బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ | The RTC 50 per cent of the additional charges crash | Sakshi
Sakshi News home page

బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ

Published Wed, Jan 13 2016 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ

బస్సుల ‘సంక్రాంతి’ దోపిడీ

♦ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లు
♦ ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీల మోత
 
 సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సంబరం అయినవారందరితో జరుపుకోవాలని పిల్లాపాపలతో సొంతూళ్లకు పయనమవుతున్నారు నగరవాసులు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు దోపిడీకి తెరలేపాయి. ప్రత్యేక బస్సుల పేరిట యాభై నుంచి వంద శాతానికి పైగా అదనపు చార్జీలతో ప్రయాణికులను నిలువునా దోచుకొంటున్నాయి. రద్దీ అధికంగా ఉన్న మార్గాల్లో హద్దూ అదుపూ లేకుండా టికెట్ల రేట్లు పెంచేసి సగటు జీవి పండుగ సంబరాన్ని ఆవిరి చేస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లయితే ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్నారు.

 మూడు రోజుల్లో పది లక్షల మంది...
 సంక్రాంతి పండుగ కోసం గత మూడు రోజుల్లో దాదాపు 10 లక్షల మంది నగరవాసులు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న అరకొర రైళ్లు కిటకిటలాడుతున్నాయి. వెయిటింగ్ లిస్టు చాంతాడంత ఉంటోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు ప్రయాణికులు. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2,470 ప్రత్యేక బస్సుల్లో 50  శాతం అదనపు చార్జీ వసూలు చేస్తోంది. రెగ్యులర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.304 వరకు చార్జీ ఉంటే ప్రస్తుతం అది రూ.450 దాటింది. అన్ని ప్రధాన రూట్లలోనూ ఇదే పరిస్థితి. ఇక ప్రైవేట్ బస్సుల్లో విశాఖపట్టణానికి ఏసీ బస్సుకు సాధారణ రోజుల్లో రూ.750 వరకు చార్జీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1600 వరకు వసూలు చేస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులతో సొంతూరికి పయనమవుతున్న మధ్యతరగతి వ్యక్తి విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు చార్జీల రూపంలోనే రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా పండుగ ఆనందం ఆవిరైపోతోంది.
 
 ఇది అన్యాయం...
 ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలతో చుక్కలు చూపిస్తున్నాయి. సంక్రాం తికి సొంత ఊరుకు వెళ్లడం కంటే ఇక్కడే ఉండిపోతే బాగుండేదనిపిస్తుంది. పండుగ పేరిట ఇలా సామాన్య ప్రజలపై భారం మోపడం అన్యాయం.
 - ఫల్గుణ, మూసాపేట్  
 
 సర్వీసులు పెంచాల్సింది
 పండుగకు శ్రీకాకుళానికి బయలుదేరాం. కానీ ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ఉన్నాయి. ప్రైవేట్ బస్సుల్లో చార్జీల మోతమోగుతోంది. రైళ్లు కూడా చాలినన్ని లేవు. ఇంటిల్లిపాదీ కలిసి వెళ్లాలంటే భయమేస్తుంది. ఆర్టీసీ సర్వీసుల్ని పెంచాల్సింది.
 - గిరిడ చిన్నారావు, కూకట్‌పల్లి
 
 విజయవాడకు రూ.1000!
 ప్రైవేట్ బస్సుల్లో చార్జీలు దారుణంగా పెంచారు. సాధారణ రోజుల్లో విజయవాడకు రూ.350 తీసుకుంటారు. ఇప్పుడేమో రూ.1000కి పైనే డిమాండ్ చేస్తున్నారు. రైళ్లూ అరకొరానే. ఊరికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు.
 -  శివ, కేపీహెచ్‌బీ

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement