ప్రయాణికుల కస్సు‘బస్సు’
సాక్షి, ఒంగోలు: ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందులో భాగంగానే ఎన్నికల వేళ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పడరాని పాట్లు పడక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో అద్దె బస్సులతో కలిపి 800 బస్సులు ఉండగా వాటిలో 600 బస్సులను ఎన్నికల విధులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు వచ్చేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
బస్సులన్నీ ఎన్నికల విధులకే..
జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందిని సంబంధిత పోలింగ్ స్టేషన్లకు తరలించడం.. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం.. అనంతరం సిబ్బందిని తిరిగి రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న ప్రాంతానికి తరలించడం వరకు సిబ్బంది కోసం జిల్లా యంత్రాంగం ఆర్టీసీ బస్సులు అందిపుచ్చుకుంది. పల్లె వెలుగు (తెలుగు వెలుగు) సర్వీసులన్నీ ఎన్నికల విధులకు కేటాయించేశారు. బస్సులన్నీ ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటలకల్లా రైజ్ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చారు.
ఇక ఆర్టీసీ వద్ద మిగిలిన సర్వీసులు కేవలం 200 మాత్రమే. వాటిలో దాదాపు 150 వరకు సర్వీసులు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాలకు నడుస్తుంటాయి. ఇక మిగిలింది కేవలం 50 బస్సులు మాత్రమే. ఈ 50 బస్సులే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది. ఈ బస్సులన్నీ కూడా డీలక్స్, సూపర్‌లగ్జరీతో పాటు ఇతర ఏసీ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా ప్రధాన రూట్లలో మాత్రమే తిరుగుతుండటంతో పల్లెకు వెళ్లాంటే పాట్లు తప్పనిసరి. క్యాబ్‌లు, ఆటోలు, ట్రక్కులు తదితరాలే దిక్కుగా మారనున్నాయి.
నిలువు దోపిడీ
అవకాశం లభిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నిలువు దోపిడీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పటికే పలు ప్రైవేటు బస్సులను నెల రోజుల క్రితమే బుక్ చేసుకోవడంతో ప్రయాణికులు కాస్త ఊరట చెందారు. అలా కాకుండా కుటుంబంతో రావాలంటే ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాకు చెందిన అనేక మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వారంతా స్వగ్రామాలకు వచ్చి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తిప్పకుంటే వారంతా ఇబ్బందులు పడటం ఖాయం.
హైదరాబాద్‌కు..
హైదరాబాద్ నుంచి ఒంగోలుకు ఆర్టీసీకి నాన్ ఏసీ బస్సుకు రూ.391 వసూలు చేస్తారు. కానీ ప్రైవేటు ఆపరేటర్లు వసూలు చేస్తున్న చార్జీలను పరిశీలిస్తే ఈ నెల 7న రూ.780, 8న రూ.1090, 9న రూ.1390, 10న రూ.1490 చేరింది.
చెన్నైకు..
చెన్నై నుంచి ఒంగోలుకు నాన్ ఏసీ ఆర్టీసీ చార్జీ రూ.351 మాత్రమే. ఇదే ప్రైవేటు ఆపరేటర్లు అయితే రోజుకో రేటు చొప్పున దండుకుంటున్నారు. 7,8,9 తేదీల్లో చార్జీ ధర రూ.428 ఉండగా 10న మాత్రం ఏకంగా ఇదే చార్జీ రూ.1425లకు చేరింది.
బెంగళూరుకు..
బెంగళూరు నుంచి ఒంగోలుకు ఆర్టీసీ నాన్ ఏసీ చార్జీ రూ.612 మాత్రమే. ప్రస్తుతం అదనపు బస్సులు వేయాల్సిన ఆర్టీసీ మౌనం వహించడంతో ప్రైవేటు ఆపరేటర్లు చార్జీలను భారీగా పెంచేశారు. ఈ నెల 7న రూ.1290, 8న రూ.940, 9న రూ.1415, 10న రూ.1900 ధరలు నిర్ణయించడం గమనార్హం.