Prequeler Final
-
French Open 2021: సెరెనా సాఫీగా...
పారిస్: రెండో రౌండ్లో శ్రమించి విజయాన్ని దక్కించుకున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్లో మాత్రం తడబడకుండా ఆడింది. తన దేశానికే చెందిన డానియెలా కొలిన్స్‌తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 6–4, 6–4తో గెలిచిన ఏడో సీడ్ సెరెనా ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 85 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఐదు ఏస్‌లు సంధించింది. నెట్ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 8సార్లు పాయింట్లు సంపాదించిన సెరెనా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. పావ్లీచెంకోవా సంచలనం మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన మూడో సీడ్ సబలెంకా (బెలారస్) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. 31వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) అద్భుత ఆటతీరుతో 6–4, 2–6, 6–0తో సబలెంకాను బోల్తా కొట్టించి 2011 తర్వాత ఈ టోర్నీ లో మళ్లీ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ సీడ్ అజరెంకా (బెలారస్) 6–2, 6–2తో 23వ సీడ్ కీస్ (అమెరికా)పై, 20వ సీడ్ మర్కెత వొంద్రుసొవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో పొలోనా హెర్కాగ్ (స్లొవేనియా)పై, 21వ సీడ్ రిబికినా (కజకిస్తాన్) 6–1, 6–4తో వెస్నినా (రష్యా)పై, తామర జిదాన్సెక్ (స్లొవేనియా) 0–6, 7–6 (7/5), 6–2తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. 1968 తర్వాత తొలిసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్)తో జరిగిన మ్యాచ్‌లో నాదల్ 6–0, 7–5, 6–2తో గెలుపొందాడు. గాస్కే పరాజయంతో 1968 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగంలో ఒక్క ఫ్రాన్స్ క్రీడాకారుడు కూడా మూడో రౌండ్‌కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. ఈసారి సింగిల్స్ విభాగంలో ఫ్రాన్స్ నుంచి 29 మంది బరిలోకి దిగారు. మరోవైపు మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–2, 7–5, 6–2తో లాస్లో జెరె (సెర్బియా)పై, రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–4, 6–2, 6–4తో ఒపెల్కా (అమెరికా)పై, 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 6–4, 6–4, 6–2తో జాన్సన్ (అమెరికా)పై ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. 15వ సీడ్ కాస్పెర్ రూడ్ (నార్వే) 4 గంటల 35 నిమిషాల్లో 6–7 (3/7), 6–2, 6–7 (6/8), 6–0, 5–7తో ఫోకినా (స్పెయిన్) చేతిలో... 27వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 4–6, 1–6, 3–6తో డెల్బోనిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. -
గట్టెక్కిన జొకోవిచ్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ జొకోవిచ్‌కు మూడో రౌండ్లో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అమెరికా యువతార, 27వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/1), 6–4, 3–6, 4–6, 6–2తో గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ మ్యాచ్ మూడో సెట్ తొలి గేమ్ సందర్భంగా జొకోవిచ్ జారి పడ్డాడు. మెడికల్ టైమ్అవుట్ తీసుకొని కోర్టులోనే చికిత్స చేయించుకొని జొకోవిచ్ ఆట కొనసాగించాడు. నొప్పితోనే ఆడిన జొకోవిచ్ మూడో సెట్, నాలుగో సెట్‌ను చేజార్చుకున్నాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ సెర్బియా స్టార్ ఐదో సెట్లోని ఆరో గేమ్‌లో, ఎనిమిదో గేమ్‌లో ఫ్రిట్జ్ సర్వీస్‌లను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 4–6, 4–6, 6–3, 6–4, 6–4తో కిరియోస్ (ఆస్ట్రేలియా)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 6–3, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై నెగ్గగా... ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 3–6, 3–6, 3–6తో క్వాలిఫయర్ కరాత్సెవ్ (రష్యా) చేతిలో... 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా) 5–7, 5–7, 3–6తో ఆలియాసిమ్ (కెనడా) చేతిలో ఓడిపోయారు. సెరెనా ముందుకు... మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, పదో సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 7–6 (7/5), 6–2తో పొటపోవా (రష్యా)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 6–1, 6–3తో కుదర్మెతోవా (రష్యా)పై, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–3, 6–2తో ఆన్స్ జబుయెర్ (ట్యూనిసియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో ఆన్ లీ (అమెరికా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
గట్టెక్కిన జ్వెరెవ్
