prefabricated
-
ప్రహారీకి అడ్డుగా ఉందని పక్కా ప్లాన్! జీహెచ్ఎంసీ పబ్లిక్ టాయిలెట్ కొట్టేసి..
సాక్షి, మల్కాజిగిరి: మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల ఉపయోగార్థం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ మాయమైంది. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేయగా, టాయిలెట్ చోరీ వెనుక ఉన్న అసలు కథ బయటకు వచ్చింది. రూ.45 వేలకు విక్రయం ఆనంద్‌బాగ్ చౌరస్తాలో కొన్నాళ్ల క్రితం ఇనుముతో చేసిన పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో ఓ కన్స్ట్రక్షన్స్ సంస్థ భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తోంది. దీని ప్రహరీ నిర్మాణానికి సదరు టాయిలెట్ అడ్డుగా మారింది. ఈ నేపథ్యంలోనే దాన్ని తొలగించాలని కోరుతూ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ పలుమార్లు జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్‌ను తొలగించాలంటే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉండాలని వాళ్లు తేల్చి చెప్పారు. చదవండి: డ్రెస్ కొనుక్కుంటానని చెప్పి బయటకు వెళ్లి.. నిర్మాణ సంస్థ సూపర్వైజర్ బిక్షపతికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే అరుణ్‌కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పబ్లిక్ టాయిలెట్ తొలగించే పని తాను చేస్తానంటూ చెప్పడంతో బిక్షపతి అంగీకరించాడు. టాటా ఏస్ వాహనం డ్రైవర్ చేస్తూ ఫ్లెక్సీ హోర్డింగ్స్ పని చేసే జోగయ్యకు ఆ పని అప్పగించాడు. ఈ నెల 16 ఆ టాయిలెట్ తీసుకెళ్లి ముషీరాబాద్‌లో రూ.45 వేలకు విక్రయించాడు. ఫిర్యాదు అందుకున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ జి.రాజు ఆదేశాల మేరకు సానిటరీ సూపర్వైజర్ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 17న కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలు, సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా పబ్లిక్ టాయిలెట్ తరలించడానికి వినియోగించిన వాహనాన్ని గుర్తించి జోగయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. టాయిలెట్ తొలగింపునకు సంబంధించి బిక్షపతి, అరుణ్‌కుమార్ మధ్య ఒప్పందం కుదిరిందని, అరుణ్ చెప్పడంతోనే తాను దాన్ని తీసుకుపోయానని విషయం చెప్పడంతో జోగయ్యను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బిక్షపతి, అరుణ్ కోసం గాలిస్తున్నారు. -
‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’తో రెండు పడక గదుల ఇళ్లు!
నిర్మాణ వ్యయం తగ్గింపుపై ప్రభుత్వం కసరత్తు తాజాగా ముందుకు వచ్చిన ముంబై కంపెనీ ఇప్పటికే టాటా హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీతో చర్చలు సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అనుకున్నదానికంటే అధికంగా వ్యయం అయ్యే పరిస్థితులు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ దీనిపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట మూడున్నర లక్షలు అనుకున్న వ్యయం ఇప్పుడు రూ. 5 లక్షలకు మించుతుండడంతో వ్యయాన్ని తగ్గించునే క్రమంలో ప్రీఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానాన్ని ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా శనివారం ముంబైకి చెందిన ఓ సంస్థ ప్రతినిధులు గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రెండు రకాల విస్తీర్ణంలో కొలతలు చెప్పి ఆ మేరకు ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని చెప్పాల్సిందిగా కోరగా, మరో నాలుగైదు రోజుల్లో వివరాలు అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రెండు పడక గదుల ఇళ్లను రెండు రకాల విస్తీర్ణాల్లో నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 515 చదరపు అడుగుల నుంచి 520 చదరపు అడుగుల మధ్య, గ్రామీణ ప్రాంతాల్లో 480 నుంచి 485 చదరపు అడుగుల మధ్య నిర్మించాలని భావిస్తోంది. దీనిపై శనివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో ఈ పరిమాణంలో ఇళ్లను నిర్మిస్తే రూ.4 లక్షల నుంచి రూ.4.10 లక్షల ఖర్చవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇతరత్రా కొన్ని వ్యయాలను మాత్రం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి తారకరామారావు కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో తక్కువ వ్యయంతో ఇళ్లు నిర్మించిన అనుభవం ఉన్న టాటా హౌసింగ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు 10 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉండడంతో ఆ సంస్థ కూడా ఉత్సాహం చూపుతోంది. త్వరలో ఈ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ కానున్నట్టు సమాచారం.