premiums
-
ఐపీవో అధిక వేల్యుయేషన్స్‌పై సెబీ దృష్టి
ముంబై: పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి భారీ ప్రీమియంలు, అధిక వేల్యుయేషన్ల అంశాన్ని పరిశీలించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ తెలిపారు. పెద్దగా తెలియని కంపెనీలు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఫేస్ వేల్యూను తక్కువగా చూపించి, షేరును మాత్రం భారీ ప్రీమియం రేటుకు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు పబ్లిక్ ఇష్యూల టైమింగ్‌ను మార్కెట్‌కి వదిలేయాలన్నదే సెబీ ఉద్దేశమని మాధవి చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే కంపెనీలు ఇష్యూకి వస్తాయని, ఎప్పుడు రావాలనేది సెబీ నిర్దేశించడమనేది ఇటు ఇన్వెస్టర్లు, అటు సంస్థకు ప్రయోజనకరంగా ఉండబోదని ఆమె పేర్కొన్నారు. -
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఏ వాహనానికి ఎంతెంత?
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) వివిధ రకాల వాహనాల థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి కేంద్రం కొత్త బేస్ ప్రీమియం రేట్లను ప్రతిపాదించింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐతో సంప్రదించిన మీదట 1,000 సీసీ సామర్థ్యం లోపు గల ప్రైవేట్ కార్లకు రూ. 2,094, 1000–1,500 సీసీ కార్లకు రూ. 3,416, అంతకు మించిన వాటికి రూ. 7,897 బేస్ ప్రీమియంను సూచించింది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పరిశ్రమ వర్గాలు 30 రోజుల్లోగా దీనిపై అభిప్రాయాలు చెప్పాలి. నోటిఫికేషన్ ప్రకారం.. 75 సీసీ లోపు సామర్ధ్యమున్న టూ–వీలర్లకు రేటు రూ. 538గాను, అంతకు మించి 350 సీసీ వరకు రూ. 714–2,804 శ్రేణిలోనూ బేస్ ప్రీమియం ఉండనుంది. గూడ్స్ రవాణా చేసే వాణిజ్య వాహనాలకు సంబంధించి (త్రిచక్ర వాహనాలు కాకుండా) 7,500 కేజీలలోపు వైతే రూ. 16,049, అది దాటి 40,000 కేజీలు.. అంతకు పైన వాటికి రూ. 27,186–44,242 శ్రేణిలో బేస్ ప్రీమియం రేటు ఉంటుంది. ఈ–కార్టులు మినహా మోటార్ త్రీ–వీలర్లకు బేస్ ప్రీమియంను రూ. 4,492గా ప్రతిపాదించారు. అటు ప్రైవేట్ ఈ–కార్ల విషయానికొస్తే.. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాటికి రూ. 1,780, అంతకు మించి 65 కేడబ్ల్యూ వరకు రూ. 2,904, దాన్ని దాటితే రూ. 6,712 గాను బేస్ ప్రీమియం ఉండనుంది. -
ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్!
