హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పురోగతి లేని డబుల్ బెడ్రూం ఇళ్లు..
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో పెద్దగా పురోగతి లేదు. ఎన్నికల్లోగా అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి తీరుతామని కేసీఆర్ ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ప్రస్తుతం ఆ హామీ పూర్తి స్థాయి అమలుకు నోచుకునేలా కనిపించడం లేదు. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం సింగిల్ బెడ్రూం ఇళ్ల కోసం నిధులిచ్చింది. వీటితో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయింది. ఇటీవల పీఎంఏవై పథకం అమలు తీరుపై కేంద్రం తెలంగాణను తీవ్రంగా ఆక్షేపించింది. తెలంగాణకు ఇచ్చిన నిధులను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశం జారీ చేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శలతో ముంచెత్తుతున్నాయి. సింగిల్ లేదు.. డబుల్ లేదు.. ప్రజలను హామీల పేరుతో మభ్యపెడుతున్నారని ప్రతిపక్షాలు వాగ్బాణాలు సంధిస్తున్నాయి.
– సాక్షి, హైదరాబాద్
నెరవేరని ప్రధాన హామీ..!
వాస్తవానికి డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్ పెట్టిన కీలక హామీల్లో ఒకటి. పేదలకు సొంతింటి కల నెరవేరుస్తాం, చిన్నగూడులాంటి ఇళ్లు కాకుండా విశాలంగా ఉండేలా రెండు పడకగదులతో ఇళ్లు నిర్మిస్తామని హామీనిచ్చింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ హామీపై తొలి రెండేళ్లు ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదు. 2016 మొదట్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టాలెక్కించింది. అయితే ఆ ఏడాది కేవలం 864 ఇళ్లు మాత్రమే పూర్తి చేయగలిగింది. దీంతో అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాల నుంచి ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఎన్నికలకు ఇంకా సమయముందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. 2018 జూలై 31 వరకు హౌసింగ్ శాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 13,927 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.2,461 కోట్లు వెచ్చించింది.
దసరాకు అందని ద్రాక్షే..
1.6 లక్షల ఇళ్లను 2018 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దసరాలోపు కనీసం కొన్నింటినైనా పూర్తి చేసి అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దసరాకు కొన్ని చోట్ల డబుల్ ఇళ్ల ప్రారంభోత్సవాలు చేయాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి సీఎం పేషీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగింది. ఎంత వేగం పెంచినా అదంతా తలకు మించిన భారం కావడంతో దసరాకు ఇళ్లను పూర్తి చేయలేకపోయారు. ఇటు సెప్టెంబర్ 6న కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేయడంతో డబుల్ ఇళ్ల ప్రధాన హామీనే నెరవేర్చలేకపోయారని ప్రతిపక్షాలు కూడా విమర్శలకు పదునుపెట్టాయి.
డబుల్ ఇళ్ల స్థితిగతుల వివరాలు..
- డబుల్ ఇళ్లు ప్రారంభమైన జిల్లాలు: అన్ని జిల్లాల్లో పనులు ప్రారంభం
- ఎక్కువగా నిర్మించిన జిల్లాలు: సిద్దిపేట–3,605, ఖమ్మం–1,854, మహబూబ్‌నగర్–1,505, భద్రాద్రి కొత్తగూడెం–1,230, జీహెచ్‌ఎంసీ పరిధిలో–572 ఇళ్లు పూర్తి..
- ఒక్క ఇల్లు కూడా పూర్తవ్వని జిల్లాలు: జోగులాంబ, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, కొమురం భీం, మంచిర్యాల, వికారాబాద్..
వెనక్కి ఇవ్వాల్సిందే..: కేంద్రం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు 190.78 కోట్ల నిధులు తీసుకుంది. వీటిలో 2016–17 సంవత్సరానికి 50,959 ఇళ్లు, 2017–18 సంవత్సరానికి 19,715.. మొత్తం 70,674 ఇండ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఇవన్నీ సింగిల్ బెడ్రూం ఇళ్లే. అక్టోబర్ 3న ఢిల్లీలో ఈ పథకంపై సమీక్ష జరిగింది. ఇన్నేళ్లల్లో ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించగా.. దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. దీంతో తీసుకున్న నిధులను వెంటనే తిరిగి కట్టాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment