Prime Minister Awaaz Yojana
-
'సింగిల్' లేదు..'డబుల్' లేదు!
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో పెద్దగా పురోగతి లేదు. ఎన్నికల్లోగా అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ప్రస్తుతం ఆ హామీ పూర్తి స్థాయి అమలుకు నోచుకునేలా కనిపించడం లేదు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం సింగిల్ బెడ్రూం ఇళ్ల కోసం నిధులిచ్చింది. వీటితో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయింది. ఇటీవల పీఎంఏవై పథకం అమలు తీరుపై కేంద్రం తెలంగాణను తీవ్రంగా ఆక్షేపించింది. తెలంగాణకు ఇచ్చిన నిధులను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశం జారీ చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శలతో ముంచెత్తుతున్నాయి. సింగిల్ లేదు.. డబుల్ లేదు.. ప్రజలను హామీల పేరుతో మభ్యపెడుతున్నారని ప్రతిపక్షాలు వాగ్బాణాలు సంధిస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ నెరవేరని ప్రధాన హామీ..! వాస్తవానికి డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పెట్టిన కీలక హామీల్లో ఒకటి. పేదలకు సొంతింటి కల నెరవేరుస్తాం, చిన్నగూడులాంటి ఇళ్లు కాకుండా విశాలంగా ఉండేలా రెండు పడకగదులతో ఇళ్లు నిర్మిస్తామని హామీనిచ్చింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ హామీపై తొలి రెండేళ్లు ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. 2016 మొదట్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టాలెక్కించింది. అయితే ఆ ఏడాది కేవలం 864 ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగింది. దీంతో అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఎన్నికలకు ఇంకా సమయముందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. 2018 జూలై 31 వరకు హౌసింగ్ శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 13,927 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.2,461 కోట్లు వెచ్చించింది. దసరాకు అందని ద్రాక్షే.. 1.6 లక్షల ఇళ్లను 2018 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దసరాలోపు కనీసం కొన్నింటినైనా పూర్తి చేసి అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దసరాకు కొన్ని చోట్ల డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి సీఎం పేషీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగింది. ఎంత వేగం పెంచినా అదంతా తలకు మించిన భారం కావడంతో దసరాకు ఇళ్లను పూర్తి చేయలేకపోయారు. ఇటు సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయడంతో డబుల్ ఇళ్ల ప్రధాన హామీనే నెరవేర్చలేకపోయారని ప్రతిపక్షాలు కూడా విమర్శలకు పదునుపెట్టాయి. డబుల్ ఇళ్ల స్థితిగతుల వివరాలు.. - డబుల్ ఇళ్లు ప్రారంభమైన జిల్లాలు: అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభం - ఎక్కువగా నిర్మించిన జిల్లాలు: సిద్దిపేట–3,605, ఖమ్మం–1,854, మహబూబ్‌నగర్–1,505, భద్రాద్రి కొత్తగూడెం–1,230, జీహెచ్ఎంసీ పరిధిలో–572 ఇళ్లు పూర్తి.. - ఒక్క ఇల్లు కూడా పూర్తవ్వని జిల్లాలు: జోగులాంబ, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, కొమురం భీం, మంచిర్యాల, వికారాబాద్.. వెనక్కి ఇవ్వాల్సిందే..: కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు 190.78 కోట్ల నిధులు తీసుకుంది. వీటిలో 2016–17 సంవత్సరానికి 50,959 ఇళ్లు, 2017–18 సంవత్సరానికి 19,715.. మొత్తం 70,674 ఇండ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ సింగిల్ బెడ్రూం ఇళ్లే. అక్టోబర్ 3న ఢిల్లీలో ఈ పథకంపై సమీక్ష జరిగింది. ఇన్నేళ్లల్లో ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించగా.. దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. దీంతో తీసుకున్న నిధులను వెంటనే తిరిగి కట్టాలని ఆదేశించింది. -
అందరికీ సొంతిళ్లు నా స్వప్నం
