మీ మద్దతు మాకే!
♦ చెన్నైలో రాష్ట్రపతి అభ్యర్థుల బిజీ
♦ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పలకరింపు
♦ అమ్మ శిబిరానికి తనియరసు షాక్
♦ కేంద్రం ముందు డిమాండ్లు
సాక్షి, చెన్నై : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండంతో ఆ పదవికి ఎన్నికలు ఈనెల 17వ తేదీ జరగనున్నాయి. బీజేపీ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, ప్రతిపక్షాల అభ్యర్థిగా మీరాకుమార్ రేసులో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఓట్లు రామ్‌నాథ్ కోవింద్ ఖాతాలో పడనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ముక్కులుగా ఉన్న సీఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే(అమ్మ), మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని (పురట్చి తలైవి) శిబిరాలు తమ మద్దతు ప్రకటించాయి. స్వయంగా ఆ ఇద్దరు నేతలు ఢిల్లీ వెళ్లి మరీ రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి తమ మద్దతును తెలియజేశారు. ఈపరిస్థితుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను స్వయంగా కలిసి మద్దతు సేకరించేందుకు కోవింద్ నిర్ణయించారు. దీంతో ఉదయాన్నే ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు.
రంగన్న మద్దతు : చెన్నైకి చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్‌కు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పొన్ రాధాకృష్ణన్, జేపీ నడ్డా, తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, మురళీధర్ రావు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానం పలికారు. గిండిలోని ఓ హోటల్‌కు చేరుకున్న ఆయన్ను పుదుచ్చేరి ప్రధాన ప్రతిపక్ష నేత, ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి కలిశారు. తమ మద్దతును ప్రకటించారు. కేరళకు చెందిన బీజేపీ వర్గాలు సైతం రామ్‌నాథ్‌తో భేటీ అయ్యాయి. తదుపరి అక్కడి నుంచి నేరుగా ఆళ్వార్ పేటలోని రష్యన్ కల్చరల్ సెంటర్‌కు చేరుకున్న రామ్‌నాథ్‌కు అన్నాడీఎంకే పురట్చి తలైవీ శిబిరం వర్గాలు ఘన స్వాగతం పలికారు.
ముక్త కంఠంతో మద్దతు : మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ముక్తకంఠంతో ఆ శిబిరం ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ మద్దతు ప్రకటించడం గమనార్హం. వేదిక మీద నుంచి అందర్నీ రామ్‌నాథ్ పలకరిస్తూ మద్దతు సేకరించారు. ఈసందర్భంగా మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడుతూ, గెలుపు రేసులో ఉన్న అభ్యర్థికి తామంతూ ముక్తకంఠంతో మద్దతు ప్రకటించామన్నారు. ఇదివరకే తాము హామీ ఇచ్చామని, ఆయనకు ప్రస్తుతం స్వయంగా తెలియజేశామన్నారు. తాము ఎలాంటి నిబంధనల్ని విధించలేదని ఓ ప్రశ్నకు స్పష్టం చేశారు.
అమ్మ శిబిరంతో..: కాసేపు విశ్రాంతి అనంతరం మళ్లీ హోటల్‌కు రామ్‌నాథ్ పయనం అయ్యారు. ఈ సమయంలో ఆయన డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి మద్దతు కోరబోతున్నట్టుగా సమాచా రం వెలువడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయి తే, అలాంటి ప్రయత్నాలు సాగలేదు. సాయంత్రం ట్రిప్లికేన్‌లో కలైవానర్ అరంగంలో సీఎం పళని స్వామి నేతృత్వంలో జరిగిన మద్దతు కార్యక్రమానికి ఆయన హాజ రు అయ్యారు. అమ్మ శిబిరం ఎమ్మెల్యేలు, ఎంపిలను వేదిక మీద నుంచి పలుకరిస్తూ మద్దతు సేకరించారు.
తనియరసు షాక్ : అసెంబ్లీ ఎన్నికల్లో రెండాకుల చిహ్నంతో అన్నాడీఎంకే మిత్రపక్షానికి చెందిన తనియరసు, తమీమున్ అన్సారీ, కరుణాస్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు అన్నాడీఎంకే మద్దతు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వీరిలో తనియరసు తాజా కార్యక్రమానికి దూరం అయ్యారు. అంతే కాకుండా, కేంద్రం రూపంలో తమిళులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీట్, జీఎస్టీ తదితర అంశాలను వివరించారు. ఈ సమయంలో బీజేపీకి మద్దతు ప్రకటిస్తే, ఓట్లు వేసిన జనం నుంచి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని తనియరసు వ్యాఖ్యానించారు. తమిళుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, అన్ని డిమాండ్ల కు కేంద్రం తలొగ్గినప్పుడే మద్దతు అని ప్రకటిస్తూ, తన నిర్ణయాన్ని తటస్థంగా ఉంచారు. ఇక, తమీమున్ అన్సారి తన మద్దతును మీరాకుమార్‌కు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు మనిద నేయ జననాయగ కట్చి వర్గాలుపేర్కొంటున్నాయి. అయితే, కరుణాస్ మాత్రం తన మద్ద తు అమ్మ శిబిరం నిర్ణయం మేరకు అని పేర్కొన్నారు.
మీరాకుమార్ మద్దతు వేట : లీలా ప్యాలెస్‌లో జరిగిన కార్యక్రమంలో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్య సభ సభ్యుల్ని మీరాకుమార్ కలిసి మద్దతు సేకరించారు. ఢిల్లీ నుంచి సాయంత్రం చెన్నై చేరుకున్న ఆమెకు కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్‌లతో పాటుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు మీద తనకున్న అభిమానాన్ని ఈసందర్భంగా మీరాకుమార్ చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి లీలా ప్యాలెస్‌కు చేరుకుని డీఎంకే, కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యేలను స్వయంగా పలకరిస్తూ మద్దతు సేకరించారు. ఇక, సిపీఎం(రంగరాజన్), సీపీఐ (డి రాజ), డీఎంకే (తిరుచ్చి శివ, కనిమొళి) రాజ్యసభ సభ్యులను పలకరిస్తూ మద్దతు సేకరించారు. అందరూ తనకు మద్దతుగా నిలబడాలని కోరారు.