బాబు హయాంలో సాగు సమస్యే
పదేళ్లలో ఏడాదికి వెయ్యి కోట్లు చొప్పున రూ. 10 వేల కోట్లే వ్యయం
అదే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ. 95 వేల కోట్ల వ్యయం
23.49 లక్షల ఎకరాలకు సాగునీరు
సీమాంధ్ర వరకు బాబు సాగునీటి వ్యయం రూ. 6,000 కోట్లు
వైఎస్ హయాంలో రూ. 41 వేల కోట్లు
శ్వేతపత్రంలో వాస్తవాలున్నా .. విలేకరుల సమావేశంలో విడుదల చేయని బాబు
హైదరాబాద్: గత ప్రభుత్వంపై నిందలు వేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రంగాలకు సంబంధించి వరుసగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో చ రిత్రను చెరిపేసే, వాస్తవాలను మరుగుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరోగమనానికి కారణాలుగా చూపించే ప్రయత్నంలో భాగంగా.. తాజాగా నీటి పారుదల రంగంపై విడుదల చేసిన శ్వేతపత్రంతో బాబు డొల్లతనం బయటపెట్టుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1994-2004మధ్య బాబు హయాంలో సాగునీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం, అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి (2004-2010) సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత, ఆ రంగంపై వెచ్చించిన వ్యయం, సాధించిన ఫలితాలతో కూడిన వాస్తవ వివరాలతో అధికారులు శ్వేతపత్రం రూపొందించారు. వాస్తవాల ఆధారంగా రూపొందించిన ఈ శ్వేతపత్రం చంద్రబాబుకు ఏ మాత్రం రుచించలేదు. వైఎస్ఆర్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన వ్యయం, సాగులోకి వచ్చిన విస్తీర్ణం అత్యధికంగా కనపడుతూ.. తన హయాంలో ఆ రంగానికి ప్రాధాన్యమివ్వనట్టుగా, చాలా అరకొరగా వ్యయం చేసినట్టు కనిపిస్తుండంతో.. సదరు శ్వేతప్రతాన్ని విలేకరుల సమావేశంలో విడుదల చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కేవలం ‘టాకింగ్ పాయింట్స్’ పేరిట ఒక పత్రాన్ని ఇచ్చి ఇదే శ్వేతపత్రం అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు.
అరుుతే సాగునీటి రంగంపై వాస్తవ గణాంకాలతో రూపొందించిన శ్వేతపత్రాన్ని అధికారులు ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచారు. ఆ శ్వేతపత్రాన్ని పరిశీలిస్తే చంద్రబాబు రైతుల పొలాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇట్టే అర్థమెపోతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2003-04లో సాగునీటి రంగానికి బడ్జెట్లో కేవలం రూ. 2,178 కోట్లు కేటాయించగా, తదుపరి ఆర్థిక సంవత్సరం అంటే 2004-05లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక సాగునీటి రంగం బడ్జెట్ ఏకంగా రూ.4,254 కోట్లకు పెరిగిపోయినట్టు శ్వేతపత్రం సుస్పష్టం చేస్తోంది. చంద్రబాబు తన హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కనీసం పరిపాలన అనుమతి మంజూరు సాధించడానికి కూడా ప్రయత్నించలేదు. వైఎస్ అధికారంలోకి రాగానే దశాబ్దాల నుంచి పునాదిరాళ్లకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టారు. ఇప్పుడు ఆ పోలవరం ప్రాజెక్టు పనులను మాత్రం వేగంగా పూర్తి చేస్తామని చంద్రబాబు శ్వేతపత్రంలో పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రైతుల పొలాలకు గోదావరి జలాలను అందించాలంటే ఎత్తిపోతలు తప్ప మరో మార్గం లేదు. ఇందుకు విద్యుత్ చాలా ఎక్కువగా అవసరం అవుతుందని తెలిసి కూడా వైఎస్ ఆ పథకాలను చేపట్టారు. అయితే ఈ పథకాలను తప్పుపట్టేందుకు చంద్రబాబు శ్వేతపత్రంలో ప్రయత్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలంటే ఎకరానికి రూ.20,469 అవుతుందని, అలాగే హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా సాగునీరు అందించాలంటే ఎకరానికి రూ.16,750 అవుతుందని లెక్కకట్టి రైతులకు అందించే సాగునీటికి ఎక్కువ వ్యయం అవుతోదంటూ తప్పుపట్టే ప్రయత్నం చేశారు. వైఎస్ భారీ సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. వాటి నిర్మాణం పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది. అవన్నీ పూర్తయితే కానీ నిర్ధారించిన లక్ష్యాల మేరకు 97.69 లక్షల ఎకరాలు సాగులోకి రావు. వైఎస్ ఆకస్మిక మృతి అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసింది.
23.49 లక్షల ఎకరాల ఆయకట్టు నిజం కాదన్న బాబు
వైఎస్ హయాంలో భారీగా నిధులు ఖర్చు చేసి 23.49 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించారని శ్వేతపత్రంలో పేర్కొన్న చంద్రబాబు.. విలేకరుల సమావేశంలో మాత్రం విమర్శలు చేశారు. 23.49 లక్షల ఎకరాలకు సాగునీరనే అంశం కేవలం కాగితాలకే పరిమితమని, వాస్తవానికి అంత ఆయకట్టుకు నీరందడం లేదని అన్నారు. మరి రికార్డుల్లో చూపించిన ఆయకట్టు ఎక్కడ ఉంది? చూపించిన ఆయకట్టులో సాగునీరు అందని భూములు ఎక్కడ ఉన్నాయి? అనే విషయాన్ని శ్వేతపత్రంలో పేర్కొనకపోవడం గమనార్హం.