ఫైబ్రాయిడ్... క్యాన్సర్‌గా మారుతుందా?
సందేహం
నా వయసు 28. పెళ్లైన సంవత్సరానికే గర్భం దాల్చాను. అయితే గర్భం ట్యూబులో రావడంతో ల్యాపరోస్కోపీ చేసి ఒకవైపు ట్యూబ్ తీసేశారు. ఇది జరిగి మూడేళ్లవుతోంది. కానీ ఇంతవరకూ నేను మళ్లీ గర్భం దాల్చలేదు. ఒక ట్యూబ్ తీసేస్తే పిల్లలు పుట్టరా? నేను తల్లినయ్యే అవకాశం ఇక లేదా? దయచేసి నేనేం చేయాలో సలహా ఇవ్వండి.
- వి.రమ్యశ్రీ, నకిరేకల్
గర్భాశయానికి ఇరువైపులా ఒక్కో ట్యూబు, ఒక్కో అండాశయం ఉంటాయి. ప్రతినెలా అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఒక నెల ఒకవైపు అండాశయం నుంచి, మరో నెల మరొక అండాశయం నుండి విడుదలైన అండం... అటువైపున్న ట్యూబ్‌లోకి ప్రవేశించి, అక్కడకు గర్భాశయం నుంచి వచ్చిన వీర్యకణాలతో ఫలదీకరణ చెందుతుంది. దాంతో ట్యూబ్‌లో పిండం ఏర్పడి, అది తిరిగి గర్భాశయంలోకి చేరి, అక్కడ పాతుకుని, గర్భం మొదలవుతుంది.
మీకు ఒకవైపు ట్యూబ్ లేదు, ఇంకోవైపు ఉంది కాబట్టి... అటువైపు అండం విడుదలైనప్పుడు గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆపరేషన్ అయ్యి మూడేళ్లు అయినా ఇంకా గర్భం రాలేదు కాబట్టి.. ఓసారి గైనకాలజిస్టును సంప్రదించండి. ట్యూబ్ ఉన్న అండాశయం నుంచి అండం విడుదల అవుతుందా లేదా తెలుసుకోడానికి ఫాలిక్యులార్ స్టడీ చేసి చూడాల్సి ఉంటుంది. ట్యూబ్ ఉన్నవైపు అండా శయం నుంచి అండం విడుదలయ్యే టప్పుడు భర్తతో కలిస్తే గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదలవ్వకపోతే... మందులు వాడి ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది.
అయినా గర్భం రాకపోతే... ఉన్న ట్యూబ్ తెరచుకునే ఉందా లేక మూసుకుని ఉందా తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా డాక్టర్‌ను కలిసి, అన్ని పరీక్షలూ చేయించుకుని, తగిన చికిత్స తీసుకోండి. త్వరలోనే తప్పకుండా పండంటి బిడ్డకు తల్లి అవుతారు.
నా వయసు 23. నాకిప్పుడు నాలుగో నెల. ఈ మధ్య స్కానింగ్ చేసినప్పుడు నా గర్భాశయంలో ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది. దానివల్ల సమస్య ఏమీ ఉండదని డాక్టర్ చెప్పారు. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఫైబ్రాయిడ్లు క్యాన్సర్లుగా మారతాయని ఎక్కడో విన్నాను. అస్తమానం అదే నా బుర్రలో తిరుగుతోంది. నా బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని భయమేస్తోంది. అలాంటివేమీ జరక్కూడదంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- మంజూష, పాలకొల్లు
గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రస్ టిష్యూ, కండరాలతో కూడిన గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు చాలా చాలా అరుదు. కాబట్టి అనవసరంగా ఆందోళన చెందకుండా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండండి. గడ్డలు పెద్దవిగా ఉన్నా, ఎక్కువ గడ్డలు ఉన్నా కాన్పు సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గడ్డ చిన్నదే కాబట్టి అసలు కంగారే అవసరం లేదు. దాని కోసం మీరు ప్రత్యేకంగా చేయాల్సింది కూడా ఏమీ లేదు.