జుజ్వా (గుజరాత్): దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ప్రతి కుటుంబం సొంత ఇళ్లు కలిగి ఉండేలా చూడటమే తన స్వప్నమని ప్రధాని మోదీ అన్నారు. దళారుల పాత్ర లేకపోవడం వల్ల ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లక్షిత లబ్ధిదారులకే చేరుతోందన్నారు. గుజరాత్ వల్సాద్ జిల్లాలోని జుజ్వాలో గురువారం నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల సామూహిక ఆన్లైన్ గృహ ప్రవేశ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే లబ్ధిదారులకు వెళ్తోందన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లబ్ధిదారులకు చేరుతోందని అన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందడానికి లబ్ధిదారులు లంచాలు చెల్లించనక్కర్లేదని నొక్కిచెప్పారు. వల్సాద్ జిల్లా కొండ ప్రాంతాల్లోని సుమారు 175 గ్రామాలకు తాగునీరు అందించే రూ.586 కోట్ల ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. కాంట్రాక్టర్లు కాదు.. లబ్ధిదారులపైనే నమ్మకం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని మోదీ అన్నారు. ‘ఇళ్లు పొందేందుకు లంచాలు ఇచ్చారా? అని దేశం మొత్తం చూస్తుండగా, మీడియా సమక్షంలోనే లబ్ధిదారులను ప్రశ్నించే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది. నిబంధనల ప్రకారమే ఇళ్లు వచ్చాయని, లంచం చెల్లించే అవసరం రాలేదని తల్లులు, సోదరీమణులు సంతృప్తికర సమాధానమిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నా. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నా, ఇంటిని ఎలా నిర్మించాలి? ఏయే సామగ్రి వినియోగించాలి? లాంటి వాటిని కుటుంబమే నిర్ణయిస్తుంది. కాంట్రాక్టర్లు కాకుండా లబ్ధిదారులపైనే నమ్మకం ఉంచుతాం’ అని మోదీ అన్నారు. సొంతిళ్లు పొందటంపై లబ్ధిదారుల అనుభవాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, బాలికల విద్య, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్ కనెక్షన్ తదితరాల గురించి వాకబు చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో దేశంలో విద్యుత్ సౌకర్యంలేని ఇళ్లు ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. ‘స్వచ్ఛ్భారత్’ అప్పుడే చేపట్టి ఉంటే.. స్వచ్ఛ్భారత్ లాంటి పారిశుధ్య కార్యక్రమాలను 70 ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టి ఉంటే దేశం ఇప్పటికే వ్యాధిరహితంగా మారేదన్నారు. పారిశుధ్యానికి చేపట్టిన చర్యల వల్లే 3 లక్షల మంది చిన్నా రులను కాపాడుకోగలిగామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను ఉటంకించారు. జునాగఢ్‌లో గుజరాత్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సొసైటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ‘టాయిలెట్లు నిర్మించడం, చెత్త ఏరడం... ఇవి ప్రధాని పనులా? అని విపక్షాలు హేళనచేశాయి. ఈ పనులన్నీ 70 ఏళ్ల క్రితమే చేసి ఉంటే నేడు దేశంలో ఒక్క వ్యాధి కూడా ఉండేది కాదు’ అని అన్నారు. తర్వాత గాంధీ నగర్లో గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. -
లబ్ధిదారుల ఎంపిక వేగిరం
డబుల్ బెడ్రూం ఇళ్లపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు ఖరారైన ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికను చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జాప్యం ఉండొ ద్దన్నారు. ఈ పథకంలో 50,959 ఇళ్ల నిర్మా ణానికి మొదట విడతలో ప్రధాని ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.190.66 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. రెండు పడక గదుల ఇళ్లు, రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు పనితీరుపై బుధవారం ఆయన సమీక్ష జరిపారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటోందని, కాంట్రాక్టర్లు ఆసక్తి చూపుతున్నారని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 94,250 ఇళ్ల నిర్మాణానికి పాలనపరమైన అనుమతులు వచ్చా యని, 83,087 ఇళ్లకు టెండర్లు పిలవగా 41,925 ఇళ్లకు ఖరారైనట్లు చెప్పారు. ప్రస్తుతం 20,986 ఇళ్ల పనులు కొనసాగు తున్నాయని, 1,629 ఇళ్లు సిద్ధమయ్యాయని వివరించారు. ఇప్పటివరకు రూ.202.85 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గృహ నిర్మాణ మండలి రూ.1,066.94 కోట్లతో చేపట్టే 13 ప్రాజెక్టులకు త్వరగా డిమాండ్ సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. కూకట్‌పల్లిలోని 200 ఎంఐజీ ప్లాట్ల నోటిఫికే షన్‌కు స్పందన రానందున మరోసారి డిమాండ్ సర్వే నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. హౌసింగ్ బోర్డు ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రావాల్సిన రూ.207.98 కోట్ల బకాయిలను వసూలు చేయాలని ఆదేశిం చారు. జేఎన్టీయూకు లీజుకిచ్చిన భూమి లో కొంతభాగం ఓ ప్రైవేటు సొసైటీ ఆక్ర మణలో ఉందని, దాన్ని స్వాధీనం చేసుకోవా లని ఆదేశించారు. లీజు గడువు ముగిసిన వాటి వివరాలను అందజేయాలన్నారు. జేఎన్టీయూ చెల్లించాల్సిన రూ.10.53 కోట్ల లీజు రెంట్‌కు సంబంధించి ఆ వర్సిటీ వీసీ, ఉన్నత విద్యా శాఖ మంత్రి, స్పెషల్ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.