నిర్మాణ వ్యయం తగ్గింపుపై ప్రభుత్వం కసరత్తు
తాజాగా ముందుకు వచ్చిన ముంబై కంపెనీ
ఇప్పటికే టాటా హౌసింగ్ డెవలప్‌మెంట్
కంపెనీతో చర్చలు
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అనుకున్నదానికంటే అధికంగా వ్యయం అయ్యే పరిస్థితులు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషిస్తోంది. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ దీనిపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదట మూడున్నర లక్షలు అనుకున్న వ్యయం ఇప్పుడు రూ. 5 లక్షలకు మించుతుండడంతో వ్యయాన్ని తగ్గించునే క్రమంలో ప్రీఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానాన్ని ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా శనివారం ముంబైకి చెందిన ఓ సంస్థ ప్రతినిధులు గృహనిర్మాణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రెండు రకాల విస్తీర్ణంలో కొలతలు చెప్పి ఆ మేరకు ఇళ్ల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని చెప్పాల్సిందిగా కోరగా, మరో నాలుగైదు రోజుల్లో వివరాలు అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రెండు పడక గదుల ఇళ్లను రెండు రకాల విస్తీర్ణాల్లో నిర్మించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పట్టణ ప్రాంతాల్లో 515 చదరపు అడుగుల నుంచి 520 చదరపు అడుగుల మధ్య, గ్రామీణ ప్రాంతాల్లో 480 నుంచి 485 చదరపు అడుగుల మధ్య నిర్మించాలని భావిస్తోంది. దీనిపై శనివారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో ఈ పరిమాణంలో ఇళ్లను నిర్మిస్తే రూ.4 లక్షల నుంచి రూ.4.10 లక్షల ఖర్చవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇతరత్రా కొన్ని వ్యయాలను మాత్రం లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని సూచించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల ముంబై పర్యటనకు వెళ్లిన మంత్రి తారకరామారావు కూడా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిజ్ఞానంతో తక్కువ వ్యయంతో ఇళ్లు నిర్మించిన అనుభవం ఉన్న టాటా హౌసింగ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు 10 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉండడంతో ఆ సంస్థ కూడా ఉత్సాహం చూపుతోంది. త్వరలో ఈ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ కానున్నట్టు సమాచారం.
‘ప్రీ ఫ్యాబ్రికేటెడ్’తో రెండు పడక గదుల ఇళ్లు!
Published Sun, Feb 8 2015 3:03 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement
Advertisement