ఏసీ 24 డిగ్రీల్లో ఉంటే విద్యుత్ ఆదా!
న్యూఢిల్లీ: ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఎయిర్ కండిషనర్ (ఏసీ)లను నిర్ణీత ఉష్ణోగ్రతల స్థాయిలోనే ఉపయోగించేందుకు కేంద్రం ముసాయిదా బిల్లును రూపొందించింది. ‘భవనాలు, వాణిజ్య సముదాయాలు, విమానాశ్రయాల్లో ముందుగా నిర్ణయించిన ఉష్ణోగ్రత వద్దనే ఏసీలు పనిచేసేలా నిబంధనలు తెచ్చే ప్రతిపాదనలు ఉన్నాయా?’అని ఓ సభ్యుడు ప్రశ్న అడిగారు. దీనికి పర్యావరణ మంత్రి అనిల్ మాధవ్ దవే రాజ్యసభలో సమాధానమిచ్చారు.
ఏసీలను వేసవిలో 28 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంచుకోవాలని జపాన్ ప్రభుత్వం 2005లోనే ఆ దేశ ప్రజలను, వ్యాపారస్తులను కోరిందనీ, దీనివల్ల విద్యుత్తు వినియోగం తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో ఏసీలను 20 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకన్నా తక్కువకు వినియోగిస్తున్నారనీ, దీనిని 24 డిగ్రీలకు పెంచితే విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు.