అడ్మిషన్‌కు లకారం
- ప్రైమరీలో ప్రవేశానికి వేలకు వేలు
- లక్ష పలుకుతున్న పలు స్కూళ్లు
- రకరకాల పేర్లతో ఫీజుల వసూలు
- విద్యా శాఖ అదుపు శూన్యం
రూ.లక్షా ఇరవై వేలు... ప్రైమరీ క్లాసుల్లో ప్రవేశానికి కొన్ని కార్పొరేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజు ఇది. చాలామంది దిగువ మధ్యతరగతి ఉద్యోగుల ఏడాది జీతంతో సమానం. తల తాకట్టు పెట్టయినా పిల్లలకు మంచి చదువులు చెప్పించాలన్న తల్లిదండ్రుల ఆశలే వారి ప్రైవేటు పాఠశాలల ధనదాహానికి ఆలంబన. పేరున్న స్కూల్లో చేర్పిస్తే బాగా చదువుకుంటారని కొందరు, ఫౌండేషన్ బాగుంటే భవిష్యత్ బాగుంటుందని మరికొందరు తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పించడానికి సిద్ధమవుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి.
విశాఖపట్నం: మూడో ఏట అడుగుపెడుతున్న బుజ్జాయిలను స్కూల్లో చేర్పించాలంటే అక్షరాలా రూ. లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠాశాలలు రకారకాల పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డు అండ్ సెకండరీ ఎడ్యుకేషన్), ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యావిధానం అనుసరిస్తున్న పాఠశాలలకు డిమాండ్ ఎక్కువ. కొన్ని పాఠశాలలు ఐజీసీఎస్ఈ, ఐబీ, స్టేట్ బోర్డు సిలబస్‌లు అందిస్తున్నాయి. ప్రయివేట్ పాఠశాలల్లో మూడు కేటగిరీలున్నాయి. పిల్లలకు ప్రైమరీ స్కూల్లో చేర్పించడానికి చిన్న స్కూల్స్ రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు, ఓ మాదిరీ స్థాయి పాఠశాలలు రూ.5 వేలు నుంచి రూ. 30 వేలు, కార్పొరేట్ పాఠశాలలు రూ.30 వేల నుంచి రూ. లక్షా 20 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజులు కేవలం మూ డేళ్ల పిల్లలను స్కూల్లో చేర్పించడానికి మాత్రమే. మళ్లీ నెలసరి ఫీజులు చెల్లించుకోవాలి. ఎల్కేజీ నుంచి 1వ తరగతి వరకు నెలసరి ఫీజు రూ.500 నుంచి రూ. 20 వేల వరకు ఉంటోంది. టెన్త్ క్లాస్ వరకు ఏడాదికి ఏడాది ఫీజులు పెంచుతున్నారు.
ప్రయివేట్ పాఠశాలపై మోజు...
తల్లిదండ్రులకు ప్రయివేట్ పాఠశాలలపై ఉన్న మోజు తెలి సిందే. ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు ఇటీవల కాలం లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా ఆ ముద్ర అలా ఉండిపోయింది. ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ వైపే అడుగులు వేస్తున్నారు. అందులో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ అందిస్తు న్న పాఠశాలల గురించి వాకబు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు సీబీఎస్ఈ కోర్సుకు ప్రైమరీ అడ్మిషన్‌కు రూ. 50 వేలు నుంచి రూ.లక్షా 20 వేలు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజుల నియంత్రణకు ఎలాంటి చట్టాలు లేకపోవడంతో ఏటా పెరుగుతున్నాయి. జిల్లాలో 769 ప్రయివేట్ పాఠశాలలున్నాయి. వాటిలో 120 వరకు కార్పొరేట్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చదవాలనుకునే వారికి రూ.లక్షల్లో ఫీజులుంటున్నాయి. అడ్మిషన్స్ ఫీజులు కాకుండా ట్యూషన్ ఫీజు, రిఫండ్బుల్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, కల్చరల్ ఫీజు, ప్రత్యేక రోజుల్లో వేడుకలు నిర్వహించడానికి, యూనిఫాం, పుస్తకాల కోసం అదనంగా వసూలు చేస్తున్నారు.
నిబంధనలకు నీళ్లు...
ప్రయివేట్ పాఠశాలలు నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. ప్రతి పాఠశాల తమ ఫీజులు తెలియజేసే విధంగా బోర్డులో రాయాలి. ప్రతి ఏడాది ఇష్టానుసారంగా ఫీజులు పెంచకుండా కమిటీ వేయాలి. కమిటీలో పేరెంట్స్ యూనియన్ నుంచి ఒక ప్రతినిధిని కలుపుకుని ఏటా ఫీజులు పెంచే విషయమై చర్చించి ఆమోదమయ్యాక పెంచాలి. ఇవేమీ అమలు కావడం లేదు. ఇలాంటి స్కూల్స్‌పై జిల్లా విద్యాశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.