ప్రియాంక ఫోన్ చేశాకే..!
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు కుదరటంలో ప్రియాంక గాంధీ కీలకంగా వ్యవహరించారు. అఖిలేశ్ వర్గంతో కాంగ్రెస్ మహామహులు చర్చలు జరిపినా, నేరుగా రాహుల్ గాంధీ మాట్లాడినా పొత్తు విషయంలో ముందుకు సాగని వ్యవహారం.. ప్రియాంక రంగంలోకి దిగటంతోనే సెటిలైనట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి 11.30 గంటలకు అఖిలేశ్, డింపుల్ (అఖిలేశ్ భార్య)లతో ఫోన్లో మాట్లాడి పొత్తుకు ఒప్పించారు. సోనియా ఫోన్ చేసినా యూపీ సీఎం స్పందించలేదంటూ వచ్చిన వదంతులపై అఖిలేశ్, ప్రియాంక ఫోన్ సంభాషణ సందర్భంగా నవ్వుకున్నారు. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ శనివారం సాయంత్రం చేసిన ట్వీట్ (చిన్న స్థాయి వ్యక్తులు కాదు.. ఎస్పీతో యూపీ సీఎంతో ప్రియాంక, గులాంనబీ ఆజాద్ చర్చలు జరుపుతున్నారు) కూడా ప్రియాంక పాత్ర కీలకం కాబోతుందని స్పష్టం చేసింది.
పొత్తు ఖరారవటంతో ప్రచారంలోనూ ప్రియాంక–డింపుల్ (నారీ శక్తి) జోడీ దూసుకుపోతుందని.. అంచనావేస్తున్నారు. అటు డింపుల్ కూడా ఎస్పీ మేనిఫెస్టోలో ఉచిత ‘ప్రెషర్ కుక్కర్’ ఉండేలా చొరవతీసుకున్నారు. ఇన్నాళ్లూ.. రాయ్‌బరేలీ, అమేథీకే పరిమితమైన ప్రియాంక ఇకపై రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసేలా షెడ్యూల్ సిద్ధమవుతోంది. ‘ప్రియాంక చాలా దూకుడుగా ఉంటారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. కూటమి లేకుంటే కాంగ్రెస్‌కు మరిన్ని ఇబ్బందులు తప్పవని అర్థం చేసుకునే పొత్తుకు ప్రియాంక చొరవ తీసుకున్నారు’ అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు. దీంతో యూపీ ఎన్నికల తర్వాత కేంద్ర పార్టీలోనూ ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించొచ్చని తెలుస్తోంది.