పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యంగల పృథ్వీ-2 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలంపై 350 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ఉదయం 9:15 గంటలకు ప్రయోగించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైనట్లు తెలిపాయి. అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థగల పృథ్వీ-2 ఈ ప్రయోగంలో భాగంగా బంగాళాఖాతంలోని ఓ ప్రాంతంలో నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించిందని వివరించాయి.
500 కేజీల నుంచి 1,000 కేజీల వరకూ వార్హెడ్లను మోసుకెళ్లగల సామర్థ్యంగల ఈ క్షిపణి గతి మార్గాన్ని డీఆర్డీవో రాడార్లు, టెలిమెట్రీ స్టేషన్లు ఆసాంతం పరిశీలించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పృథ్వీ-2 క్షిపణి ప్రోగ్రామ్ డెరైక్టర్లు ఎ.డి. అదాలత్ అలీ, ఎన్. శివసుబ్రమణ్యం, ఇతర అధికారులు ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. మరోవైపు ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు శాస్త్రవేత్తల బృందాన్ని రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అభినందించారు.