ఇస్లామాబాద్: అధిక ధరలతో అల్లాడిపోతున్న పాక్ ప్రజలపై అక్కడి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. పాక్ కేంద్ర ప్రభుత్వం దేశంలో మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పాక్ ఆర్థిక మంత్రిత్వశాఖ పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తక్షణమే పెంచుతున్నట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పెంచిన ఈ ధరలు జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది.
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన పాక్ ప్రభుత్వం రాబోయే 15 రోజుల పాటు ఇవే ధరలు కొనసాగుతాయని ప్రకటించింది. అంతర్జాతీయంగా చమురు ధరల్లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాక్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 7.45 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.258.16 నుంచి రూ. 265.61కి చేరింది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 9.60 పెరిగింది. దీంతో దేశంలో లీటరు డిజిల్ ధర రూ.267.89 నుంచి 277.49కి చేరింది. ఈ నెల 12న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ విడుదల చేసిన అనంతరం తొలిసారిగా చమురు ధరలలో పెరుగుదల చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment