విమాన ప్రమాదంలో లాడెన్ కుటుంబ సభ్యుల మృతి
లండన్: దక్షిణ ఇంగ్లండ్‌లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో అల్‌కాయిదా ఒకప్పటి చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులు మృతిచెందారు. వారు ప్రయాణిస్తున్న ఫీనమ్ 300 అనే ప్రైవేట్ జెట్ విమానం హాంప్‌షైర్‌లోని బ్లాక్‌బుషె ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌అయ్యేందుకు ప్రయత్నిస్తూ కుప్పకూలింది. రన్‌వేను దాటి దూసుకెళ్లిన విమానం ఫెన్సింగ్‌ను తాకి సమీపంలో ఉన్న కార్ల వేలంపాట సంస్థ ప్రదేశంలో బోల్తాపడి పేలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ సహా నలుగురు మృతిచెందారు.
మృతుల్లో లాడెన్ సవతి తల్లి, సోదరి, ఆమె భర్త ఉన్నట్లు అరబ్ మీడియా పేర్కొంది. ఇటలీలోని మిలాన్-మాల్పెన్సా ఎయిర్‌పోర్టు నుంచి ఈ విమానం బయలుదేరింది. బిన్ లాడెన్ తండ్రి మొహమ్మద్ బిన్ లాడెన్ సైతం 1967లో సౌదీ అరేబియాలో జరిగిన విమాన ప్రమాదంలో మృతిచెందారు.