గర్భంలో శిశువు పెరిగేకొద్దీ గర్భాశయం సాగడం జరుగుతుంది. అందులో ఈ గడ్డ ఇంకా చిన్నగా కనబడుతుంది. చాలా అరుదుగా మాత్రమే గర్భంతో ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడవద్దు. డాక్టర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా స్కానింగులు చేయించుకోండి. ఆనందంగా ఉండి పండంటి బిడ్డను కనండి.
నా వయసు 27. ఎత్తు 4 అంగుళాల 10 సెం.మీ. బరువు 57 కిలోలు. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అయ్యింది. మావారికి నాకు మధ్య పదకొండు సంవత్సరాల వయసు తేడా ఉంది. నాకు వెంటనే పిల్లలు కావాలని అనిపిస్తోంది. కానీ ఇంతవరకూ నేను గర్భం దాల్చలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకుంటే పాప్‌స్మియర్ పరీక్ష చేసి ఇన్ఫెక్షన్ ఉంది అని తేల్చారు. అది పోవడానికి ఏవో మందులు కూడా ఇచ్చారు. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది. అది ఉంటే పిల్లలు పుట్టరా?
- లక్ష్మి, మచిలీపట్నం
యోని లోపల, గర్భాశయ ముఖ ద్వారం నుంచి ద్రవాన్ని తీసి... దాన్ని పరీక్షకు పంపించి, దానిలోని కణాలు ఎటువంటివో తెలుసుకునే పరీక్షను పాప్‌స్మియర్ అంటారు. ఇందులో మీకు ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది కాబట్టి దానికి సరైన యాంటి బయొటిక్స్తో కూడిన చికిత్స తీసుకుంటే మీ సమస్య త్వరలోనే తీరిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిపోతే పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవా, వైరస్ల వల్ల రావొచ్చు. ఇది భారాభర్తల కలయిక వల్ల ఒకరి నుంచి ఒకరి సంక్రమించనూ వచ్చు. లేదా ఆడవారిలో మలద్వారం యోని ద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల మలద్వారం దగ్గరున్న రోగక్రిములు యోని ద్వారంలోకి ప్రవేశించి, తద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. అయినా మీకు పెళ్లై తొమ్మిది నెలలే అయ్యింది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుని మరో మూడు నెలలు గర్భం కోసం ప్రయత్నం చేయండి. సంవత్సరం దాటినా కూడా గర్భం దాల్చకపోతే, డాక్టర్‌ను సంప్రదించండి. గర్భం రాకపోవడానికి గల కారణాలు తెలుసుకుంటే తగిన చికిత్స తీసుకోవచ్చు.
నా వయసు 22. బరువు 90 కిలోలు. మెచ్యూర్ అయినప్పట్నుంచీ కూడా నాకు పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కాదు. అయితే గత నెల వచ్చాయి కానీ ఇరవై అయిదు రోజుల పాటు బ్లీడింగ్ అవుతూనే ఉంది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకున్నాను. హైపో థైరాయిడ్ అని, నా గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని తేలింది. సెకెండ్ ఒపీనియన్ ఉంటే మంచిదని మరో హాస్పిటల్లో కూడా చేయించుకున్నాను. అక్కడా ఇదే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకున్నవి పెద్ద సమస్యలా?
- విజయలక్ష్మి, కోదాడ
మీరు తొంభై కిలోల బరువు ఉన్నారు. అంటే అధిక బరువు ఉన్నారు. దానివల్ల అండాశయంలో నీటి బుడగలు ఏర్పడి, హార్మోన్ల అసమతుల్యత కూడా వచ్చి, పీరియడ్స్ సక్రమంగా రావు. పైగా మీకు హైపో థైరాయిడ్ సమస్య కూడా ఉంది. ఇది ఉంటే థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువ విడుదలవుతుంది. దానివల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రావు. అయితే ప్రతి ఒక్క సమస్యకీ ఏదో ఒక పరిష్కారం ఉన్నట్లే... మీ సమస్యకీ పరిష్కారం ఉంది. కాకపోతే అది మీ చేతుల్లోనే ఉంది. బరువు తగ్గడం వల్ల థైరాయిడ్ సమస్య కొద్దిగా అదుపులోకి వస్తే, మందుల డోసును తగ్గించవచ్చు.
