నేడే భూపంపిణీ
సీఎం చేతుల మీదుగా..
తొమ్మిది మందికే పట్టాలు
జిల్లాకు రూ.5 కోట్ల నిధులు
ఆగమాగం అధికారుల కసరత్తు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : భూమి లేని నిరుపేద దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఆగమేఘాలపై కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. గోల్కొండ కోటలో జరిగే వేడుకల అనంతరం సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. పలు జిల్లాల నుంచి లబ్ధిదారులను హైదరాబాద్కు రప్పించే ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా జిల్లా నుంచి 9 మంది ఎస్సీ మహిళ లబ్ధిదారులను ఎంపిక చేసింది. ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం కానంపల్లికి చెందిన ఆరె నర్సమ్మ, రాదపాక లక్ష్మి, లింగంపల్లి రాజేశ్వరి, మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ప్రతాపగిరి గ్రామానికి చెందిన ఎరుకల రాజేశ్వరి, మేదరి లక్ష్మి, హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలోని పాతర్లపల్లికి చెందిన దుబ్బాసి రజిత, కోడెం రాజమణి, సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామానికి చెందిన దుబ్బాక రాజవ్వ, మల్లారపు లావణ్యను ఎంపిక చేశారు. వీరికి పంపిణీ చేసేందుకు నిర్ధేశించిన భూములకు సంబంధించి పట్టాలను సిద్ధం చేశారు.
కొన్ని చోట్ల లబ్ధిదారులకు అవసరమైన భూములను రెవెన్యూ అధికారులు అప్పటికప్పుడు కొనుగోలు చేశారు. హడావుడిగా గురువారం రాత్రి వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను వారి పేరిట సిద్ధం చేయించారు. ఎంపిక చేసిన తొమ్మిది మంది లబ్ధిదారుల జాబితాను జిల్లా ఎస్సీ సేవా సహకార సంఘం ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కార్యాలయం ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి పంపించింది. స్వాతంత్య్ర వేడుక ల్లో పట్టాలు అందుకునేందుకు వీరికి ప్ర త్యేక పాసులు జారీ చేయించింది.
జిల్లా కేంద్రంలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లోనూ మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయించాలని జిల్లా యంత్రాంగం భావి స్తోంది. ఇప్పటికే గుర్తించిన గ్రామాల్లో ఐదుగురు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబి తాను పంపించాలని ఆర్డీవోలను కోరింది. భూముల కొనుగోలుకు అవసరమయ్యే ని ధులను ఎస్సీ కార్పొరేషన్ మంజూరు చేసింది. మొత్తం రూ.5 కోట్లు విడుదల చేసి ఆర్డీవోలకు అందించామని ఈడీ సత్యనారాయణశర్మ తెలిపారు. బెజ్జంకి మం డలం పారువెల్లలో ఎన్.ఎల్లవ్వ, పి.పోచ వ్వ, ఎల్.పోచవ్వ, ఎం.మల్లవ్వ, ఎం.మల్ల వ్వ, స్వరూపను ఎంపిక చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ చేతులమీదుగా పట్టాలు అందించనున్నారు.