పారిస్: మూడో రౌండ్లో మ్యాచ్ పాయింట్ కాపాడుకొని ఊపిరి పీల్చుకున్న జర్మనీ టెన్నిస్ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనూ పోరాడి గట్టెక్కాడు. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించాడు. టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 4–6, 7–6 (7/4), 2–6, 6–3, 6–3తో కరెన్ ఖచనోవ్ (రష్యా)పై విజయం సాధించాడు. 3 గంటల 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఏకంగా 17 ఏస్‌లు సంధించాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 51 అవనసర తప్పిదాలు కూడా చేశాడు. ఒకదశలో 1–2 సెట్లతో వెనుకబడిన 21 ఏళ్ల జ్వెరెవ్ చివరి రెండు సెట్లను వరుసగా గెల్చుకొన్ని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ‘నేనింకా యువకుడినే. ఇంకొంత సమయం కోర్టులో గడిపి మీ అందరికీ వినోదం అందిస్తాను’ అని మ్యాచ్ అనంతరం జ్వెరెవ్ సరదాగా వ్యాఖ్యానించాడు. ‘నేను, నా సోదరుడు మిషా జ్వెరెవ్ రోజుకు నాలుగైదు గంటలు జిమ్‌లో గడుపుతాం. ట్రెడ్‌మిల్‌పై సాధన చేస్తాం. ఆ శ్రమ ఈ రోజు ఫలితాన్నిచ్చింది’ అని జ్వెరెవ్ అన్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో జ్వెరెవ్ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో థీమ్ 6–2, 6–0, 5–7, 6–4తో 19వ సీడ్ నిషికోరి (జపాన్)పై గెలిచి వరుసగా ఈ టోర్నీలో మూడోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–2తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై గెలుపొందగా... అన్‌సీడెడ్ మార్కో సెచినాటో (ఇటలీ) 7–5, 4–6, 6–0, 6–3తో ఎనిమిదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)ను బోల్తా కొట్టించి జొకోవిచ్‌తో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. స్లోన్ స్టీఫెన్స్ జోరు... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా యువ తారలు పదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్, 13వ సీడ్ మాడిసన్ కీస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో స్లోన్ స్టీఫెన్స్ 6–2, 6–0తో కొంటావీట్ (ఎస్తోనియా)పై... కీస్ 6–1, 6–4తో బుజర్‌నెస్కూ (రొమేనియా)పై గెలుపొందారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 26వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 3–6తో యూలియా పుతింత్సెవా (కజకిస్తాన్) చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. తొలి రౌండ్లో ప్రణీత్ 21–17, 21–14తో మిష జిల్బెర్మన్ (ఇజ్రాయిల్)పై; సమీర్ 13–21, 21–17, 21–12తో అభినవ్ (న్యూజిలాండ్)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌరభ్ వర్మ 21–19, 17–21, 12–21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో... జయరామ్ 20–22, 22–20, 21–17తో టకెశిటా (జపాన్) చేతిలో... లక్ష్యసేన్ 20–22, 21–13, 19–21తో లీ చెక్ యూ (హాంకాంగ్) చేతిలో... రాహుల్ యాదవ్ 11–21, 17–21తో మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 19–21, 21–15, 21–15తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. సాయి ఉత్తేజిత 8–21, 19–21తో మినె (జపాన్) చేతిలో... శ్రీకృష్ణప్రియ 18–21, 20–22తో యూలియా (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
ప్రిక్వార్టర్స్‌లో గురుసాయిదత్
సాక్షి, హైదరాబాద్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురుసాయిదత్ 21–12, 24–22తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై గెలుపొందగా... కశ్యప్ 21–16, 21–7తో దుర్కిన్‌జాక్ (క్రొయేషియా)ను ఓడించాడు. హైదరాబాద్‌కే చెందిన మరో ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో 23–25, 13–21తో లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి చవిచూశాడు. -
ప్రిక్వార్టర్స్‌లో కశ్యప్ ఓటమి
చాంగ్జూ (చైనా): చైనా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అతను 10–21, 22–20, 13–21తో మూడో సీడ్ కియావో బిన్ (చైనా) చేతిలో కంగుతిన్నాడు. చాలాకాలంగా గాయాలతో సతమతమైన కశ్యప్ ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నీ ఇది. మరో ఆటగాడు హర్షిల్ డాని కూడా 17–21, 18–21తో సన్ ఫెక్సియాంగ్ (చైనా) చేతిలో ఓడిపోవడంతో భారత పోరాటం ఈ టోర్నీలో ముగిసింది. మూడో ర్యాంకుకు సింధు భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు మూడో ర్యాంకుకు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకుల్లో ఆమె రెండు స్థానాల్ని మెరుగుపర్చుకొని మూడో ర్యాంకుకు చేరింది. గతవారం ఐదో ర్యాంకుకు దిగజారిగన సింధు ర్యాంకు... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో క్వార్టర్స్‌కు చేరడం ద్వారా మెరుగైంది.