ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు శిక్షణ
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రదాడుల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాదుల చర్యలతో ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలకు కూడా పోలీసులతో ప్రత్యేక తర్ఫీదు ఇప్పించాలని నిర్ణయించారు. తద్వారా ఉగ్రవాద చర్యలను సులభంగా పసిగట్టడంతోపాటు నష్టాన్ని భారీగా తగ్గించవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. నగరాలు, పట్టణాలలోకి కొత్తగా వచ్చే వ్యక్తులు, అనుమానితుల విషయాలను ఎప్పటికప్పుడు పోలీసుకు చేరేలా ఒక వ్యవస్థను రూపొందించబోతున్నారు.
ముఖ్యమైన ప్రాంతాలు, ప్రదేశాల వద్ద కాపాలా కాయడంలో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలదే ప్రముఖ పాత్ర. వీరికి ఇప్పటి వరకు ఎలాంటి శిక్షణ లేదు. దీంతో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించడంలో ప్రైవేటు సెక్యూరిటీ గుర్తించలేకపోతున్నారు. ఈ మేరకు ఇటీవల పలుచోట్ల పోలీసులు నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో లోపాలు బయటపడ్డాయి. వీటిని అధిగమించేందుకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికీ ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. అందుకు అనుగుణంగా త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించడం కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అనుమానితులపై డేగకన్ను
హైదరాబాద్‌తోపాటు ముఖ్యమైన నగరాలు, పట్టణాల్ల డేగకన్నుతో విస్తృతమైన భద్రతాచర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. లుంబినీ పార్కు, గోకుల్‌ఛాట్, మక్కా మసీదు తదితర ప్రాం తాల్లో ఉగ్రవాద దాడులు జరిగిన నేపథ్యంలో వాటిని పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆటోరిక్షా, ట్యాక్సీ డ్రైవర్లతో నిత్యం సమాచారం పంచుకునేలా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.