సాక్షి, తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి తిరుమల పర్యటన ఏర్పాట్లపై శనివారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈవో పోలా భాస్కర్ సమీక్షించారు. ఈనెల 29వ తేదీ తిరుమల రానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఆ రోజు సాయంత్రం 6గంటల తర్వాత రాష్ట్రపతి తిరుమలకు రానున్నారు. నేరుగా పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు. పట్టువస్త్రాలు ధరించి ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. తిరిగి రేణిగుంట విమానాశ్రయం నుంచి న్యూ ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు. రాష్ట్రపతి బస కోసం తిరుమలలోని పద్మావతి అతిథిగృహాన్ని సిద్ధం చేయూలని జేఈవోలు ఆదేశించారు. సమీక్ష సమావేశంలో తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, టీటీడీ అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, డెప్యూటీఈవోలు చిన్నంగారి రమణ, భూపతిరెడ్డి, వెంకటయ్య, ఓఎస్‌డీ దామోదరం, ఇతర అధికారులు పాల్గొన్నారు.