Priyanth
-
హద్దు దాటలేదు
‘‘నటనలో శిక్షణ తీసుకోలేదు. కానీ సినిమాల పట్ల ఆసక్తితోనే హీరోగా చేశా. రియలిస్టిక్ సినిమాలంటే ఇష్టపడతా’’ అని ప్రియాంత్ అన్నారు. రమణ మొగిలి దర్శకత్వంలో ప్రియాంత్, యామినీ భాస్కర్ జంటగా తెరకెక్కిన ‘కొత్తగా మా ప్రయాణం’ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రియాంత్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారు డాక్టర్. నేను సీఎస్ (కంపెనీ సెక్రటరీ) చేశాను. ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నా. ఇప్పటి సాఫ్ట్వేర్ కల్చర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. ఉద్యోగరీత్యా సొంత కుటుంబాలకు దూరంగా జీవిస్తున్న నేటి యువత ప్రవర్తన ఎలా ఉంది? అన్నదే కథాంశం. సినిమాలో అనవసరమైన రొమాన్స్ సీన్స్‌ను పెట్టలేదు. ఎక్కడా హద్దు దాటలేదు. మా సినిమాతో పాటు ‘మిస్టర్. మజ్ను, మణికర్ణిక: ఝాన్సీ రాణి ’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక ఆడియన్‌గా నేనూ పెద్ద సినిమాలే చూడాలని కోరుకుంటాను. కానీ మా సినిమాలోని డిఫరెంట్ పాయింట్ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తుంది. హైదరాబాద్ లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో ప్రసాద్ అనే కొత్త దర్శకుడితో నా నెక్ట్స్ సినిమా ఉంటుంది’’ అన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ
‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం రమణ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ఈ సినిమాతో ప్రియాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్ కథానాయిక. నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. రమణ మాట్లాడుతూ– ‘‘నెలకు 2లక్షల జీతం తీసుకుంటూ పదిమందికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. అందరికీ సాయపడే తత్వం ఉన్నా ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అతనికి అంతగా నమ్మకం ఉండదు. అలాంటివాడు మన సంప్రదాయం గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ప్రియాంత్‌కి తొలి సినిమానే అయినా చక్కగా నటించాడు. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్. -
వినూత్న జననం
భువన్, ప్రియంత్, గీతాభగత్, శ్రీవాణి ముఖ్య తారలుగా ఎస్.ఎల్. మణి దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జననం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తొగ రాణా అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్రచార చిత్రాన్ని, ఈ నెల ద్వితీయార్ధంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ వినూత్న కథాంశంతో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
'జననం' స్వరాలాపాన
భువన్, ప్రియాంత్, శ్రావణసంధ్య, గీతాభగత్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘జననం’. ఎస్.ఎల్.మణిగంజి దర్శకత్వంలో నూతన నిర్మాత ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాతే స్వరాలను కూడా అందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎన్.శంకర్ ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని సునీల్‌కుమార్‌రెడ్డికి అందించారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. రెండు కోణాలున్న ప్రేమకథాచిత్రమిదని, అమ్మ ప్రేమకు, ప్రియురాలి ప్రేమకూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇందులో చూపించామని దర్శకుడు తెలిపారు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాత చెప్పారు. చిత్ర యూనిట్సభ్యులందరూ పాల్గొన్న ఈ కార్యక్రమంలో వి.సాగర్, హీరోలు శ్రీ, మనోజ్‌నందం తదితరులు కూడా పాల్గొన్నారు.