ఎండుతున్న వరి పైరు
నగరం : వరుణుడు ముఖం చాటేయటంతో వరి సాగు ఎండుముఖం పట్టింది. పంట నేలలు బెట్టతీసి నెర్రెలిస్తున్నాయి. కాలువల్లో నీరు లేక వర్షాలు పడక వరి సాగు ఎలా చేయాలో అర్థం కాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలో 28 వేల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సివుండగా ఇప్పటివరకు 40 శాతం కూడా పూర్తికాలేదు. నాట్లు వేసిన రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరి పైరు 20 నుంచి 25 రోజుల దశలో ఉంది. ఈ తరుణంలో సాగు నీరందకపోవడంతో పొలాలు నెర్రెలిచ్చి పైరు ఎండుదశకు చేరుతోంది.
ఈ ఏడాది ఖరీప్ సాగు ఆరంభం నుంచి రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పంట కాలువలకు నీరు రాకపోవడంతో వరుణుడుపై భారం వేసి నాట్లు వేసిన రైతులు ప్రస్తుతం వాటిని రక్షించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు.
కాలువలకు అరకొరగావచ్చిన నీటిని ఎగువన ఉన్న రైతులు డీజిల్ ఇంజన్లు సాయంతో పొలాలకు పంపుతున్నారు.
సాగర్ జలాశయం గరిష్టమట్టానికి చేరుకున్నా కాలువలకు నీరు వదలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇరిగేషన్ అధికారులు మాత్రం సాగునీరు పుష్కలంగా ఉందనీ, రైతులు అందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నా, కాలువలకు మాత్రం నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.