బెంగళూరు: కోవిడ్–19 విజృంభించిన సమయంలో ప్రయాణాలు దాదాపు నిల్చిపోయాయి. ప్రస్తుతం ట్రావెల్ విభాగం క్రమంగా పుంజుకుంటోంది. దీంతో ప్రయాణ బీమా పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్ పూర్వం 2019–20లో నెలకొన్న పరిస్థితితో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ట్రావెల్ పాలసీల విక్రయం పుంజుకున్నట్లు డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ వెల్లడించింది. తమ అంతర్గత డేటా ప్రకారం ఈ ఏడాది కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తాము గతేడాది మొత్తం మీద అమ్మిన ట్రావెల్ పాలసీల్లో సుమారు 75 శాతం పాలసీలను ఈ ఏడాది నాలుగు నెలల్లోనే విక్రయించగలిగినట్లు పేర్కొంది. 2021–22లో 12.8 లక్షల ట్రావెల్ పాలసీలను విక్రయించినట్లు సంస్థ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ చతుర్వేది తెలిపారు. సాధారణంగా ట్రిప్ రద్దు కావడం, ఫ్లయిట్లు రద్దు కావడం లేదా జాప్యం జరగడం వంటి అంశాలే ట్రావెల్ క్లెయిమ్‌లకు కారణాలుగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్–19కు పూర్వం ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను దేశీయ ప్రయాణికులు ఎక్కువగా పట్టించుకునే వారు కాదని, కాని ప్రస్తుతం అనూహ్య పరిస్థితులతో ప్రయాణాలకు అంతరాయం కలిగినా నష్టపోకుండా ఉండేందుకు చాలా మంది ఇప్పుడు ప్రయాణ బీమా పాలసీలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు. -
వైద్య బీమా ప్రీమియానికి డబ్బుల్లేవు
న్యూఢిల్లీ: ఉద్యోగుల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు కంపెనీ వద్ద డబ్బుల్లేవని జెట్ఎయిర్ వేస్ తన ఉద్యోగులకు స్పష్టం చేసింది. మంగళవారంతో కంపెనీ ఉద్యోగులకు సంబంధించిన గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ రెన్యువల్ గడువు తీరిపోయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్ 17 నుంచి సంస్థ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ‘‘రుణదాతలు లేదా ఇతర మార్గాల నుంచి అత్యవసరంగా నిధులు అందే పరిస్థితి సమీపంలో లేదు. దీంతో గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు అవసరమైన నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో కంపెనీ ఉంది’’ అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రాహుల్ తనేజా సమాచారం ఇచ్చారు. -
ప్రీమియం సొమ్మంతా చెల్లించాం
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి వసూలు చేసిన పంటల ప్రీమియం సొమ్మును బీమా కంపెనీలకు పూర్తిస్థాయిలో చెల్లించామని.. ఏ బ్రాంచిలోనూ ఆ సొమ్మును దాచుకున్న దాఖ లాలు లేవని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపాయి. ఈ విషయంపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్లు, బీమా కంపెనీలతో సమీక్ష జరిపారు. పంట రుణాలు తీసుకునే రైతుల నుంచి బీమా ప్రీమియం సొమ్మును కోత విధించుకొనే బ్యాంకులు.. ఆ సొమ్మును పూర్తి గా బీమా కంపెనీలకు చెల్లించడంలేదని సర్కారు భావించింది. కొంత మొత్తమే చెల్లించి మిగిలిన సొమ్మును తమ వద్దే ఉంచుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. ఇలా రూ.వందల కోట్లు ఎటు పోయాయన్న విషయంపై విచారణ చేయాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను గతంలో ఆదేశించింది. దీనిపై విచారణ చేపట్టిన బ్యాంకులు అటువంటి పరిస్థితి లేదని మంత్రికి చెప్పినట్లు తెలిసింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల నుంచి ప్రీమియం సొమ్మును తీసేసుకోవాలన్న నిబంధన ఉంది. పంటల బీమాతో ప్రయోజనం కనిపించక రైతులు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నా.. ప్రీమియం చెల్లించడానికి తిరస్కరిస్తున్నారు. ‘తప్పనిసరిగా’ ప్రీమియం చెల్లించాలన్న అంశంపై అనేకమంది రైతులు కోర్టుల్లో స్టే తెచ్చుకుని ప్రీమియం చెల్లించడంలేదని బ్యాంకులు చెప్పాయి. అందుకే రుణం తీసుకున్న స్థాయిలో ప్రీమియం కనిపించడం లేదని తేలినట్లు బ్యాంకర్లు పేర్కొన్నారు. కాగా, ఈ ఖరీఫ్‌లో 15 వేల కోట్ల పంట రుణాలివ్వాలన్న లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు 4500 కోట్లు మాత్రమే ఇచ్చారంటూ బ్యాంక్ అధికారులపై పోచారం సీరియస్ అయినట్లు సమాచారం. -
గ్యాస్ ప్రమాదాలకు బీమా...
