President of France
-
Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: దేశ సైనిక శక్తిని, గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా చాటే 75వ గణతంత్ర వేడుకలకు ఢిల్లీ సిద్ధమైంది. కర్తవ్యపథ్‌లో గంటన్నరపాటు సాగే పరేడ్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సారథ్యం వహించనున్నారు. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ హాజరు కానున్నారు. పరేడ్‌లో క్షిపణులు, డ్రోన్జా మర్లు, నిఘా వ్యవస్థలు, సైనిక వాహనాలపై అమర్చిన మోర్టార్లు, పోరాట వాహనాలను ప్రదర్శించనున్నారు. మొట్టమొదటిసారిగా పూర్తిగా మహిళా అధికారులతో కూడిన త్రివిధ దళాల కంటింజెంట్ కవాతులో పాల్గొననుంది. గత ఏడాది ఆర్టిలరీ రెజిమెంట్‌లో విధుల్లో చేరిన 10 మహిళా అధికారుల్లో లెఫ్టినెంట్లు దీప్తి రాణా, ప్రియాంక సెవ్దా సహా మొట్టమొదటిసారిగా స్వాతి వెపన్ లొకేటింగ్ అండ్ పినాక రాకెట్ సిస్టమ్‌కు సారథ్యం వహించనున్నారు. సంప్రదాయ మిలటరీ బ్యాండ్లకు బదులుగా ఈసారి భారతీయ సంగీత పరికరాలైన శంఖ, నాదస్వరం, నాగడ వంటి వాటితో 100 మంది మహిళా కళాకారుల బృందం పరేడ్‌లో పాల్గొననుంది. భారత వైమానిక దళానికి చెందిన 15 మంది మహిళా పైలట్లు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే పరేడ్ 90 నిమిషాల పాటు కొనసాగనుంది. -
మాక్రాన్ గెలుపుతో ఉక్రెయిన్‌కు ఊరట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్‌కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్‌స్కీసహా ఉక్రెయిన్ నాయకత్వం భయపడింది. లీపెన్ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్ ఆందోళన చెందింది. లీపెన్‌పై మాక్రాన్ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్‌పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి మద్దతు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్‌ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొనియాడారు. పుతిన్ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్‌కు లేదని, తాము గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఇకపై పుతిన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్‌తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు. ఫ్రాన్స్ పీఠం మాక్రాన్దే ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇండో–ఫ్రాన్స్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు కరోనా
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. మాక్రాన్‌కు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయిస్తే పాజిటివ్‌గా తేలిందని అధ్యక్ష భవనం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నిర్ధారణ కాగానే మాక్రాన్ ఏడు రోజుల సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. క్వారంటైన్లో ఉంటూనే ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు.ఇటీవల మాక్రాన్ చాలా మంది ప్రపంచ నేతల్ని కలుసుకున్నారు. ఈయూ సదస్సుకు సైతం హాజరయ్యారు. ఈ మధ్య కాలంలో అధ్యక్షుడిని కలుసుకున్న వారంతా క్వారంటైన్లోకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధ్యక్ష భవనం ప్రతినిధులు సూచించారు. ఇటీవల ఫ్రాన్స్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. ఆరువారాల పాటు లాక్డౌన్ కూడా విధించారు. ఈ నెల 27 నుంచి ఫ్రాన్స్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుంది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని జాన్సన్, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ తర కరోనా బారిన పడి కోలుకున్నారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మేక్రన్!: ఎగ్జిట్ పోల్స్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మేక్రన్ ఎన్నిక లాంఛనమేనని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చిచెప్పాయి. ఆదివారం జరిగిన రెండో రౌండ్ పోలింగ్‌లో మేక్రన్, మరీన్ లీ పెన్లు అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా సాధించిన వారిని అధ్యక్ష పదవి వరించనుంది. మాక్రన్‌కు 65.5 శాతం, లీ పెన్కు 34.5 శాతం ఓట్లు పోలవుతాయని మెజార్టీ సర్వేలు స్పష్టం చేశాయి. మొదటి దశ ఎన్నికల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన మేక్రన్, మరీన్ లీ పెన్లు రెండో రౌండ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు యూరప్ భవిష్యత్తుకు అత్యంత కీలకం కావడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. -
హోలాండ్ తో ఐశ్వర్యరాయ్ లంచ్
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ గౌరవార్ధం భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి రిచియర్ మంగళవారం ఇచ్చిన మధ్యాహ్న విందులో బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎరుపురంగు బెనారస్ పట్టుచీరలో భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఐశ్వర్య కనిపించారు. ఒకే టేబుల్ వద్ద కూర్చుని హోలాండ్, ఐశ్వర్యలు కాసేపు సినిమాల గురించి, కేన్స్ ఫెస్టివల్ గురించి ముచ్చటించారు. ఐశ్వర్యకు ఫ్రాన్స్‌తో అనుబంధం ఉంది. అక్కడ జరిగే కేన్స్ ఫెస్టివల్లో ఆమె క్రమం తప్పకుండా పాల్గొంటారు. అదీకాక, తమ దేశ రెండో అత్యుత్తమ పౌర పురస్కారం ‘నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆర్ట్ అండ్ లెటర్స్’తో ఫ్రాన్స్ ఐశ్వర్యను గౌరవించింది.