ప్రత్యూష గేమ్ ‘డ్రా’
కోల్‌కతా: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు బొడ్డ ప్రత్యూష, నూతక్కి ప్రియాంకలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్లో తానియా సచ్దేవ్ (ఎయిరిండియా)తో 124 ఎత్తులపాటు సుదీర్ఘంగా సాగిన గేమ్‌ను ప్రత్యూష ‘డ్రా’ చేసుకోగా... ప్రపంచ అండర్-14 చాంపియన్ వైశాలి (తమిళనాడు) చేతిలో ప్రియాంక ఓడిపోయింది. ఈ టోర్నీలో ప్రత్యూషకిది మూడో ‘డ్రా’ కాగా... ప్రియాంకకు మూడో ఓటమి. ఏడో రౌండ్ తర్వాత ప్రత్యూష ఖాతాలో 4.5 పాయింట్లు, ప్రియాంక ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. 5.5 పాయింట్లతో పద్మిని రౌత్ (ఒడిషా), స్వాతి ఘాటే (ఎల్ఐసీ) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.