అలాగే నీటి బుడగల వల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా కొద్దిగా సరి చేయవచ్చు. క్రమపద్ధతిలో వ్యాయామం, వాకింగ్ చేస్తూ ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకోండి. దాంతో బరువు తగ్గుతారు. అలాగే గైనకాలజిస్టును సంప్రదించి, వారి పర్యవేక్షణలో పీసీఓఎస్ ఇంకా పెరగకుండా ఉండటానికి, అలాగే హార్మోన్ల అసమతుల్యతను సరిచేయ డానికి మందుల్ని వాడండి. కచ్చితంగా మీ సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడు కనుక అశ్రద్ధ చేస్తే సమస్య ఇంకా జటిలమవుతుంది.
ఇన్ఫెక్షన్ తగ్గిపోతే పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవా, వైరస్ వల్ల రావొచ్చు. ఇది భారాభర్తల కలయిక వల్ల ఒకరి నుంచి ఒకరి సంక్రమించనూ వచ్చు.
నా వయసు 33. బరువు 55 కిలోలు. నాకు ఇద్దరు పిల్లలు. నాకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతోంది. గత నెల పదిహేను రోజుల వరకూ అవ్వడంతో డాక్టర్ని సంప్రదించాను. స్కాన్ చేసి గర్భసంచి ఉబ్బింది, 13.5 ఉంది అని చెప్పారు. నేను ప్రతి విషయాన్నీ ఎక్కువ ఆలోచిస్తాను. ఏదైనా చిన్న బాధ కలిగినా పదే పదే తలచుకుని కుమిలి పోతుంటాను. ఈ లక్షణాలు పీరియడ్స్‌కి ముందు మరీ ఎక్కువవు తున్నాయి. ఈ మనస్తత్వం వల్లే నాకు సమస్య వచ్చిందేమో అనిపిస్తోంది. దీనికి తోడు నాకు సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. పరిష్కారం చెప్పండి.
- బి.కవిత, వరంగల్
మీకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువవుతోంది, పైగా అది రానురాను ఎక్కువ రోజులు అవుతోందని అంటున్నారు. గర్భాశయం ఉబ్బిందనీ అంటున్నారు. మీరు రాసిన 13.5 అనేది గర్భాశయం పొడవా లేక ఏంటి అనేది సరిగ్గా రాలేదు. నేననుకోవడం గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర మందంగా తయారయ్యి, 13.5 మిల్లీ మీటర్లకు చేరినట్లుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల జరిగి ఉండొచ్చు.
మీరు చెప్పే కంగారు, భయం వంటి లక్షణాలు కూడా చాలామందికి పీరియడ్స్ మొదలయ్యే పది రోజులకు ముందు నుంచే ఎక్కువ అవుతూ ఉంటాయి. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా పీరియడ్స్ ముందు రక్తంలో అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్లలో మార్పుల వల్ల, మినరల్స్ లోపం వల్ల రావొచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో సాయంత్రం primerose oil, minerals కాంబినేషన్‌తో ఉన్న మాత్రలను మూడు నెలల పాటు వాడుతూ ఉండాలి. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల సిండ్రోమ్ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి.
ఎండోమెట్రియమ్ పొర 13.5 మి.మీ. మందంగా ఉండటం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది. దీనికి మూడు నెలల పాటు ప్రతి నెలా పదిహేనవ రోజు నుంచి పది రోజుల పాటు medroxyprogesterone మందులు వాడండి. మూడు నెలల తర్వాత ఐదవ రోజు స్కానింగ్ చేసి, ఎండోమెట్రియమ్ పొర మందం ఎంత ఉందో చూసుకోవాలి. 6 మి.మీ. ఉంటే ఫర్వాలేదు. ఇంకా మందంగా కనుక ఉంటే... డీ అండ్ సీ చేసి, పొర ముక్కను బయాప్సీకి పంపించాలి. కారణం తెలిశాక దాన్నిబట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల తేడా వల్ల కూడా బ్లీడింగ్ అధికంగా అవ్వొచ్చు. హార్మోన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని, వాటిలో తేడా ఉంటే తగిన మందులు వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు.
- డా. వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్