మేలో కొత్త వ్యాపార ప్రీమియం రూ.23,448 కోట్లు
న్యూఢిల్లీ: జీవిత బీమా కంపెనీల కొత్త వ్యాపార ప్రీమియం (కొత్త పాలసీల రూపంలో వచ్చేది) మే నెలలో 4.1 శాతం తగ్గి రూ.23,448 కోట్లకు పరిమితమైంది. 24 జీవిత బీమా కంపెనీలు క్రితం ఏడాది ఇదే నెలలో ఉమ్మడిగా రూ.24,480 కోట్లు ప్రీమియం ఆదాయం సంపాదించాయి. నూతన వ్యాపార ప్రీమియం పరంగా ఎల్ఐసీ 11.26 శాతం క్షీణతను నమోదు చేసింది. ఈ సంస్థకు నూతన పాలసీల రూపంలో మే నెలలో రూ.14,056 కోట్ల ప్రీమియం సమకూరింది.
ఏడాది క్రితం ఇదే నెలలో ఎల్ఐసీకి వచ్చిన ఆదాయం రూ.15,840 కోట్లుగా ఉంది. ఈ గణాంకాలను బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ కాకుండా మిగిలిన 23 జీవిత బీమా సంస్థల ఉమ్మడి ప్రీమియం ఆదాయం 9 శాతం పెరిగి రూ.9,421 కోట్లుగా నమోదైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో 24 జీవిత బీమా కంపెనీల నూతన వ్యాపార ప్రీమియం ఆదాయం రూ.36,043 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.42,420 కోట్లతో పోలిస్తే 15 శాతం తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి
రెండు నెలల్లో ఎల్ఐసీ నూతన వ్యాపార ప్రీమియం 28 శాతం క్షీణించి రూ.19,866 కోట్లకు పరిమితమైంది.