ఒకేచోట ఇద్దరు చంద్రులు
రాష్ట్రపతికి స్వాగతం పలికిన తెలంగాణ, ఏపీ సీఎంలు
బాబుకు కేసీఆర్ షేక్‌హ్యాండ్.. భుజం తట్టిన చంద్రబాబు
బాబును సాదరంగా గవర్నర్ వద్దకు తోడ్కొని వెళ్లిన కేసీఆర్
రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
ప్రణబ్‌కు పాదాభివందనం చేసిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు చంద్రులు ఒకేచోట కలిశారు.. పరస్పరం కరచాలనం చేసుకున్నారు.. నవ్వుతూ పలకరించుకున్నారు.. ఒకరు భుజం తట్టి అభినందిస్తే, మరొకరు సాదరంగా తోడ్కొని గవర్నర్ వద్దకు తీసుకెళ్లారు.. ఆ ఇద్దరు చంద్రుల్లో ఒకరు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు కాగా మరొకరు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది.
రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వచ్చిన ప్రణబ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘన స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరై ప్రణబ్‌కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ హడావుడి స్పష్టంగా కన్పించింది. ఆయన వేదిక వద్ద అటూఇటూ తిరుగుతూ, నేతలందరినీ పలకరిస్తూ ఉత్సాహంగా కనిపించారు. అయితే చంద్రబాబు, కేసీఆర్ ఎదురుపడగానే నవ్వుతూ పలకరించుకున్నప్పటికీ.. కొద్ది నిమిషాల తర్వాత ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జరిగిన సన్నివేశాలు..
మధ్యాహ్నం 2.30: తెలంగాణ సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వ చ్చారు. ఆ సమయానికి ఇద్దరు మంత్రులు, అధికారులు మినహా ఎవరూ లేరు. కేసీఆర్ వచ్చిన ఐదు నిమిషాల తరువాత మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకుల రాక మొదలైంది.
2.50: గవర్నర్ నరసింహన్ రాక. సాదరంగా ఆహ్వానిం చిన కేసీఆర్ ఆయనను స్వాగత వేదిక వద్దకు తీసుకె ళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో గవర్నర్ నవ్వుతూ చలోక్తులు!
3.00: తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి రాక.
3.07: హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ రాక.. ఆయనను కేసీఆర్ పలకరిస్తూ మీ కోసమే ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు. మాజిద్ ఒంటిపై సంప్రదాయ వస్త్రం కనిపించకపోవడంతో ‘మీ సంప్రదాయ వస్త్రధారణ ఏమైంది?’ అని అడిగారు. ఆ వెంటనే మాజిద్ తన వ్యక్తిగత సిబ్బందిని పిలిచి ఆయన వద్దనున్న సంప్రదాయ వస్త్రాన్ని ధరించారు.
3.10: ఏపీ సీఎం చంద్రబాబు రాక.. స్వాగత వేదిక ముఖద్వారం వద్ద నిలుచున్న కేసీఆర్ నవ్వుతూ బాబును పలకరించారు. ఇరువురూ కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబు కేసీఆర్ భుజం తట్టగా... కేసీఆర్ బాబును సాదరంగా తోడ్కొని వెళ్లి గవర్నర్ పక్కన కూర్చోబెట్టారు.
3.13: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా వచ్చారు.
3.15: భారత వాయుసేన ప్రత్యేక విమానం ల్యాండ్ అయింది.. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ, ఏపీ సీఎంలు, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్ విమానం వద్దకు వెళ్లారు. తెలంగాణ డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, టి.రాజయ్యతోపాటు స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ కూడా వెళ్లబోగా ప్రోటోకాల్ అధికారులు వారించి, స్వాగత వేదిక వద్ద వేచి ఉండాలని కోరారు.
3.25: ప్రణబ్ విమానంలోంచి బయటకు వచ్చారు. గవర్నర్, చీఫ్ జస్టిస్, తెలంగాణ, ఏపీ సీఎంలు, నగర మేయర్ స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రణబ్ పాదాలకు నమస్కరించారు.
3.30: స్వాగతించిన వారందరినీ పలకరించిన రాష్ట్రపతి ప్రత్యేక వాహనంలో వెళ్లి సైనిక వందనం స్వీకరించారు. అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వేచి ఉన్న స్వాగత కార్యక్రమ వేదిక వద్దకు వచ్చారు. కేసీఆర్ వారందరినీ రాష్ట్రపతికి పరిచయం చేశారు.
3.45: వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్రపతి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి బయలుదేరారు. గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి, కేసీఆర్ కూడా అదే హెలికాప్టర్లో వెళ్లారు.
6.00: రాష్ట్రపతి తిరిగి విమానాశ్రయానికి వచ్చారు. గవర్నర్, కేసీఆర్, సీజే జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా కూడా రాష్ట్రపతితో పాటు వచ్చారు. చంద్రబాబు, నగర మేయర్ అప్పటికే అక్కడ వేచి ఉన్నారు.
6.10: ప్రణబ్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.