Pro Volleyball League
-
త్వరలోనే కొత్త లీగ్.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ సహా 6 జట్లు
సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ క్రీడను మరింత ఆకర్షణీయంగా మార్చే క్రమంలో కొత్తగా మరో లీగ్ తెరపైకి వచ్చింది. ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్’ పేరుతో దీనిని నిర్వహించనున్నారు. ఇందులో హైదరాబాద్ బ్లాక్ హాక్స్, చెన్నై బ్లిట్జ్, బెంగళూరు టార్పెన్డోస్, కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్ పేర్లతో ఆరు నగరాలకు చెందిన జట్లు ఉంటాయి. ఈ టోర్నీ వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీ కోసం వేలం ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు. 2019లో జరిగిన ప్రొ వాలీబాల్ లీగ్‌లో స్వల్ప మార్పులు చేసి కొత్తగా ఈ టోర్నీని ముందుకు తెచ్చారు. ఫ్రాంచైజీల చేతుల్లోనే టోర్నీ మొత్తం యాజమాన్య హక్కులు ఉండే పద్ధతిలో తొలిసారి ఇలాంటి టోర్నమెంట్ జరగనుందని ప్రైమ్ వాలీబాల్ లీగ్ లీగ్ సీఈఓ జాయ్ భట్టాచార్య వెల్లడించారు. ఆన్లైన్ కంపెనీ ఏ23, ప్లేయర్ మేనేజ్మెంట్ సంస్థ బేస్‌లైన్ వెంచర్స్ లీగ్‌లో ప్రధాన భాగస్వాములు కాగా... సోనీ నెట్వర్క్ ఈ లీగ్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. కార్యక్రమంలో టీమ్‌ల యజమానులు, సోనీ ప్రతినిధులతో పాటు భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు పీవీ రమణ కూడా పాల్గొన్నారు. చదవండి: Neeraj Chopra: ఒలింపిక్ రికార్డును సవరించాల్సి ఉంది -
విజేత చెన్నై స్పార్టన్స్
ప్రొ వాలీబాల్ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో చెన్నై స్పార్టన్స్ 15–11, 15–12, 16–14తో కాలికట్ హీరోస్‌ను ఓడించింది. లీగ్ మొత్తంలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్ చేరిన కాలికట్ హీరోస్ తుది పోరులో చతికిలపడటం గమనార్హం. చెన్నై తరఫున రూడీ వెరోఫ్ 13 పాయింట్లు స్కోరు చేయగా... కాలికట్ తరఫున అజిత్ లాల్ తొమ్మిది పాయింట్లు సంపాదించాడు. ఈ విజయంతో చెన్నై స్పార్టన్స్ జట్టు ఆసియా పురుషుల క్లబ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. -
కొచ్చిపై విజయంతో ఫైనల్లో చెన్నై స్పార్టన్స్
చెన్నై: ప్రొ వాలీబాల్ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో చెన్నై స్పార్టన్స్ 16–14, 9–15, 10–15, 15–8, 15–13తో విజయం సాధించింది. స్పైక్ షాట్ల ద్వారా 47 పాయింట్లు సాధించిన చెన్నై... బ్లాకింగ్‌లో నాలుగు, సర్వీస్‌లో మూడు పాయింట్లు గెలిచింది. చెన్నై తరఫున రుస్లాన్స్ సోరోకిన్స్ 17 పాయింట్లు... నవీన్ రాజా జాకబ్ 13 పాయింట్లు స్కోరు చేశారు. గురువారం విశ్రాంతి దినం తర్వాత శుక్రవారం జరిగే ఫైనల్లో కాలికట్ హీరోస్తో చెన్నై స్పార్టన్స్ జట్టు తలపడుతుంది. -
ఫైనల్లో కాలికట్ హీరోస్
చెన్నై: తొలిసారి నిర్వహిస్తున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కాలికట్ హీరోస్ జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో కాలికట్ 15–12, 15–9, 16–14 (3–0) స్కోరుతో యు ముంబా వాలీపై విజయం సాధించింది. కాలికట్ తరఫున కెప్టెన్ జెరోమ్ వినీత్ 12 పాయింట్లతో (10 స్పైక్స్, 2 సర్వ్) చెలరేగగా... ముంబా తరఫున వినీత్ కుమార్ అత్యధికంగా 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే రెండో సెమీఫైనల్లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో చెన్నై స్పార్టన్స్ తలపడుతుంది. -
చెన్నై స్పార్టన్స్‌పై యు ముంబా గెలుపు
ప్రొ వాలీబాల్ లీగ్‌లో ఎట్టకేలకు బోణీ కొట్టిన యు ముంబా వాలీ జట్టు సెమీస్ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది. శనివారం చెన్నై స్పార్టన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 15–14, 15–8, 15–10, 10–15, 10–15తో నెగ్గింది. యు ముంబా కెప్టెన్ దీపేశ్ సిన్హా (11 పాయింట్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతను 5 స్పైక్, 2 బ్లాక్, మరో 4 సర్వీస్ పాయింట్లు సాధించాడు. నాలుగు మ్యాచ్‌లాడిన యు ముంబాకిది తొలి గెలుపు కాగా... చెన్నై కూడా నాలుగు మ్యాచ్‌లాడి ఒకటే గెలిచింది. నేడు చెన్నై స్పార్టన్స్‌తో అహ్మదాబాద్ డిఫెండర్స్ తలపడుతుంది. -
ప్లే ఆఫ్‌కు కొచ్చి బ్లూ స్పైకర్స్
ప్రొ వాలీబాల్ లీగ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్ జట్టు నాలుగో విజయం సాధించి ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. చెన్నై స్పార్టన్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కొచ్చి 12–15, 10–15, 15–11, 15–13, 15–10తో గెలిచింది. కొచ్చి తరఫున ప్రభాకరన్ 12 పాయింట్లు, ప్రవీణ్ కుమార్ 11 పాయింట్లు స్కోరు చేశారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ఐదు మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న కొచ్చి నాలుగు విజయాలు సాధించి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేడు జరిగే మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ హైదరాబాద్‌తో యు ముంబా వ్యాలీ జట్టు తలపడుతుంది.