జీవితానికీ, సెల్ఫోన్లకీ, వాహనాలకీ.. ఇలా ప్రతీ దానికీ బీమా పాలసీలంటూ ఉన్నాయి. ఇంకా కొంగొత్త పాలసీలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఈ కొత్త వాటి గురించి పక్కన పెడితే .. మనం నిత్యం ఉపయోగించే చాలా వాటికి మనం స్వయంగా ప్రీమియంలు కట్టకపోయినా కూడా బీమా కవరేజీ ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో కొన్నింటి వివరాలు మీకోసం.. గ్యాస్ బీమా.. వంటగ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తే బాధిత వినియోగదారులు ఏకంగా రూ. 40 లక్షల దాకా బీమా క్లెయిమ్ పొందడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వంట గ్యాస్ సిలిండర్ల దుర్ఘటనల మూలంగా తలెత్తే క్లెయిముల కోసం ఎల్పీజీ పంపిణీదారులు థర్డ్ పార్టీ లయబిలిటీ బీమా కవరేజీ తీసుకోవాలి. వంట గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు.. వినియోగదారు, వారి కుటుంబసభ్యులకు ఈ కవరేజీ వర్తిస్తుంది. దీనికోసం వినియోగదారులు ఎలాంటి ప్రీమియమూ కట్టనక్కర్లేదు. ఒకవేళ దుర్ఘటనలో మరణం సంభవించిన పక్షంలో పరిహారం కోసం అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లొచ్చు. మృతుల వయసు, అప్పటిదాకా వారి ఆదాయం తదితర అంశాలను బట్టి.. పరిహారాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. చాలా మటుకు డీలర్లు ఈ బీమా విషయాన్ని వినియోగదారులకు తెలియజేయరు. అందుకే అనేక సంవత్సరాలుగా ఎల్పీజీ సిలిండ ర్ బీమా ఉన్నప్పటికీ క్లెయిముల సంఖ్య చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. ఇక క్లెయిమ్ విషయానికొస్తే.. గ్యాస్ ప్రమాదం జరిగిన సంగతిని ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలాగే, నిర్ణీత సమయంలోగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌కి కూడా రాతపూర్వకంగా తెలియజేయాలి. తర్వాత పంపిణీదారు ఆ విషయాన్ని గ్యాస్ కంపెనీకి, బీమా సంస్థకి తెలియజేయాలి. బీమా కంపెనీ సర్వే పూర్తి చేసిన 30 రోజుల్లోగా క్లెయిము మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే, బీమా కవరేజీ లభించాలంటే మన వంతుగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. గ్యాస్‌పైపు, లైటరు, రెగ్యులేటరు మొదలైనవి ప్రామాణికమైన ఐఎస్ఐ మార్కు ఉన్నవే వాడాల్సి ఉంటుంది. అలాగే పరిహారం విషయాన్ని పక్కన పెట్టి.. అసలు ప్రమాదమే జరగకుండా జాగ్రత్తపడేం దుకు మధ్య మధ్యలో గ్యాస్ డీలర్‌తో తరచూ మెయిం టెనెన్స్ చెకప్‌లు చేయించడం మంచిది. అందుకు సంబంధించిన రసీదులూ భద్రపర్చుకోవాలి. బ్యాంకు డిపాజిట్లకూ రక్షణ.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసే సొమ్ముకు కూడా బీమా కవరేజీ ఉంటుంది. పొదుపు ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, కరెంటు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లకు సంబంధించి రూ. 1 లక్ష దాకా (అసలు, వడ్డీ కలిపి) ఈ రక్షణ లభిస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఈ మేరకు కవరేజీ ఉండేలా చూస్తుంది. ఉదాహరణకు.. మీ ఖాతాలో అసలు రూ.90,000, వడ్డీ రూ. 8,000 ఉన్న పక్షంలో మొత్తం రూ.98,000కు డీఐసీజీసీ బీమా భరోసా ఉంటుంది. అలా కాకుండా అసలు మొత్తమే రూ. 1 లక్ష ఉంటే, దానిపై వచ్చే వడ్డీకి బీమా కవరేజీ ఉండదు. అదే, ఒకే బ్యాంకులోని వివిధ శాఖల్లో ఎంత మేర డిపాజిట్లు ఉన్నప్పటికీ.. రూ. 1లక్షకు మాత్రమే రక్షణ లభిస్తుంది. అదే వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే.. ఒక్కో దానికి విడివిడిగా ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇక బ్యాంకులు కాకుండా.. డిపాజిట్లు సేకరించే కంపెనీలు కూడా రు. 20,000 దాకా బీమా కవరేజీ కల్పించాలని చట్టాలు నిర్దేశిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.