రుణమాఫీలో బినామీలు
కొక్కిరాపల్లి సొసైటీలో వెలుగులోకి అక్రమాలు
కార్యదర్శిని నిలదీసిన బాధితులు
యలమంచిలి : బినామీ, కాలపరిమితి తీరిన రుణాలకు సంబంధించిన కుంభకోణంతో గతంలో కుదేలైన కొక్కిరాపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో ప్రస్తుతం రుణమాఫీలోనూ అక్రమాలు చోటు చేసుకున్నట్టు శనివారం బయటపడింది. సమగ్ర విచారణ జరిపితే ఈ వ్యవహారం వెనుక ఉన్న సూత్రధారులు బయటపడే అవకాశం ఉందని సభ్యరైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండో విడత రుణమాఫీ జాబితాలో పేర్లున్న పలువురు రైతులు శనివారం ఇంటర్నెట్ కేంద్రాల్లో తమ స్టేటస్‌ను తెలుసుకున్నారు. షేకిళ్లపాలేనికి చెందిన రాయి నూకరాజు ఈ సొసైటీలో రూ.4,193లు రుణం తీసుకున్నాడు. యలమంచిలి ఎస్‌బీఐలో కూడా రూ.43వేల వరకు పంటరుణం మంజూ రైంది. ఇవి కాకుండా అతని పేరుతో కొక్కిరాపల్లి సొసైటీలో రూ.1.8లక్షలు తీసుకున్నట్టు ఉంది. ఇది చూసి కంగారుపడిన నూకరాజు కుమార్తె లక్ష్మి శనివారం సొసైటీకి వచ్చి కార్యదర్శి రామకృష్ణ, సిబ్బందిని నిలదీశారు. తమకు సంబంధం లేని రుణాలు తమ పేరుతో ఎలా ఉన్నాయని ప్రశ్నించా రు. ఆమెకు మద్ధతుగా సభ్యరైతులు ఆడారి రమణబాబు, ఆడారి ఆదిమూర్తి కార్యదర్శిని నిలదీయడంతో కంప్యూటర్‌లో తప్పు వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కొత్తపాలెంకు చెందిన రాపేటి అప్పలనాయుడు తన ఆధార్‌కార్డు నంబరుతో వివరాలు చూస్తే ఊడా నర్సింహమూర్తి పేరుతో రూ.76,477 రుణం తీసుకున్నట్టు వచ్చింది. రిపోర్టుతో అతడు సొసైటీ కార్యాలయానికి వచ్చి వాపోయాడు. తాను రూ.40వేలు రుణం తీసుకున్నానని, తన ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో మరో వ్యక్తి పేరుతో వివరాలు రావడమేమిటని కార్యదర్శిని నిలదీశారు. పెదపల్లికి చెందిన మరిశావెంకటేశ్వరులు యలమంచిలి ఎస్‌బీఐలో రుణం తీసుకున్నారు. అతని కుమారుడు మరిసా రాము ఈ సొసైటీలో పంటరుణం పొందారు. వెంకటేశ్వరులు కొక్కిరాపల్లి సొసైటీలో ఎలాంటి రుణం తీసుకోలేదు. అయినప్పటికీ వెంకటేశ్వరులు ఆధార్ నంబర్‌తో కొఠారు మంగతల్లి, పండూరి నాగభూషణం, బోజా సోమునాయుడు పేర్లతో రుణాలు తీసుకున్నట్టు బయటపడింది. ఇవన్నీ బినామీ రుణాలుగానే వెంకటేశ్వరులు భావిస్తున్నారు.
పైడాడ వెంకటేశ్వరులు అనే రైతు రూ.9,484 పంటరుణం సొసైటీ నుంచి తీసుకున్నారు. ఇతని ఆధార్, రేషన్ వివరాలు నమోదు చేస్తే గొల్లవిల్లి రాంబాబు పేరుతో రుణం తీసుకున్నట్టు సూచిస్తోంది. ఇదే తరహాలో పలువురు రైతుల పేర్లతో స్టేటస్ రిపోర్డులు వస్తున్నట్టు పలువురు రైతులు విలేకరులకు చెప్పారు. ఈ సొసైటీలో గతంలో తీసుకున్న బినామీ రుణాలు మాఫీ అయ్యేందుకు కొందరు వివరాలు తప్పుగా నమోదు చేయించినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపితే భారీ స్థాయిలో అక్రమాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.