Primary Agricultural Cooperative Credit Union
-
నేడు జిల్లాకు మంత్రి ‘పోచారం’
ఉదయం నుంచి రాత్రి వరకు పర్యటన అశోక్‌నగర్‌లో మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన హన్మకొండ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట మండలాల్లో ఏకధాటిగా ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయి పరిశీలనలు, సమీక్షలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు దుగ్గొండి మండలం గొల్లపల్లి గ్రామంలో సేంద్రియ పద్ధతిలో నిర్వహిస్తున్న ఆదర్శ రైతు తోట మల్లికార్జున గుప్తకు చెందిన 130 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం చెన్నారావుపేట మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభ నిర్వహించి, లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, హిటాచీ యంత్రాన్ని అందజేయనున్నారు. తర్వాత ఖానాపురం మండలంలోని అత్యంత కీలమైన పాకాల సరస్సును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పాకాల సమీపంలోని గిరక తాటిచెట్లను మంత్రి పరిశీలించనున్నారు. అనంతరం నర్సంపేటలోని ఓ ఫంక్షన్హాల్లో పీఏసీఎస్ సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. తర్వాత వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మిర్చి పరిశోధన కేంద్రం స్థల పరిశీలన.. ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్ వద్ద ఏర్పాటు చేయనున్న మిర్చి పరిశోధన కేంద్రానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పోచారం పరిశీలించనున్నారు. మిర్చి పరిశోధన కేంద్రం కోసం ఇప్పటికే అశోక్‌నగర్‌లో 90 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ తయారు చేసి కేంద్రానికి పంపాలని కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ భూమి అటవీశాఖ ఆధీనంలో ఉండడంతో ఇందుకు సంబంధించి మంత్రి అన్ని వివరాలు సేకరించనున్నారు. మంత్రి పోచారం పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. -
గోనమాకులపల్లె సోసైటీ డైరక్టర్లు రాజీనామా
కడప అగ్రికల్చర్ : వీరపునాయునిపల్లె మండలం గోనమాకుల పల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులు రాజీనామా చేశారు. దీంతో సంఘం (సొసైటీ) మొత్తం రద్దు కానున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సొసైటీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత డైరెక్టర్ వర్ధిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఏడుగురు డైరక్టర్లు నేరుగా కడప నగరం పాత రిమ్స్‌లోని డివిజనల్ లెవెల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని రాజీనామా పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా డైరక్టర్లు వెంకట్రామిరెడ్డి, గొట్లూరు చెన్నయ్య, లంగనూరు ఈశ్వరయ్య, లింగారెడ్డి శివలింగారెడ్డి, ఏకాశి కమలమ్మ, గోర్ల మల్లిఖార్జున, యాతం చిన్న ఓబులేశు, దాసరి నారాయణరెడ్డి మాట్లాడుతూ సొసైటీ అధ్యక్షుడు మురళీరెడ్డి ఏ విధంగాను మాకు సహరించడంలేదని, సొసైటీలో ఆయన మాటే చెల్లు బాటు కావాలంటూ పెత్తనం చెలాయించడంతో మేము ఎందుకు పనికి రాకుండా పోయామని, దీంతో తాము మా ప్రాంత రైతులకు న్యాయం చేయలేక పోతున్నామన్నారు. దీనికి నిరసనగానే తామంతా రాజీనామా చేశామన్నారు. ఈ సందర్భంలో డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీసర్ గురుప్రకాష్ మాట్లాడుతూ ఆ సొసైటీ సీఈఓ సెలవులో ఉన్నందున, రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. సొసైటీలో మొత్తం 13 మంది డైరక్టర్లు ఉన్నారని, వారిలో తనకు 8 మంది డైరక్టర్లు రాజీనామా పత్రాలు సమర్పించారని తెలిపారు. మెజార్టీ డైరక్టర్లు రాజీనామా చేసినందున సొసైటీ రద్దు అవుతుందని పేర్కొన్నారు. సొసైటీ పరిపాలనంతా సీఈఓ చేతికి వెళుతుందన్నారు. ఫోటోనెం: -
తెన్నేరు సొసైటీలో నిధులు గోల్మాల్?
