Primary agricultural
-
కాంట కొడుతాన్రు
తిమ్మాపూర్ మండలం పోరండ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. కష్టపడి పండించి తెచ్చిన ధాన్యాన్ని ఇక్కడ తూకం వేస్తున్న తీరు చూస్తే అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. పొలంలో ఒక్క గింజ కూడా పోకుండా తెచ్చుకుని ఇక్కడికి వస్తున్న రైతులను రాళ్ల బాట్లు, ముల్లు తరాజుతో నిండా ముంచుతున్నారు. కొనుగోళ్లను పర్యవేక్షించే అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రధాన మార్కెట్లలో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయగా, మిగిలిన అన్ని చోట్ల ముళ్ల కాంటాలతోనే తూకం వేస్తున్నారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ప్రకృతి విపత్తులకు, పెట్టుబడి కష్టాలకు ఎదురీది పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలకు అడుగడుగునా మోసాలే ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తూ వ్యాపారులు రైతులను దోచుకునేవిధంగా సర్కారే సహకరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారుల కంటే దారుణంగా తూకాల్లో మోసాలు జరిగేందుకు తావిస్తోంది. రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం తరపున... ఇందిరా క్రాంతిపథం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గిరిజన సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో తూకం మోసాలకు యథేచ్చగా సాగుతున్నాయి. ముళ్ల కాంటాళ్లు, రాళ్లనే బాట్లుగా పెట్టి అన్నదాతల శ్రమఫలాన్ని తూకం వేస్తున్నారు. పెద్ద మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో మినహా అన్ని చోట్ల ముల్లు తరాజులతోనే తూకాలు వేస్తున్నారు. రాళ్లబాట్లు, ముల్లు తరాజులతో కొనుగోలు కేంద్రాల్లో జరిగే మోసాలపై ప్రశ్నించిన రైతులను... కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం తేమగా ఉందని చెప్పి ఎక్కువ రోజులు రైతులు అక్కడే ఉండేలా చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా జరిపే సంఘాలకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు... ఎలక్ట్రానిక్ కాంటాలు సమకూర్చే విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ‘దండి’గా దోపిడీ.. తూకాల్లో మోసాల కారణంగా జిల్లాలోని అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు. రాళ్ల బాట్లతో క్వింటాల్‌కు సగటున కిలో చొప్పున తూకంలో రైతులు నష్టపోయినా... మొత్తంగా చూస్తే ఇది భారీగా ఉంటోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో మొత్తం 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీలు కలిపి 6లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయిం చింది. ఈ లెక్కన ఆరు లక్షల టన్నుల్లో క్వింటాల్‌కు కిలో చొప్పున తూకంలో రైతులకు నష్టం జరిగినా... ఖరీఫ్ మొత్తంలో ఇది 60 వేల క్విం టాళ్లు ఉంటోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1345 ప్రకారం లెక్క వేసినా తూకాల్లో రైతులు నష్టపోయే మొత్తం రూ.8.07 కోట్లుగా ఉంటోంది. ప్రస్తుత సీజన్లో జిల్లాలో 4.70 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయ్యింది. రికార్డు స్థాయిలో 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. భారీగా వస్తున్న ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వ పరంగా ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 594 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనివారం వరకు 99 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు. గత నెలలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించిన కేంద్రంలో మాత్రమే ఎలక్ట్రానిక్ తూకం యంత్రం ఉంది. మిగిలిన కేంద్రాల్లో రెండుమూడు చోట్ల తప్ప అన్ని ముల్లు కాంటాలే ఉన్నాయి. ఎక్కువ చోట్ల రాళ్లనే బాట్లుగా పెడుతున్నారు. పాసంగం తక్కువగా ఉందని చిన్న రాళ్లను, ఖాళీ బస్తాలను వేసి తూకాలు వేస్తున్నారు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా... ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఉన్నతాధికారులు దీన్ని పట్టించుకోవడంలేదు. పర్యవేక్షణ లోపం, తూకాల్లో మోసాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. -
నాబార్డు ‘సహకారం’ లేదు
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిర్వీర్యం కానున్నాయి. ఇప్పటివరకు రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్న సంఘాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక పై సంఘాలు కేవలం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు బిజినెస్ కరస్పాండెంట్‌గా మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు నాబార్డు గత నెల చివరలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం సమైక్య ఉద్యమం కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘాలను నిర్వీర్యం చేసే నాబార్డు ఉత్తర్వులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వైద్యనాథన్ కమిటీ సూచన మేరకు నాబార్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నగదు బదిలీ పథకం అమలైతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం అమలవుతున్న మూడు అంచెల విధానం (ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాలు) నుంచి సహకార సంఘాలను తొలగించి రెండంచెల విధానం ప్రవేశ పెట్టవచ్చని తెలుస్తోంది. నాబార్డు ఉత్తర్వులు ఏమి చెబుతున్నాయంటే... సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. సంఘాల ఆస్తులు, డిపాజిట్లు, షేర్ క్యాపిటల్, అప్పులు డీసీసీబీకి బదిలీ అవుతాయి. సంఘాలకు డీసీసీబీ ఎలాంటి బడ్జెట్ ఇవ్వదు. రైతులకు దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు ఇచ్చే అధికారం సంఘాలకు ఉండదు. డిపాజిట్లు కూడా సేకరించరాదు. నేరుగా రుణాలు మంజూరు చేయనున్న డీసీసీబీ. రైతులకు రూపే కార్డు ద్వారా సేవలు. ఇవి చేసుకోవచ్చు... సహకార సంఘాలు వివిధ వ్యాపారాలు చేసుకుని రుణాలు ఇచ్చుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎరువులు, పురుగుమందుల వ్యాపారాలతో పాటు పర్సనల్ రుణాలు, గోల్డ్ లోన్లు ఇచ్చుకోవచ్చు. సహకార సంఘాల ద్వారా జిల్లాలో 90 వేల మంది రైతులకు ఏటా రూ.400 కోట్లు రుణాలు అందుతున్నాయి. అయితే సహకార సంఘాలు డీసీసీబీ రైతులకు ఇచ్చిన రుణాలు వసూలు చేస్తే సంఘానికి కమీషన్ రూపంలో ఆదాయం వస్తుంది. -
రైతులందరికీ సభ్యత్వం కల్పించాలి
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘాల పరిధిలోని రైతులందరికీ ఆయా సంఘాలలో సభ్యత్వం కల్పించి, ఖాతాలు తెరవాలని డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పీఏసీఎస్ చైర్మన్లకు సూచించారు. సోమవారం హన్మకొండలోని డీసీసీబీ భవన్లో జరిగిన డీసీసీబీ మహాజన సభకు అధ్యక్షత వహించిన రాఘవరెడ్డి మాట్లాడారు. భవిష్యత్‌లో ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలన్నీ నేరుగా రైతులకే అందనున్నాయని, ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారని పేర్కొన్నారు. సహకా ర సంఘాల రికవరీ పెరిగితేనే ఆప్కాబ్ నుంచి ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే అవకశాముందని చెప్పారు. వరంగల్ డీసీసీబీ రాష్ర్టం లో అతి తక్కువ రికవరీ కలిగిన వాటిలో ఒకటిగా ఉందని, ఆప్కాబ్‌లో ఏమి మాట్లాడలేని పరిస్థితి రానీయవద్దని కోరారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు రుణాలు అందించనున్నామని, అవసరమున్న వారు పాస్‌బుక్‌లు అందించి పొందవచ్చని సూచించారు. జిల్లాలో ఎరువులకు కొదవ లేదు.. యూరియా అవస రం మేరకు అందుబాటులో ఉంది.. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేని చెప్పారు. ఎరువుల కోసం బ్యాంకు గ్యారంటీ అవసరమున్న మేరకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, తిరిగి సకాలంలో చెల్లించాలని సూచించారు. డీసీసీబీలో పనిచేస్తున్న ఉద్యోగులగు గృహ రు ణాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు కొత్త ఆలోచనలతో ముందుకు రావాల ని, సంఘాల సీఈఓల పనితీరును ఎప్పటికప్పుడు కనిపెడుతూ సమీక్ష చేస్తూ ముందుకు పోవాలన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ అందిస్తామని, ప్రతినెలా స్టాక్ నివేదికలు ఇవ్వాలని కోరారు. జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాలు రుణాలు, ఎరువుల సరఫరాకే పరిమితం కాకుండా ఇతరత్రా వ్యాపారాలు నిర్వహించి ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని చెప్పారు. గత ఏడాది 40 సంఘాలు ధాన్యం కొనుగోళ్లు చేసి రూ.180కోట్ల వ్యాపారం చేసిరూ.25లక్షల లాభం ఆర్జించినట్లు వివరించారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన కింద నిధులు మంజూరయ్యాయని, దీని కింద చేపటాల్సిన పనులు వెంకటనే ప్రారంభించాలన్నారు. సం ఘాలలో సభ్యులకు మరణానంతరం పరిహారం చెల్లించాలని నల్లబెల్లి సహకార సంఘం చైర్మన్ కోరాగా దీనిపై ఆలోచించాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ సురేందర్, డీజీఎంలు పాక శ్రీనివాస్, కత్తి నర్సయ్య, డైరక్టర్లు, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.