ముఖ్యమంత్రి సభలో జిల్లా మంత్రి శిద్దారాఘవరావుకు మినహా మరెవ్వరికీ మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడంపై జిల్లా పార్టీ శ్రేణులు మరింత ఆవేదన చెందుతున్నాయి. జిల్లా టీడీపీలో వర్గవిభేదాలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో ఏ ఒక్కరికి మైక్ ఇచ్చినా.. మొదటికే మోసం వస్తుందని భావించిన ముఖ్యమంత్రి సభలో జిల్లా నేతలను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన సభ హడాహుడిగా జరిగిన సభకాదు. ప్రభుత్వం రెండవ విడత రుణమాఫీ పత్రాలను పంపిణీ చేసేందుకు రూ.2 కోట్లు పైనే వెచ్చించి రెండుగంటలకు పైగా ఆర్భాటంగా సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా నేతలందరికీ మాట్లాడే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనుకున్నారు. కానీ చివరకు  ముఖ్యమంత్రి వ్యవసాయశాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ సభలో ఇన్‌చార్ట్ మంత్రి రావెల కిషోర్‌బాబుతో పాటు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుకు మాత్రమే అవకాశం కల్పించారు.

 మాట్లాడే అవకాశం రాలేదని నేతల ఆవేదన..
 జిల్లా పార్టీ అధ్యక్షుడుతో పాటు ఈ సభకు బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సీనియర్ నేత కరణం బలరాంలతో పాటు శాసనసభ్యులు హాజరయ్యారు. కానీ సీఎం ఏఒక్కరికీ మాట్లాడే అవకాశం ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాకు చెందిన రైతులకు రెండవ విడత రుణమాఫీ పంపిణీ నేపథ్యంలో కనీసం తమ ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందని సభావేదికపై నుంచి గొప్పలు చెప్పుకొనేందుకు కూడా సీఎం అవకాశం కల్పించక పోవడంపై ఓ అధికార పార్టీ నేత ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరిని మాట్లాడిస్తే అందరినీ మాట్లాడించాల్సి వస్తుందని, అదే జరిగితే చివరకు సభ ఏ పరిస్థితికి దారితీస్తుందోనని సీఎం భావించినట్లు సమాచారం. ఈ కారణంతోనే జిల్లా నేతలెవ్వరికీ మాట్లాడే అవకాశమివ్వలేదని తెలుస్తోంది. కనీసం ముఖ్యనేతలతోనైనా మాట్లాడించి ఉంటే బాగుండేదని రుణమాఫీతో పాటు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకునే అవకాశం ఉండేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్పించుకొని వర్గ విభేదాలకు ఆజ్యం పోసిందే ముఖ్యమంత్రి అని మరో నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి జిల్లా నేతలెవ్వరినీ మాట్లాడనివ్వకపోవడంతో అధికార పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ఈదరకు నో ఎంట్రీ..
 బుధవారం జరిగిన సభకు పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబును పోలీసులు అనుమతించలేదు. ఎమ్మెల్యేలతో పాటు సభావేదిక మీదకు వచ్చేందుకు ప్రయత్నించిన ఈదర ను అడ్డుకున్నారు. మీరెవరంటూ ప్రశ్నించారు. అవాక్కయైన ఈదర మోహన్ పీడీసీసీబీ చైర్మన్‌ను అంటూ పోలీసులకు సమాధానమిచ్చారు. అయితే కలెక్టర్ ఇచ్చిన జాబితాలో మీ పేరు లేదంటూ పోలీసులు నిర్మొహమాటంగా వేదిక మీదకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఈదర మోహన్ అక్కడ నుంచి వెనుతిరిగి వె ళ్లిపోయారు. అధికార పార్టీకి చెందిన ఈదర మోహన్‌ను ముఖ్యమంత్రి పాల్గొనే సభకు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సహకార బ్యాంకు వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఎట్టకేలకు మంత్రులు జోక్యం చేసుకొని సహకార శాఖ మంత్రి ద్వారా అవిశ్వాస తీర్మానంపై స్టే తెచ్చారు. మోహన్ హైకోర్టుకు వెళ్లి స్టేను రద్దు చేయించారు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌లు ఈదర మోహన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి సభకు ఈదర మోహన్‌ను పోలీసులు అనుమతించలేదని తెలుస్తోంది.
 
 కొత్త ఎమ్మెల్యేలకు భుజం తట్టిన సీఎం..
 కొత్తగా అధికార పార్టీలో చేరిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, యర్రగొండపాలెం పాలపర్తి డేవిడ్‌రాజులను ముఖ్యమంత్రి భుజం తట్టి మరీ పలకరించారు. సీఎం సభా వేదికపైకి రాగానే పాత నేతలను పలకరించకుండా వేదిక చివరన ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యే వద్దకు వచ్చి భుజం తట్టి మరీ నవ్వుతో పలకరించడం సభలో చర్చనీయాంశంగా మారింది. ఈ సన్నివేశాన్ని చూసిన పాత నేతలు లోలోపల రగిలిపోయారు. ఇదే సందర్భంలో అభివృద్ధిని ఆకాంక్షించి ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారని వారికి స్వాగతం పలుకుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదే సమయంలో ప్రజలు కూడా ఎమ్మెల్యేలకు స్వాగతం పలకాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇదే వేదికపైన మార్కాపురం టీడీపీ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి పచ్చ కండువాలు తెచ్చి మంత్రులతో పాటు పాత నేతలందరికీ మెడల్లో వేశారు. కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు వేయకపోవడంతో వేదికతో పాటు వేదిక ముందున్న వారు గుసగుసలాడుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement