president tour
-
4న విశాఖకు రాష్ట్రపతి రాక
సాక్షి, విశాఖపట్నం: భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదిముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా విశాఖపట్నంలో పర్యటించనున్నారు. భారత నౌకాదళ దినోత్సవాల్లో నేవీ డే విన్యాసాల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సందర్భంలో ఏడు కీలక ప్రాజెక్టుల్ని కూడా వర్చువల్‌గా ప్రారంభిస్తారు. రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్‌ను రాష్ట్రపతిభవన్ సెక్రటేరియట్ విడుదల చేసింది. రాష్ట్రపతి డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 2.25 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరి 3.25 గంటలకు నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగాకు చేరుకుంటారు. 3.35 గంటలకు డేగా నుంచి బయలుదేరి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని చోళ సూట్‌కు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 4.05 గంటలకు చోళా సూట్ నుంచి బయలుదేరి ఆర్కేబీచ్కి చేరుకుంటారు. నేవీ డే సందర్భంగా భారత నౌకాదళం నిర్వహించే యుద్ధ విన్యాసాల్ని ఆమె ప్రారంభించి తిలకిస్తారు. విన్యాసాలు ముగిసిన అనంతరం అదే వేదిక నుంచి కేంద్రప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టుల్ని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6.10కి తూర్పు నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకుని నేవీ డే రిసెప్షన్‌కు హాజరవుతారు. అక్కడి నుంచి రాత్రి 7.30 గంటలకు బయలుదేరి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని 8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరతారు. రాత్రి 8.40 గంటలకు రాష్ట్రపతి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖలో రాష్ట్రపతి వర్చువల్‌గా ప్రారంభించే ప్రాజెక్టులు ఇవే.. ► రక్షణ శాఖకు సంబంధించి కర్నూలులో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ (ఎన్‌వోఏఆర్), నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్డ్ నైట్‌విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ ► కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఎన్‌హెచ్–340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన హైవే, ఎన్‌హెచ్–205లో నిర్మించిన నాలుగు లైన్ల ఆర్వోబీ ► ఎన్‌హెచ్–44లో కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్లో ఆరులైన్ల గ్రేడ్ సెపరేటెడ్ స్ట్రక్చర్, స్లిప్‌రోడ్స్, డోన్ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్లు, రహదారులు ► గిరిజన శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో నిర్మించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, సైన్స్ సెంటర్. శంకుస్థాపన చేసే ప్రాజెక్టు.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలో ఎన్‌హెచ్–342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులు -
Ram Nath Kovind: రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత..మహిళ మృతి
కాన్పూర్(యూపీ): రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం చీఫ్ వందన మిశ్రా(50) ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను కాకాదేవ్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారి వాహనం వెళ్తున్న గోవింద్‌పురీ వంతెన మార్గంలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాహన శ్రేణి వెళ్తోంది. ప్రోటోకాల్‌లో భాగంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ను పోలీసులు ఆపడంతో భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. అందులో వందన వాహనం చిక్కుకుంది. కాన్వాయ్ వెళ్లాక వందనను ఆస్పత్రికి తరలిలించగా అప్పటికే ఆమె మరణించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు కారకులంటూ ఒక సబ్–ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అసీమ్ అరుణ్ చెప్పారు. ఘటనపై క్షమాపణలు చెప్పారు. మృతి విషయం తెల్సి రాష్ట్రపతి కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారని చెప్పారు. అంత్యక్రియలకు హాజరై రాష్ట్రపతి తరఫున సానుభూతిని పోలీస్ కమిషనర్ తెలిపారు. -
రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ /తిరుపతి క్రైం: రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి శని, ఆదివారాల్లో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా జిల్లాకు వస్తున్నారు. ఈమేరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి పర్యటన జరిగే ప్రాంతాల్లో బార్కేడింగ్, శానిటేషన్ పనులను జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షించాలన్నారు. పద్మావతి అమ్మవా రి ఆలయం, తిరుచానూరు, కపిలతీర్థం, తిరుమల శ్రీవారి దర్శనం కార్యక్రమాల్లో ప్రతిచోటా లైజన్ ఆఫీసర్‌ను నియమించినట్లు తెలిపారు. కాన్వాయ్‌కు సంబంధించి అన్ని వాహనాలను కేటాయించాలని చెప్పా రు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రపతి పర్యటనకు పటిష్ట భద్రత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నలుగురు ఎస్పీ స్థాయి అధికారులు, ఆరుగురు ఏఎస్పీలు, 22 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, 75 మంది ఎస్ఐలు, 300 మంది ఏఎస్ఐ, హెచ్‌సీలు, 400 మంది పీసీలు, స్పెషల్ పోలీసులు 200 మంది, మూడు కంపెనీల ఏపీఎస్పీ సిబ్బంది, ఇతర జిల్లాల నుంచి 470 మంది, మొత్తం 1,692 మందితో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. -
ఒకేచోట ఇద్దరు చంద్రులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన తెలంగాణ, ఏపీ సీఎంలు బాబుకు కేసీఆర్ షేక్‌హ్యాండ్.. భుజం తట్టిన చంద్రబాబు బాబును సాదరంగా గవర్నర్ వద్దకు తోడ్కొని వెళ్లిన కేసీఆర్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం ప్రణబ్‌కు పాదాభివందనం చేసిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇద్దరు చంద్రులు ఒకేచోట కలిశారు.. పరస్పరం కరచాలనం చేసుకున్నారు.. నవ్వుతూ పలకరించుకున్నారు.. ఒకరు భుజం తట్టి అభినందిస్తే, మరొకరు సాదరంగా తోడ్కొని గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు.. ఆ ఇద్దరు చంద్రుల్లో ఒకరు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు కాగా మరొకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ప్రణబ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరై ప్రణబ్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ హడావుడి స్పష్టంగా కన్పించింది. ఆయన వేదిక వద్ద అటూఇటూ తిరుగుతూ, నేతలందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. అయితే చంద్రబాబు, కేసీఆర్ ఎదురుపడగానే నవ్వుతూ పలకరించుకున్నప్పటికీ.. కొద్ది నిమిషాల తర్వాత ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరిగిన సన్నివేశాలు.. మధ్యాహ్నం 2.30: తెలంగాణ సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వ చ్చారు. ఆ సమయానికి ఇద్దరు మంత్రులు, అధికారులు మినహా ఎవరూ లేరు. కేసీఆర్ వచ్చిన ఐదు నిమిషాల తరువాత మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకుల రాక మొదలైంది. 2.50: గవర్నర్ నరసింహన్ రాక. సాదరంగా ఆహ్వానిం చిన కేసీఆర్ ఆయనను స్వాగత వేదిక వద్దకు తీసుకె ళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో గవర్నర్ నవ్వుతూ చలోక్తులు! 3.00: తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి రాక. 3.07: హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాక.. ఆయనను కేసీఆర్ పలకరిస్తూ మీ కోసమే ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. మాజిద్ ఒంటిపై సంప్రదాయ వస్త్రం కనిపించకపోవడంతో ‘మీ సంప్రదాయ వస్త్రధారణ ఏమైంది?’ అని అడిగారు. ఆ వెంటనే మాజిద్ తన వ్యక్తిగత సిబ్బందిని పిలిచి ఆయన వద్దనున్న సంప్రదాయ వస్త్రాన్ని ధరించారు. 3.10: ఏపీ సీఎం చంద్రబాబు రాక.. స్వాగత వేదిక ముఖద్వారం వద్ద నిలుచున్న కేసీఆర్ నవ్వుతూ బాబును పలకరించారు. ఇరువురూ కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ భుజం తట్టగా... కేసీఆర్ బాబును సాదరంగా తోడ్కొని వెళ్లి గవర్నర్ పక్కన కూర్చోబెట్టారు. 3.13: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వచ్చారు. 