Prices of petroleum products
-
పాక్‌లో అమాంతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఇస్లామాబాద్: అధిక ధరలతో అల్లాడిపోతున్న పాక్ ప్రజలపై అక్కడి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. పాక్ కేంద్ర ప్రభుత్వం దేశంలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పాక్ ఆర్థిక మంత్రిత్వశాఖ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ఈ ధరలు జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది.పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పాక్ ప్రభుత్వం రాబోయే 15 రోజుల పాటు ఇవే ధరలు కొనసాగుతాయని ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 7.45 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.258.16 నుంచి రూ. 265.61కి చేరింది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 9.60 పెరిగింది. దీంతో దేశంలో లీటరు డిజిల్ ధర రూ.267.89 నుంచి 277.49కి చేరింది. ఈ నెల 12న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ విడుదల చేసిన అనంతరం తొలిసారిగా చమురు ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది. -
బైక్‌పై శివ-పార్వతుల వేష ధారణలో నిరసన.. అరెస్ట్!
డిస్పూర్: దేశంలో పెట్రోల్, డీజిల్‌లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. అలా.. పెట్రోల్ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై చిన్న నాటకం ప్రదర్శించి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన బిరించి బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. బోరా.. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బిరించి బోరాను అరెస్ట్ చేసి నగావ్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శివపార్వతుల నాటకంలో ఏముంది? ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా.. వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా.. కోయాక్టర్ పరిశిమిత పార్వతిగా బైక్‌పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు. ఇదీ చదవండి: జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు -
రూ. 30కే లీటర్ పెట్రోల్!
పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ కోలారులో వినూత్నంగా నిరసన తెలిపిన వైనం కోలారు : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించకపోవడంపై యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 30కే లీటర్ పెట్రోల్ చొప్పున మంగళవారం విక్రయాలు సాగించి కోలారులో నిరసన వ్యక్తం చేసింది. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆందోళన కారులు మాట్లాడుతూ... పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించక పోతే రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షాహిద్ షహజాద్, అజంపాషా, ప్రతాప్, మంజునాథ్, వెంకటస్వామి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, రూ. 30కే లీటర్ పెట్రోల్ ఇస్తున్నట్లు తెలుసుకున్న వాహనదారులు ఆందోళన శిబిరం వద్ద బారులు తీరారు. అయితే నిరసన తెలిపేందుకు 30 లీటర్ల పెట్రోల్‌ను మాత్రమే తీసుకురావడంతో వాహనదారుల్లో నిరాశ వ్యక్తమైంది.