తెన్నేరు (కంకిపాడు) : తెన్నేరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొమ్మును అధ్యక్షుడు తన సొంతానికి వాడుకున్నారంటూ స్థానికులు కొందరు జిరాక్సు కాపీలు పంపిణీ చేసినట్లు తెలిసింది. సొసైటీ అధ్యక్షుడు భక్తవత్సలరావు సొమ్మును సొంతానికి వాడుకున్నారని గ్రామంలో కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. గల్లంతైన సొమ్ము సుమారుగా రూ.6 లక్షలు పైగా ఉంటుందని, దీనిలో ఇంకా రూ.3లక్షలు వరకూ సొసైటీ ఖాతాకు జమకావాల్సి ఉందని ప్రచారంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సొసైటీ కార్యదర్శిని కూడా పాలకవర్గం నిలుపుదల చేసింది. ఇది జరిగి 20 రోజులు పైగా గడుస్తుందని, అప్పటి నుంచి ఆ కార్యదర్శి విధులకు రావటం లేదని సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. సొసైటీ సొమ్ము దుర్వినియోగం అయ్యాయంటూ జరుగుతున్న ప్రచారం వెనుక వాస్తవాలు వెలుగులోకి తేవాలని, సొసైటీని పరిరక్షించాలని కోరుతున్నారు. కేడీసీసీ బ్యాంకు సత్యనారాయణపురం బ్రాంచి అధికారులను సాక్షి సంప్రదించగా, నిధులు దుర్వినియోగం కాలేదన్నారు. అధ్యక్షుడు, కార్యదర్శికి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయని వివరించారు.
దుష్ర్పచారం, నిధులు దుర్వినియోగం కాలేదు
సొసైటీలో సొమ్ము దుర్వినియోగం కాలేదు. 2014లో తాను వాడిన సొమ్మును పైసా తో సహా లెక్క కట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో చెల్లించాను. సొసైటీలో 70 కట్టలు ఎరువులు లెక్క తగ్గింది. కట్టలు లెక్కతేల్చమని అన్నందుకు కార్యదర్శి కావాలనే నాపై దుష్ర్పచారం చేస్తున్నారు. సొసైటీ సొమ్ము సొంతానికి వాడుకోలేదు. ఇది వాస్తవం. భక్తవత్సలరావు పీఏసీఎస్ అధ్యక్షుడు