తెన్నేరు (కంకిపాడు) : తెన్నేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొమ్మును అధ్యక్షుడు తన సొంతానికి వాడుకున్నారంటూ స్థానికులు కొందరు జిరాక్సు కాపీలు పంపిణీ చేసినట్లు తెలిసింది. సొసైటీ అధ్యక్షుడు భక్తవత్సలరావు సొమ్మును సొంతానికి వాడుకున్నారని గ్రామంలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. గల్లంతైన సొమ్ము సుమారుగా రూ.6 లక్షలు పైగా ఉంటుందని, దీనిలో ఇంకా రూ.3లక్షలు వరకూ సొసైటీ ఖాతాకు జమకావాల్సి ఉందని ప్రచారంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సొసైటీ కార్యదర్శిని కూడా పాలకవర్గం నిలుపుదల చేసింది. ఇది జరిగి 20 రోజులు పైగా గడుస్తుందని, అప్పటి నుంచి ఆ కార్యదర్శి విధులకు రావటం లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. సొసైటీ సొమ్ము దుర్వినియోగం అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారం వెనుక వాస్తవాలు వెలుగులోకి తేవాలని, సొసైటీని పరిరక్షించాలని కోరుతున్నారు. కేడీసీసీ బ్యాంకు సత్యనారాయణపురం బ్రాంచి అధికారులను సాక్షి సంప్రదించగా, నిధులు దుర్వినియోగం కాలేదన్నారు. అధ్యక్షుడు, కార్యదర్శికి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయని వివరించారు. దుష్ర్పచారం, నిధులు దుర్వినియోగం కాలేదు సొసైటీలో సొమ్ము దుర్వినియోగం కాలేదు. 2014లో తాను వాడిన సొమ్మును పైసా తో సహా లెక్క కట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో చెల్లించాను. సొసైటీలో 70 కట్టలు ఎరువులు లెక్క తగ్గింది. కట్టలు లెక్కతేల్చమని అన్నందుకు కార్యదర్శి కావాలనే నాపై దుష్ర్పచారం చేస్తున్నారు. సొసైటీ సొమ్ము సొంతానికి వాడుకోలేదు. ఇది వాస్తవం. భక్తవత్సలరావు పీఏసీఎస్ అధ్యక్షుడు -
రుణమాఫీలో బినామీలు
కొక్కిరాపల్లి సొసైటీలో వెలుగులోకి అక్రమాలు కార్యదర్శిని నిలదీసిన బాధితులు యలమంచిలి : బినామీ, కాలపరిమితి తీరిన రుణాలకు సంబంధించిన కుంభకోణంతో గతంలో కుదేలైన కొక్కిరాపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో ప్రస్తుతం రుణమాఫీలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు శనివారం బయటపడింది. సమగ్ర విచారణ జరిపితే ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులు బయటపడే అవకాశం ఉందని సభ్యరైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండో విడత రుణమాఫీ జాబితాలో పేర్లున్న పలువురు రైతులు శనివారం ఇంటర్నెట్ కేంద్రాల్లో తమ స్టేటస్‌ను తెలుసుకున్నారు. షేకిళ్లపాలేనికి చెందిన రాయి నూకరాజు ఈ సొసైటీలో రూ.4,193లు రుణం తీసుకున్నాడు. యలమంచిలి ఎస్బీఐలో కూడా రూ.43వేల వరకు పంటరుణం మంజూ రైంది. ఇవి కాకుండా అతని పేరుతో కొక్కిరాపల్లి సొసైటీలో రూ.1.8లక్షలు తీసుకున్నట్టు ఉంది. ఇది చూసి కంగారుపడిన నూకరాజు కుమార్తె లక్ష్మి శనివారం సొసైటీకి వచ్చి కార్యదర్శి రామకృష్ణ, సిబ్బందిని నిలదీశారు. తమకు సంబంధం లేని రుణాలు తమ పేరుతో ఎలా ఉన్నాయని ప్రశ్నించా రు. ఆమెకు మద్ధతుగా సభ్యరైతులు ఆడారి రమణబాబు, ఆడారి ఆదిమూర్తి కార్యదర్శిని నిలదీయడంతో కంప్యూటర్లో తప్పు వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కొత్తపాలెంకు చెందిన రాపేటి అప్పలనాయుడు తన ఆధార్‌కార్డు నంబరుతో వివరాలు చూస్తే ఊడా నర్సింహమూర్తి పేరుతో రూ.76,477 రుణం తీసుకున్నట్టు వచ్చింది. రిపోర్టుతో అతడు సొసైటీ కార్యాలయానికి వచ్చి వాపోయాడు. తాను రూ.40వేలు రుణం తీసుకున్నానని, తన ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో మరో వ్యక్తి పేరుతో వివరాలు రావడమేమిటని కార్యదర్శిని నిలదీశారు. పెదపల్లికి చెందిన మరిశావెంకటేశ్వరులు యలమంచిలి ఎస్బీఐలో రుణం తీసుకున్నారు. అతని కుమారుడు మరిసా రాము ఈ సొసైటీలో పంటరుణం పొందారు. వెంకటేశ్వరులు కొక్కిరాపల్లి సొసైటీలో ఎలాంటి రుణం తీసుకోలేదు. అయినప్పటికీ వెంకటేశ్వరులు ఆధార్ నంబర్‌తో కొఠారు మంగతల్లి, పండూరి నాగభూషణం, బోజా సోమునాయుడు పేర్లతో రుణాలు తీసుకున్నట్టు బయటపడింది. ఇవన్నీ బినామీ రుణాలుగానే వెంకటేశ్వరులు భావిస్తున్నారు. పైడాడ వెంకటేశ్వరులు అనే రైతు రూ.9,484 పంటరుణం సొసైటీ నుంచి తీసుకున్నారు. ఇతని ఆధార్, రేషన్ వివరాలు నమోదు చేస్తే గొల్లవిల్లి రాంబాబు పేరుతో రుణం తీసుకున్నట్టు సూచిస్తోంది. ఇదే తరహాలో పలువురు రైతుల పేర్లతో స్టేటస్ రిపోర్డులు వస్తున్నట్టు పలువురు రైతులు విలేకరులకు చెప్పారు. ఈ సొసైటీలో గతంలో తీసుకున్న బినామీ రుణాలు మాఫీ అయ్యేందుకు కొందరు వివరాలు తప్పుగా నమోదు చేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే భారీ స్థాయిలో అక్రమాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.