కాంట కొడుతాన్రు | primary agricultural co-operative society timmapur zone was set up purchase of grain | Sakshi
Sakshi News home page

కాంట కొడుతాన్రు

Published Sun, Nov 10 2013 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

primary agricultural co-operative society timmapur zone was set up purchase of grain

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. కష్టపడి పండించి తెచ్చిన ధాన్యాన్ని ఇక్కడ తూకం వేస్తున్న తీరు చూస్తే అన్నదాతల గుండె తరుక్కుపోతోంది. పొలంలో ఒక్క గింజ కూడా పోకుండా తెచ్చుకుని ఇక్కడికి వస్తున్న రైతులను రాళ్ల బాట్లు, ముల్లు తరాజుతో నిండా ముంచుతున్నారు. కొనుగోళ్లను పర్యవేక్షించే అధికారులు చోద్యం చూస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రధాన మార్కెట్లలో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేయగా, మిగిలిన అన్ని చోట్ల ముళ్ల కాంటాలతోనే తూకం వేస్తున్నారు.
 
 సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ప్రకృతి విపత్తులకు, పెట్టుబడి కష్టాలకు ఎదురీది పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలకు అడుగడుగునా మోసాలే ఎదురవుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తూ వ్యాపారులు రైతులను దోచుకునేవిధంగా సర్కారే సహకరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇది చాలదన్నట్లు ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో వ్యాపారుల కంటే దారుణంగా తూకాల్లో మోసాలు జరిగేందుకు తావిస్తోంది.
 
 రైతుల నుంచి ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం తరపున... ఇందిరా క్రాంతిపథం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, గిరిజన సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో తూకం మోసాలకు యథేచ్చగా సాగుతున్నాయి. ముళ్ల కాంటాళ్లు, రాళ్లనే బాట్లుగా పెట్టి అన్నదాతల శ్రమఫలాన్ని తూకం వేస్తున్నారు. పెద్ద మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో మినహా అన్ని చోట్ల ముల్లు తరాజులతోనే తూకాలు వేస్తున్నారు. రాళ్లబాట్లు, ముల్లు తరాజులతో కొనుగోలు కేంద్రాల్లో జరిగే మోసాలపై ప్రశ్నించిన రైతులను... కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధాన్యం తేమగా ఉందని చెప్పి ఎక్కువ రోజులు రైతులు అక్కడే ఉండేలా చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా జరిపే సంఘాలకు ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ఆర్భాటంగా చెప్పుకుంటున్న ప్రభుత్వ పెద్దలు... ఎలక్ట్రానిక్ కాంటాలు సమకూర్చే విషయాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
 
 ‘దండి’గా దోపిడీ..
 తూకాల్లో మోసాల కారణంగా జిల్లాలోని అన్నదాతలు భారీగా నష్టపోతున్నారు. రాళ్ల బాట్లతో క్వింటాల్‌కు సగటున కిలో చొప్పున తూకంలో రైతులు నష్టపోయినా... మొత్తంగా చూస్తే ఇది భారీగా ఉంటోంది. ప్రస్తుత ఖరీఫ్‌లో మొత్తం 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీలు కలిపి 6లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయిం చింది.
 
 ఈ లెక్కన ఆరు లక్షల టన్నుల్లో క్వింటాల్‌కు కిలో చొప్పున తూకంలో రైతులకు నష్టం జరిగినా... ఖరీఫ్ మొత్తంలో ఇది 60 వేల క్విం టాళ్లు ఉంటోంది. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1345 ప్రకారం లెక్క వేసినా తూకాల్లో రైతులు నష్టపోయే మొత్తం రూ.8.07 కోట్లుగా ఉంటోంది. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 4.70 లక్షల ఎకరాల్లో వరిపంట సాగయ్యింది. రికార్డు స్థాయిలో 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి. భారీగా వస్తున్న ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వ పరంగా ఐకేపీ, పీఏసీఎస్, జీసీసీల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 594 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శనివారం వరకు 99 కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారు.
 
 గత నెలలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించిన కేంద్రంలో మాత్రమే ఎలక్ట్రానిక్ తూకం యంత్రం ఉంది. మిగిలిన కేంద్రాల్లో రెండుమూడు చోట్ల తప్ప అన్ని ముల్లు కాంటాలే ఉన్నాయి. ఎక్కువ చోట్ల రాళ్లనే బాట్లుగా పెడుతున్నారు. పాసంగం తక్కువగా ఉందని చిన్న రాళ్లను, ఖాళీ బస్తాలను వేసి తూకాలు వేస్తున్నారు. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా... ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్న రెవెన్యూ యంత్రాంగం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఉన్నతాధికారులు దీన్ని పట్టించుకోవడంలేదు. పర్యవేక్షణ లోపం, తూకాల్లో మోసాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement