గ్యాస్ ప్రమాదాలకు బీమా...
జీవితానికీ, సెల్‌ఫోన్లకీ, వాహనాలకీ.. ఇలా ప్రతీ దానికీ బీమా పాలసీలంటూ ఉన్నాయి. ఇంకా కొంగొత్త పాలసీలు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఈ కొత్త వాటి గురించి పక్కన పెడితే .. మనం నిత్యం ఉపయోగించే చాలా వాటికి మనం స్వయంగా ప్రీమియంలు కట్టకపోయినా కూడా బీమా కవరేజీ ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో కొన్నింటి వివరాలు మీకోసం..
గ్యాస్ బీమా..
వంటగ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తే బాధిత వినియోగదారులు ఏకంగా రూ. 40 లక్షల దాకా బీమా క్లెయిమ్ పొందడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా వంట గ్యాస్ సిలిండర్ల దుర్ఘటనల మూలంగా తలెత్తే క్లెయిముల కోసం ఎల్‌పీజీ పంపిణీదారులు థర్డ్ పార్టీ లయబిలిటీ బీమా కవరేజీ తీసుకోవాలి. వంట గ్యాస్ ప్రమాదాలు జరిగినప్పుడు.. వినియోగదారు, వారి కుటుంబసభ్యులకు ఈ కవరేజీ వర్తిస్తుంది. దీనికోసం వినియోగదారులు ఎలాంటి ప్రీమియమూ కట్టనక్కర్లేదు.
ఒకవేళ దుర్ఘటనలో మరణం సంభవించిన పక్షంలో పరిహారం కోసం అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లొచ్చు. మృతుల వయసు, అప్పటిదాకా వారి ఆదాయం తదితర అంశాలను బట్టి.. పరిహారాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. చాలా మటుకు డీలర్లు ఈ బీమా విషయాన్ని వినియోగదారులకు తెలియజేయరు. అందుకే అనేక సంవత్సరాలుగా ఎల్‌పీజీ సిలిండ ర్ బీమా ఉన్నప్పటికీ క్లెయిముల సంఖ్య చాలా తక్కువ స్థాయిలోనే ఉంది.
ఇక క్లెయిమ్ విషయానికొస్తే.. గ్యాస్ ప్రమాదం జరిగిన సంగతిని ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలాగే, నిర్ణీత సమయంలోగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌కి కూడా రాతపూర్వకంగా తెలియజేయాలి. తర్వాత పంపిణీదారు ఆ విషయాన్ని గ్యాస్ కంపెనీకి, బీమా సంస్థకి తెలియజేయాలి. బీమా కంపెనీ సర్వే పూర్తి చేసిన 30 రోజుల్లోగా క్లెయిము మొత్తాన్ని చెల్లిస్తుంది.
అయితే, బీమా కవరేజీ లభించాలంటే మన వంతుగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. గ్యాస్‌పైపు, లైటరు, రెగ్యులేటరు మొదలైనవి ప్రామాణికమైన ఐఎస్‌ఐ మార్కు ఉన్నవే వాడాల్సి ఉంటుంది. అలాగే పరిహారం విషయాన్ని పక్కన పెట్టి.. అసలు ప్రమాదమే జరగకుండా జాగ్రత్తపడేం దుకు మధ్య మధ్యలో గ్యాస్ డీలర్‌తో తరచూ మెయిం టెనెన్స్ చెకప్‌లు చేయించడం మంచిది. అందుకు సంబంధించిన రసీదులూ భద్రపర్చుకోవాలి.
బ్యాంకు డిపాజిట్లకూ రక్షణ..
బ్యాంకుల్లో డిపాజిట్ చేసే సొమ్ముకు కూడా బీమా కవరేజీ ఉంటుంది. పొదుపు ఖాతాలు, ఫిక్సిడ్ డిపాజిట్లు, కరెంటు ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లకు సంబంధించి రూ. 1 లక్ష దాకా (అసలు, వడ్డీ కలిపి) ఈ రక్షణ లభిస్తుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ఈ మేరకు కవరేజీ ఉండేలా చూస్తుంది. ఉదాహరణకు.. మీ ఖాతాలో అసలు రూ.90,000, వడ్డీ రూ. 8,000 ఉన్న పక్షంలో మొత్తం రూ.98,000కు డీఐసీజీసీ బీమా భరోసా ఉంటుంది.
అలా కాకుండా అసలు మొత్తమే రూ. 1 లక్ష ఉంటే, దానిపై వచ్చే వడ్డీకి బీమా కవరేజీ ఉండదు. అదే, ఒకే బ్యాంకులోని వివిధ శాఖల్లో ఎంత మేర డిపాజిట్లు ఉన్నప్పటికీ.. రూ. 1లక్షకు మాత్రమే రక్షణ లభిస్తుంది. అదే వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్లు ఉంటే.. ఒక్కో దానికి విడివిడిగా ఇన్సూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇక బ్యాంకులు కాకుండా.. డిపాజిట్లు సేకరించే కంపెనీలు కూడా రు. 20,000 దాకా బీమా కవరేజీ కల్పించాలని చట్టాలు నిర్దేశిస్తున్నాయి. అయితే, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.