Production of foodgrains
-
సామాజిక ఆర్థిక సర్వే 2018
తగ్గిన ఆహార ధాన్యాల ఉత్పత్తి.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఈ ఏడాది 9.8 శాతం వృద్ధి నమోదైనప్పటికీ ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంటల సాగులో మాత్రం గత ఏడాది కన్నా రాష్ట్రం వెనకబడింది. 2017–18 సంవత్సరానికి గానూ రెండో ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 31.87 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అయితే, గత ఏడాది 34.39 లక్షల హెక్టార్లలో సాగు కావడం గమనార్హం. అంటే గత ఏడాదితో పోలిస్తే పంటల సాగు 7.33 శాతం తగ్గిందన్నమాట. ఇక, ఆహార ధాన్యాల దిగుబడి విషయంలోనూ తగ్గుదల కనిపిస్తోంది. గత సంవత్సరం మొత్తం 101.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే, ఈ ఏడాది 95.01 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుందని సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేసింది. పంటల సాగులో నల్లగొండ ఫస్ట్ సాగుకు యోగ్యమైన భూముల్లో పంటల సాగు విషయంలో నల్లగొండ జిల్లా ముందుందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. ఈ జిల్లాలో ఉన్న 4.2 లక్షల హెక్టార్ల సాగు యోగ్య భూమిలో 3.6 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. పంటల సాగులో వరంగల్ అర్బన్ 0.6 లక్షల హెక్టార్లతో చివరి స్థానంలో ఉంది. అయితే, సాగుకు యోగ్యమైన భూముల్లో పంటలు సాగయ్యే విస్తీర్ణ రాష్ట్ర సగటు 1.2 లక్షల హెకార్లు కాగా, రాష్ట్రంలోని 15 జిల్లాలు ఈ సగటు కన్నా వెనుకబడి ఉన్నాయి. పాలు, గుడ్లు ఓకే ఇక, మాంసకృత్తులుండే ఆహార ఉత్పత్తుల విషయంలోనూ రాష్ట్ర పరిస్థితి బాగానే ఉంది. 2016–17 సంవత్సరంలో మొత్తం 4,681 టన్నుల పాల ఉత్పత్తి అయితే 2017–18లో అక్టోబర్ నాటికే 2,894 టన్నుల పాల ఉత్పత్తి జరిగిందని సామాజిక ఆర్థిక సర్వే చెబుతోంది. గుడ్ల విషయానికి వస్తే గత ఆర్థిక సంవత్సరంలో 1,181.86 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో 2017 అక్టోబర్ నాటికి 718.31 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యాయి. 2016–17లో 591 టన్నుల మాంసం ఉత్పత్తి అయితే, 2017 అక్టోబర్ నాటికి 379 టన్నులు వచ్చింది. -
తగ్గిన ఖరీఫ్ వరి దిగుబడి
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2017–18 ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి లక్ష్యం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెండో ముందస్తు అంచనా నివేదిక విడుదల చేసింది. 2 లక్షల టన్నులకుపైగా వరి ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే, 4 లక్షల టన్నుల మేర ఆహార ఉత్పత్తులు తగ్గాయి. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి ఆశించిన మేర లేకపోవడంతో రబీపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి 44.72 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుందని సర్కారు తాజా నివేదికలో అంచనా వేసింది. వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే, రబీలో వరినాట్లు కేవలం 87 శాతానికే పరిమితం కావడం గమనార్హం. -
ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం కుదింపు
గతేడాది కంటే 7 లక్షల టన్నులు తగ్గుదల సాక్షి, హైదరాబాద్: వచ్చే వ్యవసాయ సీజన్లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. 2016–17 వ్యవసాయ సీజన్లో 97.41 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, 2017–18 ఆర్థిక సంవత్సరంలో 90.89 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించింది. 2017–18 వ్యవసాయ ప్రణాళికలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆ ప్రణాళిక త్వరలో విడుదల కానుంది. మొత్తం ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం 2016–17లో 87.60 లక్షల ఎకరాలు లక్ష్యంగా ఉండగా, ఈసారి 81.25 లక్షల ఎకరాలకు తగ్గించాలని నిర్ణయించడం వల్లే వాటి ఉత్పత్తి లక్ష్యాన్ని కూడా తగ్గించారు. ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం తగ్గి పత్తి సాగు విస్తీర్ణం పెరిగే పరిస్థితి ఉండటంతో ఈ లక్ష్యాలను ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆహారధాన్యాల్లో కీలకమైన వరి ఉత్పత్తి లక్ష్యం మాత్రం గతేడాది కంటే పెరిగింది. 2016–17లో వరి ఉత్పత్తి లక్ష్యం 55.43 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2017–18లో 58.11 లక్షల టన్నులకు పెంచారు. 2.68 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ఉత్పత్తి చేయాలన్నది ఉద్దేశం. కానీ పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం మాత్రం తగ్గింది. 2016–17లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 5.78 లక్షల మెట్రిక్ టన్నులుండగా, ఈసారి 4.69 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం కానుందని వ్యవసాయ ప్రణాళిక వెల్లడించింది.