3.15: భారత వాయుసేన ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది.. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ, ఏపీ సీఎంలు, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ విమానం వద్దకు వెళ్లారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, టి.రాజయ్యతోపాటు స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా వెళ్లబోగా ప్రోటోకాల్ అధికారులు వారించి, స్వాగత వేదిక వద్ద వేచి ఉండాలని కోరారు. 3.25: ప్రణబ్ విమానంలోంచి బయటకు వచ్చారు. గవర్నర్, చీఫ్ జస్టిస్, తెలంగాణ, ఏపీ సీఎంలు, నగర మేయర్ స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రణబ్ పాదాలకు నమస్కరించారు. 3.30: స్వాగతించిన వారందరినీ పలకరించిన రాష్ట్రపతి ప్రత్యేక వాహనంలో వెళ్లి సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వేచి ఉన్న స్వాగత కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు. కేసీఆర్ వారందరినీ రాష్ట్రపతికి పరిచయం చేశారు. 3.45: వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి బయలుదేరారు. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, కేసీఆర్ కూడా అదే హెలికాప్టర్లో వెళ్లారు. 6.00: రాష్ట్రపతి తిరిగి విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్, కేసీఆర్, సీజే జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా కూడా రాష్ట్రపతితో పాటు వచ్చారు. చంద్రబాబు, నగర మేయర్ అప్పటికే అక్కడ వేచి ఉన్నారు. 6.10: ప్రణబ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. -
రాష్ట్రపతి పర్యటన కారణంగా.. పోలీసుల ఓవర్‌యాక్షన్
రాష్ట్రపతి పర్యటన కారణంగా.. పోలీసుల ఓవర్‌యాక్షన్ కు దిగారు. ముందస్తు చర్యగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గోపాల్ రెడ్డి, మధు, మారుతినాయుడులను అరెస్టు చేశారు. ఈ దృశ్యాలను చీత్రీకరిస్తున్న సాక్షి విలేకరిపై ఎస్సై నారాయణ జూలం చేశారు. అంతేకాకుండా అసభ్య పదజాలంతో ఎస్సై దూషణ చేసినట్టు తెలిసింది. అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సర్కారుకు సమైక్యాంధ్ర భయం పట్టుకుంది. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలంటూ ఆందోళనలు ఉధృతంగా సాగుతుండంటంతో ప్రతి చిన్న విషయానికీ భయపడుతోంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా అనంతపురంలో జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్తున్న సందర్భంగా, ముందుగా సమైక్యవాదులను అరెస్టు చేస్తున్నారు. సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు కొగటం విజయభాస్కర రెడ్డితో పాటు దాదాపు 50 మంది సమైక్యవాదులను ముందుగా అరెస్టు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా అనంతపురంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమ వేదికను అణువణువునా గాలించారు. ఈ కార్యక్రమంలో అధికారలు అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. పిల్లలకు మాత్రమే నీలం సంజీ వరెడ్డి స్టేడియంలోకి అనుమతిని ఇస్తున్నట్టు తెలుస్తోంది. -
రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి తిరుమల పర్యటన ఏర్పాట్లపై శనివారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్ సమీక్షించారు. ఈనెల 29వ తేదీ తిరుమల రానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఆ రోజు సాయంత్రం 6గంటల తర్వాత రాష్ట్రపతి తిరుమలకు రానున్నారు. నేరుగా పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు. పట్టువస్త్రాలు ధరించి ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. తిరిగి రేణిగుంట విమానాశ్రయం నుంచి న్యూ ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు. రాష్ట్రపతి బస కోసం తిరుమలలోని పద్మావతి అతిథిగృహాన్ని సిద్ధం చేయూలని జేఈవోలు ఆదేశించారు. సమీక్ష సమావేశంలో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, టీటీడీ అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, డెప్యూటీఈవోలు చిన్నంగారి రమణ, భూపతిరెడ్డి, వెంకటయ్య, ఓఎస్డీ దామోదరం, ఇతర అధికారులు పాల్గొన్నారు.